సూపర్ స్టార్ మహేష్ కెరీర్ ఎంపికలపై ఎప్పుడూ అభిమానులు క్యూరియస్ గా ఉంటారు. ఆయన రీమేక్ లలో నటించరు… పాన్ ఇండియాలో వెలిగిపోవాలని కలలు కనరు. ముఖ్యంగా హిందీ మార్కెట్లో సత్తా చాటాలనే ఆలోచన ఆయన ఇంతకాలం చేయకపోవడం ఆశ్చర్యకరం. ఓవైపు అగ్ర హీరోల్లో ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ లాంటి స్టార్లు పాన్ ఇండియాలో దూసుకెళుతున్నారు. మరోవైపు టూటైర్ లో నాని, నిఖిల్, నాగచైతన్య, అడివి శేష్ వంటి స్టార్లు అగ్రహీరోలను అనుకరిస్తున్నారు. వీరంతా చేస్తున్న ప్రయత్నాలను మహేష్ ఎప్పుడూ చేయలేదు. తన సినిమాలు పాన్ ఇండియా మార్కెట్ ని ఢీకొట్టాలని 500 కోట్లు, 1000 కోట్లు వసూలు చేయాలని కూడా అతడు భావించినట్టు అనిపించదు. బాలీవుడ్ లాంటి విస్తారమైన మార్కెట్ ఉన్న చోట నటించాలని కూడా ఆయన ఏనాడూ ప్రయత్నించలేదు. పైగా హిందీ పరిశ్రమ తనను భరించలేదని సూటిగా వ్యాఖ్యానించి దుమారం రేపాడు.
మూడు దశాబ్ధాల కెరీర్ లో మహేష్ పూర్తిగా తనను ఆదరించిన అభిమానులు, తెలుగు ప్రేక్షకులను మాత్రమే అలరిస్తే సరిపోతుందని భావించాడు. దానికి తగ్గట్టే స్థానికంగా ఒరిజినల్ కథలు రాసుకునే దర్శకులకు మాత్రమే అవకాశాల్ని కల్పించాడు. కె.రాఘవేంద్రరావు, త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, శ్రీనువైట్ల, సుకుమార్, అనీల్ రావిపూడి .. ఇలా వెర్సటైలిటీ ఉన్న దర్శకులతో అతడు ప్రయత్నించాడు. జయంత్ సి ఫరాన్జీతో టక్కరి దొంగ తన కెరీర్ లోనే పూర్తి ప్రయోగాత్మక చిత్రం.
అయితే ఎంతమంది పెద్ద దర్శకులతో పని చేసినా కానీ మహేష్ ఇన్నేళ్ల కెరీర్‌లో దర్శకధీరుడు రాజమౌళితో పని చేయకపోవడం ఎప్పటికీ ఒక లోటు. కానీ దానికి సమయం ఇప్పటికి వచ్చింది. 2025-26 సీజన్ మోస్ట్ అవైటెడ్ మూవీలో మహేష్ ప్రస్తుతం నటిస్తున్నాడు. రాజమౌళితో తన మొదటి సినిమా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోంది. దీని కోసం మహేష్ మేకోవర్ చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. అతడు ఈ భారీ ఫారెస్ట్ అడ్వెంచర్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అయితే తన కెరీర్ లో మొదటిసారి యాథృచ్ఛికంగానే అతడు ఒక పాన్ ఇండియా డైరెక్టర్ తో పని చేస్తున్నాడు. పర్యవసానంగా ఇప్పుడు అతడికి హిందీలో భారీ మార్కెట్ ఏర్పడనుంది. ఇది ఒక రకంగా బాలీవుడ్ లో డెబ్యూ లాంటిది. మరోవైపు పరిమితంగానే ఉన్న ఇరుగు పొరుగు దక్షిణాది మార్కెట్లలోను తన స్థాయిని పెంచుకోవడానికి తాజా చిత్రం సహకరిస్తుంది. ఎస్.ఎస్.ఎం.బి 29 చిత్రాన్ని రాజమౌళి బృందాలు అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేయాలనే ఎత్తుగడను అనుసరిస్తున్నట్టు కథనాలొస్తున్నాయి. అందుకే రాజమౌళితో సినిమా పూర్తయిన తర్వాత మహేష్ కేవలం లోకల్ సినిమాలో మాత్రమే నటిస్తాను! అంటే కుదరదు. ఇకపై అతడు నటించే ప్రతి సినిమా పాన్ ఇండియా లేదా పాన్ వరల్డ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని చేయాల్సి ఉంటుంది. అందువల్ల అతడు పాత రూల్స్ ని పక్కన పెట్టి పెద్ద ప్రణాళికలతో దూసుకెళ్లాల్సి ఉంటుంది.
ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా? పాన్ ఇండియా (వరల్డ్) మార్కెట్లో ఆలస్యంగా ప్రవేశించినా కానీ మహేష్ ఇతరులను పక్కకు నెట్టి ముందుకు దూసుకెళ్లాల్సిన తరుణం రానే వచ్చింది.