చూసినంతనే ఫిదా అయ్యే అందం.. ఆమె మాటలు.. నవ్వుకు ఎవరైనా సరే ఇట్టే పడిపోయేలా చేసే టాలెంట్ ఆమె సొంతం. ఇవి చాలు కదా.. మగాళ్లను అడ్డంగా బుక్ చేసేందుకు. టీచర్ గా పని చేస్తూ.. కష్టపడి సంపాదించే కన్నా.. తన అందంతో తాను టార్గెట్ చేసిన వారిని పెళ్లి పేరుతో బుక్ చేసి.. ఆపై వేధింపులతో చుక్కలు చూపించి.. భారీగా డబ్బులు తీసుకొని తన దారిన తాను వెళ్లిపోయే సమీరా ఫాతిమా ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.
మహారాష్ట్రకు చెందిన ఈ కిలేడీ వ్యవహారం వెలుగు చూసి.. ఆమె గురించి తెలిసిన వారంతా అవాక్కు అవుతున్న పరిస్థితి. నిత్య పెళ్లికూతురుగా మోసాలు చేసే ఆమె.. ఇప్పటికి ఎనిమిది మందిని విజయవంతంగా పెళ్లి చేసుకోవటమే కాదు.. అంతే సక్సెస్ ఫుల్ గా వారికి చుక్కలు చూపించి జంప్ అయ్యేది. ఈ క్రమంలో వారి నుంచి భారీగా డబ్బులు వసూలు చేయటంలో ఆమె టాలెంట్ వేరే లెవల్ అంటున్నారు.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దుర్బుద్ధి ఆమెను తప్పుల మీద తప్పులు చేసేలా చేశాయి. పదిహేనేళ్ల కాల వ్యవధిలో ఏకంగా ఎనిమిది మందిని పెళ్లాడి.. విడిపోయిన ఆమె.. తాజాగా తొమ్మిదో పెళ్లికి రెఢీ అయ్యింది. మరో బకరాను బుక్ చేసేందుకు కాఫీ షాప్ వద్ద వెయిట్ చేస్తున్న ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఆమె ఎనిమిది పెళ్లిళ్ల భాగోతం బయటకు రావటంతో పోలీసులు సైతం షాక్ తిన్న పరిస్థితి. మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన సమీరా ఫాతిమా రూటు సపరేటు. మిగిలిన అమ్మాయిల మాదిరి కాకుండా మ్యాట్రిమోనీ.. సోషల్ మీడియాలో డబ్బున్న మగాళ్లను టార్గెట్ చేసేది. తన భర్త చనిపోయాడని.. కష్టాల్లో ఉన్నట్లుగా చెప్పేది. తనకు ఒక్క బిడ్డ ఉన్నట్లుగా చెప్పి.. తన మాటలతో సానుభూతి పొందేలా చేస్తుంది. అనంతరం వారికి దగ్గర కావటం.. పెళ్లి చేసుకుంటుంది. వారి మధ్య సాగే సంభాషణల్ని రహస్యంగా రికార్డు చేస్తుంది. వాటిని ఎడిట్ చేసి.. తప్పుడు కేసులు పెట్టి డబ్బులు వసూలు చేసేది.
బాధితుల్లో ఒకరు ఆమెకు రూ.50 లక్షలు సమర్పించుకోగా.. మరొకరు రూ.15 లక్షలు.. ఇలా అందరిని అడ్డంగా బుక్ చేసేది. ఆమె బాధితుల జాబితాలో రిజర్వు బ్యాంకు అధికారి కూడా ఉండటం గమనార్హం. అయితే.. ఆమె చేసే మోసాలు ఆమె ఒక్కతే కాదు.. ఒక టీంగా ఏర్పడి చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆమె మీద నమోదైన కేసుల నుంచి తప్పించుకు తిరుగుతూనే.. కొత్త టార్గెట్లను ఫిక్సు చేసుకొని వారిని మోసం చేయటం చూస్తే.. ఆమె టాలెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చంటున్నారు.
ఒక సందర్భంలో ఆమె అరెస్టు అయ్యే పరిస్థితుల్లో తాను ప్రెగ్నెంట్ అని చెప్పి తప్పించుకొని పరారైనట్లుగా తెలుస్తోంది. ఆమెకు ఇప్పటికే 12 ఏళ్ల కుమార్తె ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ పాప తండ్రి ఎవరన్న దానిపై స్పష్టత రాలేదు. అరెస్టు చేసిన ఈ కిలేడీని కోర్టు ఎదుట హాజరుపర్చగా.. ఆమెను మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇక.. ఆమె చేతిలో మోసపోయిన ఎనిమిది మంది మాజీ భర్తలు తాము మోసానికి గురైన వైనానికి సంబంధించిన అఫిడవిట్లు సమర్పించారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో మరో ఆసక్తికర కోణం ఏమంటే.. ఆమె తాను పెళ్లాడిన ఎనిమిది మందిని చట్టబద్ధంగా పెళ్లి చేసుకుంది. ఏ ఒక్కరితోనూ విడాకులు తీసుకోలేదన్న విషయాన్ని గుర్తించారు. ఈమె వెనుకున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.