మహారాష్ట్రలో కొన్ని వారాలుగా భాష, అస్తిత్వం పేరుతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. భారత్‌లోనే ధనిక రాష్ట్రంగా మహారాష్ట్రను చెబుతారు.ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో రాష్ట్ర భాష మరాఠి, సెకండ్ లాంగ్వేజ్‌గా ఇంగ్లిష్‌తో పాటు మూడో భాషగా హిందీ బోధనను తప్పనిసరి చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వడంతో గత ఏప్రిల్ నెల నుంచి ఆందోళనలు మొదలయ్యాయి.
పాఠశాలలో పిల్లలకు మూడు భాషలను బోధించాలన్న నిర్ణయం సమాఖ్య విధానానికి అనుగుణంగానే తీసుకుందని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.భారత్‌లో విద్యా వ్యవస్థకు ప్రోత్సాహం, క్రమబద్ధీకరణ లక్ష్యాలతో ప్రభుత్వం 1968లో జాతీయ విద్యావిధానం (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-ఎన్ఈపీ) అమల్లోకి తెచ్చింది. అవసరాన్ని బట్టి దాన్ని మార్పులు చేస్తోంది.
ఇప్పుడు ఆందోళనలకు కారణమైన విధానాన్ని ఐదేళ్ల కిందటే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీన్ని దశలవారీగా అమలుచేస్తున్నారు. అదే సమయంలో వివాదాస్పదమూ అవుతోంది. గతంలోనూ ఆందోళనలు జరిగాయి.మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సివిల్ సొసైటీ గ్రూపులు, భాషాభిమానులు, ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఉత్తర, మధ్య భారత రాష్ట్రాల్లో ప్రధానంగా మాట్లాడే హిందీ భాషను మహారాష్ట్ర ప్రజలపై రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
స్వాతంత్ర్యం తర్వాత భాషాప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటుచేయడంతో మహారాష్ట్ర సహా చాలా రాష్ట్రాల్లో భాష అన్నది సున్నితమైన అంశంగా మారింది.ఆ ప్రాంత గౌరవం, అస్తిత్వంతో స్థానిక భాష అంతర్గతంగా ముడిపడి ఉంటుంది. అందులో ఎలాంటి మార్పు చేసినా అది తమ భాషా అస్తిత్వాలకు ముప్పుగానే కొందరు భావిస్తారు.ఇండియా సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో గత ఏడాది కన్నడ భాషాభిమానులు ఆందోళనలు నిర్వహించారు. కంపెనీలు, షాపుల పేర్లను కేవలం ఇంగ్లిష్‌లోనే గాకుండా స్థానిక భాషలోనూ రాయాలనేది వారి డిమాండు.
భారత్‌లో అత్యధికంగా మాట్లాడే భాష హిందీ. హిందీని ప్రోత్సహించడానికి కొన్నేళ్లుగా వివిధ ప్రభుత్వాలు పలు చర్యలు చేపట్టాయి. దీంతో హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ అమలుపై భయాందోళనలు వ్యక్తమయ్యాయి.అది స్థానిక సంస్కృతిని దెబ్బతీస్తుందనే సందేహాలు వెల్లువెత్తాయి.అభివృద్ధిలో వెనకబడిన కొన్ని హిందీ మాట్లాడే రాష్ట్రాల నుంచి ఉద్యోగాలు వెతుక్కుంటూ దేశంలోని ఇతర ప్రాంతాలకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అధిక సంఖ్యలో వలసలు వస్తుండటంతో భాషా సంబంధ ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి.
2014లో భారతీయ జనతాపార్టీ (బీజేపీ) కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తరహా ఆందోళనలు పెరిగాయి. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోని బీజేపీకి చెందిన నాయకులు తరచుగా హిందీకి ప్రాధాన్యత ఇస్తూ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.త్రిభాషా విధానంపై ఉద్రిక్తతలు అధికమవ్వడంతో మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం వెనకడుగు వేసింది. తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.ఈ త్రిభాషా విధానంపై పునఃపరిశీలనకు ఒక కమిటీని నియమించింది. కానీ వివాదం ఇంకా సద్దుమణగలేదు.
దేశంలోనే అత్యంత ధనిక నగరపాలక సంస్థ ముంబయి సిటీ సహా మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు చాలాకాలంగా వాయిదాపడుతూ వచ్చాయి.వాటి నిర్వహణకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ భాషాపరమైన వివాదం రేగింది.
అధికార కూటమికి, ప్రతిపక్ష పార్టీలకు మధ్య రాజకీయ వేడిని రాజేసింది. పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు.రాష్ట్రంలో మరాఠి మాట్లాడనివారి (మరాఠీయేతరుల)పై హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి.
ఏప్రిల్ నెలలో, థానే జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలపై దాడి జరిగింది. మరాఠీలోనే మాట్లాడాలని పట్టుబట్టిన వ్యక్తికి అది కుదరదని చెప్పేందుకు తాము ఎక్స్‌క్యూజ్ మీ అని చెప్పడమే ఈ దాడికి కారణమని వారు ఆరోపించారు.మరోవైపు, తనకు మరాఠీ తెలియదన్నందుకు స్థానిక ప్రతిపక్ష పార్టీ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు తనను కొట్టారని ముంబయిలో ఒక సెక్యూరిటీ గార్డు ఆరోపించారు.మరాఠిలో మాట్లాడలేదని ముంబయిలో ఓ జంట తనకు డబ్బులు చెల్లించడానికి నిరాకరించిందని మే నెలలో ఓ డెలివరీ ఏజెంట్ వెల్లడించారు.
మరాఠిలో మాట్లాడలేదని గత వారం ఓ దుకాణ యజమానిపై ఎంఎన్ఎస్ కార్యకర్తలుగా భావిస్తున్న కొంతమంది దాడిచేశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.త్రిభాషా విధానం అమలుపై తలెత్తిన ఆందోళనలు, తదనంతర పరిణామాలతో సామాజిక విభజనలు పెరిగాయి. అదే సమయంలో దాదాపు రెండు దశాబ్దాలుగా రాజకీయ వైరం నెరపిన ఇద్దరు నాయకులు తమ విభేదాలను పక్కనబెట్టి కలిసిపోయారు.వారిలో ఒకరు బాల్ ఠాక్రే కుమారుడు కాగా, మరొకరు ఆయన సోదరుడి కొడుకు.స్థానిక ప్రతిపక్షం శివసేన (యూబీటీ) అధిపతి ఉద్ధవ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ పార్టీ నాయకుడు రాజ్ ఠాక్రేలు హిందీ అమలును వ్యతిరేకిస్తూ గత వారం సంయుక్తంగా ర్యాలీ నిర్వహించారు.