అందాల పోటీలు ఎప్పటికప్పుడు ప్రపంచ స్థాయి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది జరుగుతున్న ఈ అందాల పోటీలలో ఎంతోమంది తమ ప్రతిభను చాటుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇకపోతే 2025వ సంవత్సరానికి గానూ జైపూర్ వేదికగా ‘మిస్ యూనివర్స్ ఇండియా – 2025’ పోటీలు నిర్వహించారు. ఇందులో రాజస్థాన్ కి చెందిన మణిక విశ్వకర్మ టైటిల్ కిరీటాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. 2024 మిస్ యూనివర్స్ ఇండియాగా కిరీటాన్ని దక్కించుకున్న రియా సింగ్.. మణిక విశ్వకర్మకు కిరీటాన్ని అలంకరించారు.
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది నవంబర్లో థాయిలాండ్ లో జరగబోయే 74వ మిస్ యూనివర్స్ పోటీలలో భారత్ తరపున మణికా ప్రాతినిధ్యం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే జైపూర్ వేదికగా జరిగిన ఈ మిస్ యూనివర్స్ ఇండియా 2025 అందాల పోటీలలో మణిక టైటిల్ విజేతగా నిలవగా.. ఉత్తరప్రదేశ్ కి చెందిన తాన్యా శర్మ ఫస్ట్ రన్నరప్ , మెహక్ థింగా సెకండ్ రన్నరప్ , హర్యానా అమ్మాయి అమిషీ కౌశిక్ మూడవ రన్నరప్ గా నిలిచారు.
మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకోవడంతో సంతోషం వ్యక్తం చేసిన ఈమె మాట్లాడుతూ.. “నా ప్రయాణం నా స్వస్థలమైన గంగానగర్ నుంచి మొదలైంది. అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి ఈ పోటీకి సిద్ధమయ్యాను. మనపై మనం నమ్మకం, ఆత్మవిశ్వాసంతో ఉంటే ఏదైనా సాధించగలం. నా విజయం వెనుక ఎంతో మంది నిలిచారు. నాకు సహాయం చేస్తూ.. నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు” అంటూ తెలిపారు మణిక విశ్వకర్మ.
ఇకపోతే ఈ పోటీలలో విజేతగా నిలిచిన మణిక విశ్వకర్మ బ్యాక్ గ్రౌండ్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. మణిక విశ్వకర్మ విషయానికి వస్తే.. రాజస్థాన్ లోని శ్రీ గంగా నగర్ కు చెందిన ఈమె ప్రస్తుతం ఢిల్లీలో నివాసం ఉంటున్నారు.. పొలిటికల్ సైన్స్ , ఎకనామిక్స్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న మణిక.. అటు జాతీయస్థాయి కళాకారిణిగా కూడా గుర్తింపు సొంతం చేసుకున్నారు. చిత్రలేఖనం , క్లాసికల్ డాన్స్ విభాగంలో ప్రావీణ్యం పొందిన ఈమె.. గత ఏడాది మిస్ యూనివర్స్ రాజస్థాన్ 2024 టైటిల్ ను సొంతం చేసుకున్నారు.
అటు సేవా రంగంలో కూడా విశిష్ట సేవలు అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు మణిక. “న్యూరోనోవా” అనే సంస్థను స్థాపించి, ADHD వంటి న్యూరోలాజికల్ సమస్యలతో బాధపడే వారికి సహాయం అందిస్తూ.. అండగా నిలుస్తున్నారు. ఇకపోతే విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించిన బిమ్స్ టెక్ సెవోకాన్ లో భారత్ తరఫున ప్రతినిధిగా పాల్గొన్న ఈమె ఇప్పటివరకు మూడుసార్లు మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకుంది..
ఇకపోతే ఇప్పటివరకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్న ఇండియన్ సెలబ్రిటీస్ విషయానికి వస్తే.. 1994లో సుస్మిత సేన్, 2000 సంవత్సరంలో లారా దత్తా, 2021లో హర్నాజ్ సంధు ఈ ఘనత సాధించారు. ఇకపోతే గత ఏడాది భారత్ తరఫున మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న రియాసింగ్ టాప్ 12 లో చోటు తగ్గించుకోలేకపోయారు. కనీసం ఈసారి మణిక విశ్వకర్మ అయినా భారత్ కి కిరీటాన్ని తీసుకొస్తుందని అందరూ భావిస్తున్నారు