ఏపీలో 2029 నాటికి పేదరికాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం ఈ క్రమంలో పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పీపుల్-పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్ షిప్(పీ-4)గా పేర్కొనే ఈ కార్యక్రమం ద్వారా వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ క్రమంలో కార్పొరేట్ దిగ్గజాలు, పారిశ్రామిక వేత్తలు, ఆర్థికంగా బలంగా ఉన్న రాజకీయ నేతలు, అధికారులు కూడా పీ-4లో భాగస్వామ్యం కావాలని సీఎం చంద్రబాబు గతంలోనే పిలుపునిచ్చారు.
ఈ ఏడాది ఉగాది సందర్భంగా పీ-4 కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బంగారు కుటుంబాలు- మార్గదర్శులతో మంగళగిరిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. ఇప్పటి వరకు ప్రభుత్వం బంగారు కుటుంబాలు, మార్గదర్శుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. పీ-4లో దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించింది. ఆయా కుటుం బాలను దత్తత తీసుకుని వారిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు మార్గదర్శలుగా లక్షా 40 వేల మంది పారిశ్రామిక వేత్తలు, ప్రవాసాంధ్రులను నమోదు చేసింది.
తాజాగా ప్రారంభించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 2029 నాటికి 20 లక్షల కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు పెద్దపీట వేయా లని నిర్ణయించినట్టు తెలిపారు. పీ-4 ద్వారా పలువురికి ఉద్యోగాలు లభించాయన్నారు. మంచి కార్యక్రమం చేయడం ద్వారా చరిత్రలో నిలిపోతామని చెప్పారు. గతంలోనూ తాను సీఎంగా ఉన్న సమయంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు చంద్రబాబు తెలిపారు. శ్రమదానం, నీరు-చెట్టు, జన్మభూమి వంటి కార్యక్రమాలను ప్రారంభించినట్టు చంద్రబాబు తెలిపారు.