‘మయసభ’ వెబ్ సిరీస్ రివ్యూ నటీనటులు: ఆది పినిశెట్టి- చైతన్య రావు- తన్య రవిచంద్రన్- సాయికుమార్- శ్రీకాంత్ అయ్యంగార్- రవీంద్ర విజయ్- దివ్య దత్తా- నాజర్- శత్రు- శకుల్ శర్మ తదితరులు సంగీతం: శక్తికాంత్ కార్తీక్ ఛాాయాగ్రహణం: సురేష్ రగుతు- జ్ఞానశేఖర్ నిర్మాతలు: జయకృష్ణ లింగమనేని- శ్రీ హర్ష రచన: దేవా కట్టా దర్శకత్వం: దేవా కట్టా- కిరణ్ జై కుమార్
చేసినవి తక్కువ సినిమాలే అయినా గొప్ప అభిరుచి, విషయ పరిజ్ఞానం ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు దేవా కట్టా. ప్రస్థానం.. రిపబ్లిక్ లాంటి చిత్రాలతో పొలిటికల్ థ్రిల్లర్లు తీడయంలో తన నైపుణ్యాన్ని ఆయన చాటాడు. ఇప్పుడాయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించి నాయకుల కథను ‘మయసభ’ వెబ్ సిరీస్ ద్వారా తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. సోనీ లివ్ ద్వారా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: చిత్తూరు జిల్లాలోని నర్సిపల్లిలో ఓ దిగువ మధ్య తరగతిలో పుట్టిన కృష్ణమ నాయుడు (ఆది పినిశెట్టి)కు కాలేజీ రోజుల నుంచే రాజకీయాల్లో ఎదిగిపోవాలని కోరిక. ఇంట్లో పరిస్థితులు అనుకూలించకపోయినా పీజీ పూర్తి చేసిన అతను.. ఆ తర్వాత కూడా తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా పీహెచ్డీలో చేరి స్టూడెంట్స్ పాలిటిక్స్ లోకి అడుగు పెడతాడు. కానీ అక్కడ ఏదీ అతను అనుకున్నట్లుగా జరగదు. రాజకీయాల్లో అడుగడుగునా ఎదురు దెబ్బలు తగులుతాయి. తాను ప్రేమించిన అమ్మాయి కూడా దూరం అవుతుంది. మరోవైపు కడప జిల్లాకు చెందిన ఎంఎస్ రామిరెడ్డి (చైతన్య రావు) ఎంబీబీఎస్ చదువుతుంటాడు. అతడికి పెద్ద డాక్టర్ కావడం మీదే దృష్టి ఉంటుంది. కానీ కొడుకును రాజకీయ నేతగా చూడాలన్నది అతడి తండ్రి కల. కానీ తండ్రికి గూండాగా పేరుండడంతో.. రామిరెడ్డి రాజకీయాల్లోకి రావాలని చూసినా అడ్డంకులు తప్పవు. మరి అనుకోకుండా మిత్రులుగా మారిన కృష్ణమ నాయుడు-రామిరెడ్డి.. ఒకరికొకరు సహకారం అందించుకుంటూ రాజకీయాల్లో ఎలా ఎదిగారు.. సవాళ్లను ఎలా ఛేదించారు.. వీరి ప్రయాణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పింది అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ: ఒక ఎన్టీఆర్.. ఒక చంద్రబాబు నాయుడు.. ఒక వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఒక పరిటాల రవి.. ఒక వంగవీటి రాధా.. 70వ దశకం నుంచి ఓ పాతికేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అత్యంత ప్రభావం చూపిన నాయకుల జాబితా ఇది. వీళ్లందరి మీదా విడివిడిగా సినిమాలు చూశాం. ఎన్టీఆర్ మీద ఆయన తనయుడు బాలకృష్ణ ప్రధాన పాత్రలో ‘యన్.టి.ఆర్’ సినిమా తీశారు. వైఎస్ కథతో ‘యాత్ర’ సినిమా వచ్చింది. పరిటాల రవి మీద ‘రక్త చరిత్ర’.. వంగవీటి రాధా మీద ‘వంగవీటి’ లాంటి చిత్రాలు వచ్చాయి. చంద్రబాబు మీద కూడా ఒక అన్ పాపులర్ సినిమా వచ్చింది. పైన చెప్పుకున్న కొన్ని సినిమాల్లో ఆయన పాత్రను కీలకంగా చూపించారు. ఐతే ఆయా నాయకుల కథలతో వచ్చిన సినిమాలు వారికి అనుకూలంగా.. వారి దృక్కోణంలోనే సాగాయి. వాటిలో ఆ నేతలను గొప్పగా చూపించి.. అవతలి నాయకులను కొంచెం తక్కువ చేసి చూపించడం చూశాం. అందుకే ఎవరికి అనుకూలంగా వాళ్లు సినిమాలు తీసుకున్నారంటూ వాటి మీద ‘ప్రాపగండా’ ముద్ర పడింది. అలా కాకుండా అందరి పాత్రలను వాస్తవానికి దగ్గరగా చూపిస్తూ.. అందరినీ ఎలివేట్ చేస్తూ.. సమతూకం పాటిస్తూ సాగిన సినిమా దాదాపుగా ఏదీ లేదనే చెప్పాలి. అలా అందరి పాత్రలను బ్యాలెన్స్ చేయడం అసాధ్యం అనే అనుకున్నారంతా! కానీ దేవా కట్టా అసాధ్యం అనుకున్న ఈ విషయాన్ని ‘మయసభ’లో సుసాధ్యం చేసి చూపించాడు.
‘మయసభ’లో చూపించిందంతా కూడా నిజం అని చెప్పలేం.. ఎగ్జాజరేషన్లు లేవని కాదు.. ఈ టీం పొలిటికల్ కరెక్ట్‌నెస్ కోసం ప్రయత్నించలేదని కాదు. కానీ ఉన్నంతలో వాస్తవికంగా ఆయా నాయకుల జీవితాలను చూపిస్తూ.. సమతూకం పాటిస్తూ.. అదే సమయంలో వారి కథలను ఆసక్తికరంగా తెరపై ప్రెజెంట్ చేయడంలో దేవా కట్టా అండ్ కో విజయవంతం అయింది. ఇదొక కల్పిత కథ అని.. ఇందులోని పాత్రలను ఎవరినీ పోలినవి కాదని.. అలాంటి పోలికలేమైనా కనిపించినా అది కాకతాళీయమని.. రాజకీయ చిత్రాలకు వేసే డీఫాల్ట్ డిస్క్లైమర్ దీనికి కూడా వేశారు కానీ.. ఈ సిరీస్ టైటిల్ పక్కన కనిపించే క్యారికేచర్ రూపాలను చూస్తేనే ఏ ఇద్దరు నాయకుల కథ అన్నది అర్థమైపోతుంది. ఆది పినిశెట్టి చేసిన కృష్ణమనాయుడు పాత్ర చంద్రబాబు నాయుడిదైతే.. చైతన్యరావు పోషించిన ఎంఎస్ రామిరెడ్డి క్యారెక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఉద్దేశించింది. కళాశాల స్థాయి నుంచి మొదలుపెట్టి.. రాజకీయాల్లో మంత్రుల స్థాయికి ఎదిగే వరకు వీరి జీవితాలను ఈ సిరీస్ లో చూడొచ్చు. ఈ క్రమంలో ఇందిరా గాంధీ.. సంజయ్ గాంధీ.. నాదెండ్ల భాస్కర రావు.. ఎన్టీఆర్.. పరిటాల రవి.. వంగవీటి రాధా లాంటి ఆ తరం ముఖ్య రాజకీయ నేతలందరి పాత్రలు.. వారికి సంబంధించిన కీలక రాజకీయ పరిణామాలను ఇందులో చూస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామాలు.. అనూహ్యమైన మలుపులు చోటు చేసుకుందే 1970-2000 మధ్య. కొన్ని తరాలను ప్రభావితం చేసే స్థాయి నాయకులు తెరపైకి వచ్చింది కూడా ఆ కాలంలోనే. కాబట్టి నాటి రాజకీయ పరిణామాలను.. ఆ నాయకుల కథలను ఆసక్తికరంగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేసింది దేవా కట్టా అండ్ కో. చంద్రబాబు.. వైఎస్ జీవితాలకు సంబంధించి జన బాహుళ్యంలో ప్రచారంలో ఉన్న విషయాలతో పాటు తెలియని సంగతులు.. అలాగే కొన్ని కల్పిత అంశాలను జోడించి ఆసక్తికర స్క్రీన్ ప్లేతో ఈ సిరీస్ ను నడిపించారు. అక్కడక్కడా కొన్ని సీన్లు కొంచెం నాటకీయంగా.. వాస్తవ విరుద్ధంగా అనిపించినా సరే.. డ్రామాను రక్తి కట్టించడంలో దేవా కట్టా అండ్ టీం విజయవంతం అయింది. తొమ్మిది ఎపిసోడ్లతో దాదాపు ఆరు గంటలకు పైగా నిడివితో సాగే సిరీస్ లో బోరింగ్ అని ఏ ఎపిసోడ్ అనిపించదు. ప్రతి ఎపిసోడ్ ఒక ఎత్తుగడతో మొదలై.. షార్ప్ ఎండింగ్ తో తర్వాతి ఎపిసోడ్ మీద క్యూరియాసిటీ పెంచేలా సాగుతాయి. తెలిసిన సన్నివేశాలను కూడా ఆసక్తిగా చూసేలా ప్రెజెంట్ చేశారు. తెలియని సీన్లు మరింత క్యూరియస్ గా అనిపిస్తాయి. కులం చుట్టూ తిరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయం గురించి చాలా ఓపెన్ గానే చర్చించారిందులో. ఈ విషయంలో ముసుగులో గుద్దులాట లాంటిదేమీ లేదు. కులం ప్రస్తావన లేని సీన్లు అరుదుగా కనిపిస్తాయి. డైలాగులు ఆశ్చర్యపరిచేలా.. హార్డ్ హిట్టింగ్ గా ఉన్నాయి. కృష్ణమ నాయుడు.. రామిరెడ్డిల కాలేజీ జీవితం వరకు సాగే సన్నివేశాలు కొంచెం అటు ఇటుగా అనిపించినా.. వారి రాజకీయ ప్రయాణం మొదలయ్యాక ‘మయసభ’లో వేగం పెరుగుతుంది. ఇందిర చుట్టూ తిరిగిన ఢిల్లీ రాజకీయాలు.. ప్రభుత్వాలను నిలబెట్టడంలో- పడగొట్టడంలో ఆమె చాణక్యం.. ఆంధ్రప్రదేశ్ నాయకులతో ఇందిర-సంజయ్ గాంధీ ఆడుకున్న తీరును ఇందులో చాలా ఎఫెక్టివ్ గా చూపించారు. ఎమర్జెన్సీ సీన్లు మాత్రం కొంచెం అనాసక్తికరంగా అనిపిస్తాయి. చివరి రెండు మూడు ఎపిసోడ్లలో ఇంటెన్సిటీ పెరుగుతుంది. ఎన్టీఆర్ పాత్ర ప్రవేశంతో సిరీస్ రసవత్తరంగా మారుతుంది. ఆ పాత్ర చుట్టూ తిరిగే చివరి ఎపిసోడ్ ‘మయసభ’కు హైలైట్. శ్రీకాంత్ అయ్యంగార్ చేసిన నాదెండ్ల భాస్కరరావు పాత్రను వినోదాత్మకంగా మలిచారు. ఇంటెన్స్ గా సాగే సిరీస్ లో అది కొంచెం రిలీఫ్ లాగా అనిపిస్తుంది. ‘మయసభ’లా అంతా సూపర్ అని చెప్పలేం. కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. మిగతా పాత్రలు.. వాటి వ్యవహారాలు బాగున్నా.. పరిటాల రవి-వంగవీటి రాధాల చుట్టూ తిరిగే సన్నివేశాలు మాత్రం అంత ప్రభావవంతంగా లేవు. ఇక ‘మయసభ’లో అక్కడక్కడా కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు. చంద్రబాబు-వైఎస్ మధ్య నిజంగా అంత స్నేహం.. సమన్వయం ఉండేదా.. ఇద్దరూ అంత గొప్ప వాళ్లా అనిపించేలా ఆ పాత్రలను తీర్చిదిద్దారు. ఐతే ఈ ప్రతికూలతలున్నప్పటికీ.. ఉన్నంతలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ముఖ్యమైన నాయకులు.. అప్పటి కీలక పరిణామాల చుట్టూ ఎంతో ఆసక్తికరంగానే ఈ సిరీస్ సాగుతుంది. పొలిటికల్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ సిరీస్ నచ్చుతుంది.
నటీనటులు: ‘మయసభ’లో ప్రధాన పాత్రలు పోషించిన ఇద్దరు నటులూ పోటాపోటీగా నటించారు. ఆది పినిశెట్టి చంద్రబాబు పోలినట్లు కనిపించలేదు. హావభావాల్లో ఆయన్ని అనుకరించడానికీ ప్రయత్నించలేదు. కానీ చంద్రబాబు ఆలోచన విధానం ప్రతిబింబించేలా ఆ పాత్రను పోషించాడు. కానీ రాజకీయాల్లో ఎదగాలని తపించే యువకుడి పాత్రలో ఒదిగిపోయాడు. సిరీస్ ఆద్యంతం ఒక ఇంటెన్సిటీ మెయింటైన్ చేశాడు ఆది. ఇక చైతన్య రావుకు నటుడిగా ఇది కెరీర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ట్రైలర్ చూస్తే ఇతను వైఎస్ పాత్రలో మెప్పించగలడా అని సందేహాలు కలిగాయి కానీ.. సిరీస్ లో మాత్రం అతను అంచనాలను మించిపోయాడు. వైఎస్ ను గుర్తుకు తెచ్చేలా నటించాడు. పాత్రలో పరిణామ క్రమాన్ని అతను తన నటనతో బాగా చూపించాడు. చివరి రెండు మూడు ఎపిసోడ్లలో చైతన్యరావు నటన మరింత మెప్పిస్తుంది. తమిళ అమ్మాయి తన్య రవిచంద్రన్ ఓ ముఖ్య పాత్రలో రాణించింది. ఎన్టీఆర్ పాత్రలో సాయికుమార్ అదరగొట్టాడు. ఇందిరా గాంధీగా దివ్య దత్తా లుక్ సరిపోనప్పటికీ.. ఆమె నటన మాత్రం బాగుంది. సంజయ్ గాంధీ పాత్రలో చేసిన నటుడూ ఆకట్టుకున్నాడు. శ్రీకాంత్ అయ్యంగార్.. రవీంద్ర విజయ్.. శత్రు.. వీళ్లంతా కూడా బాగా చేశారు. రామోజీ రావు పాత్రలో నాజర్ ఓకే అనిపించారు. సాంకేతిక వర్గం: టెక్నికల్ గా ‘మయసభ’ ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కింది. వెబ్ సిరీస్ అయినా సినిమాకు ఏమాత్రం తక్కువ కాని క్వాలిటీ కనిపిస్తుంది. ప్రతి ఎపిసోడ్లో భారీతనానికి లోటు లేదు. 70-80 దశకాల వాతావరణాన్ని చూపించడంలో శ్రమ తెరపై కనిపిస్తుంది. శక్తికాంత్ కార్తీక్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. పాటలు అంతగా మెప్పించవు. సురేష్ రగుతు.. జ్ఞానశేఖర్ కలిసి అందించిన ఛాయాగ్రహణం చాలా బాగుంది. దేవా కట్టా రైటింగ్ సినిమాకు మేజర్ హైలైట్. వాస్తవ ఘటనలు.. కల్పిత అంశాలతో సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా నడిపించాడు. తన మాటలు తూటాల్లా పేలాయి. దేవా-కిరణ్ జై కుమార్ దర్శకత్వం కూడా ఆకట్టుకుంటుంది. ప్రతి ఎపిసోడ్ బోర్ కొట్టకుండా నడిపించారు. నడిపించారు. స్క్రీన్ ప్లే బాగా తీర్చిదిద్దుకున్నారు. టేకింగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా సాగింది.
రేటింగ్- 3.5/5