తూర్పు గోదావరి జిల్లాలో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. షెల్టర్ జోన్ లో ఆశ్రయం పొందిన మావోయిస్టు ఆగ్రనేతలు మరణించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ కగార్ తో చెల్లాచెదురైన మావోయిస్టు అగ్రనేతలు కొందరు మారేడుమిల్లి వచ్చినట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందినట్లు చెబుతున్నారు. దీంతో మారెడుమిల్లి వెళ్లిన భద్రతా బలగాలు మావోయిస్టు నేతలను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా, ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటరులో సుమారు ఆరుగురు మరణించారని చెబుతున్నారు. మృతులను ఇంకా గుర్తించాల్సివుంది.
ఈ ఎన్ కౌంటర్ తో ఏపీలో మావోయిస్టుల అలికిడి మళ్లీ మొదలైందా? అన్న చర్చ జరుగుతోంది. చాలాకాలం నుంచి రాష్ట్రంలో మావోయిస్టుల జాడ లేదు. పోలీసుల కూంబింగ్ తో రాష్ట్రం నుంచి సురక్షిత ప్రాంతాలకు మావోయిస్టులు తరలివెళ్లిపోయారు. ఎక్కువగా ఒడిశా, చత్తీస్ గడ్ రాష్ట్రాల్లోనే దండకారుణ్యంలోనే గడుపుతున్నారు. ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డాగా ఉన్న తూర్పుగోదావరి, విశాఖ ఏజెన్సీలో ఎప్పటి నుంచో మావోయిస్టులు కనిపించడం లేదు. తాజా ఎన్ కౌంటరుతో విప్లవకారులు మళ్లీ ఏపీకి వచ్చారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, చత్తీస్ గఢ్ లో మావోయిస్టులపై నిఘా ఎక్కువ అవడం వల్ల కొందరు అగ్రనేతలు మారేడుమిల్లి అడవులలో షెల్టర్ తీసుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. గత కొన్ని నెలలుగా చత్తీస్ ఘడ్ దండకారుణ్యంలో పోలీసు బలగాల దాడుల్లో వందల మంది మావోయిస్టులు మరణిస్తున్న విషయం తెలిసిందే. నిర్బంధాన్ని తట్టుకోలేక మరికొన్ని వందల మంది పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు కూడా.. కానీ, కొందరు మొండిపట్టుదలతో ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.
వీరు దండకారుణ్యం ఖాళీ చేసి గతంలో షెల్టర్ జోన్లుగా ఉన్న మారేడుమిల్లి వంటి అటవీ ప్రాంతాలకు తరలివచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఇక ఈ కాల్పులలో ఆరుగురు మరణించారని ప్రాథమిక సమాచారం అందినా, మృతులు ఎవరు అన్నది స్పష్టం కాలేదు. మృతులు అగ్రనేతలుగానే అనుమానిస్తున్నందున ఈ ఎన్ కౌంటర్ మావోయిస్టు పార్టీకి పెద్ద నష్టమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


















