కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో మొదలు పెట్టిన `ఆపరేషన్ కగార్` మావోయిస్టులకు సింహ స్వప్నంగా మారిందన్నది వాస్తవం. చర్చలకు అవకాశంలేదని.. లొంగుబాటా.. ప్రాణాల అర్పణా? అన్నట్టుగా సాగుతున్న భీకర పోరులో ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు, పార్టీ అధికార ప్రతినిధుల నుంచిసిద్ధాంత కర్తల దాకా.. భద్రతా దళాల తుపాకులకు బలయ్యారు. దీనిలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే మావోయిస్టులు పెద్ద ఎత్తున లొంగిపోతున్నారు.
అయితే.. మావోయిస్టులు ఇలా భారీ ఎత్తున లొంగిపోవడానికి ప్రాణ భయమే కారణమని కొందరు చెబుతుం టే.. కాదు.. దీని వెనుక.. చాలా వ్యూహం ఉండి ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. వాస్తవానికి మావోయిస్టులు గన్ను పట్టుకునేప్పుడే.. ప్రాణాలను లెక్కచేయబోమని.. డబ్బులు, ప్రలోభాలకు లొంగమని ప్రతిజ్ఞ చేస్తారు. అందుకే సర్వస్వం వదిలి అడవిబాటలో అడుగులు వేస్తారు. సొమ్మసిల్లినా.. ప్రాణాలు పోయినా.. మన్యాన్నే నమ్ముకుంటారు. ఇదే ఇప్పటి వరకు జరిగింది.
అలాంటి వారు.. ఇప్పుడు ప్రాణభయంతో లొంగిపోతున్నారా? అనేది ప్రశ్న. ఇది మేధావుల మధ్యే పెద్ద ఎత్తున వస్తున్న సందేహం. అంతేకాదు.. ఆపరేషన్ కగార్ నిజంగానే వారిని మార్చేసిందా? అనేది ప్రశ్న. అయితే.. ఈ విషయంపై చాలా భిన్నాప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు.. `ఆపరేషన్ గ్రీన్ హంట్` పేరుతో కూడా ఇలాంటి దాడులే చేసింది. అప్పట్లోనూ పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. కానీ.. అప్పట్లో ఈ తరహా లొంగుబాట్లు లేవు.
ఇక, ఇప్పటికి.. అప్పటికి ఉన్న తేడా.. అప్పట్లో చర్చలకు ఆహ్వానించారు. అవి సాకారం కాకపోవడంతో తిరిగి మావోయిస్టులు అడవి బాట పట్టారు. ఇప్పుడు చర్చల ఊసు లేదు. ఒకరకంగా.. తీవ్ర దిగ్బంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు చాలా వ్యూహాత్మకంగానే లొంగిపోతున్నారన్నది వీటి నుంచి బయటకు వచ్చిన వారు చెబుతున్న మాట. అలివికాని సమయంలో ఎదురొడ్డడం కంటే.. ముందు లొంగిపోయి.. తర్వాత.. సానుకూల వాతావరణం ఏర్పడినప్పుడు.. తిరిగి అడవిబాటపట్టడం ఖాయమని అంటున్నారు.
ఇది గతంలోనూ జరిగిందని గుర్తు చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం.. దిగ్బంధం చేసినప్పుడు.. కూడా ఇలానే కొందరు లొంగిపోయి.. తర్వాత.. మళ్లీ వారి బాటలోకి వెళ్లిపోయారు. ప్రభుత్వాలు అనుసరించే వ్యూహాలను బట్టి మావోయిస్టుల వ్యూహాలు కూడా ఉంటాయని మేధావులు గుర్తు చేస్తున్నారు. మావోయిస్టుల సిద్ధాంతాలను ఏర్పరిచిన మల్లోజుల వంటివారు లొంగిపోవడం అంటే.. సాధ్యమా? అనేది ప్రశ్న. దీనివెనుక వ్యూహం ఉంటుందని చెబుతున్నారు. అయితే.. దీనిపై కేంద్రం కూడా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అందుకే.. తాజాగా హోం మంత్రి అమిత్‌షా.. మరో రెండేళ్లపాటు.. నిఘా కొనసాగుతుందని చెప్పారు. సో.. ఉద్యమానికి అలవాటైన ప్రాణం.. అంత త్వరగా తుపాకులు వదిలేయదని చెబుతున్నమాట ఏమేరకు వాస్తవమో చూడాలి.