కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న మాధవీరెడ్డి తన విలక్షణ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయితే ఆమెకు ముక్కుపైనే కోపం? అన్న అపవాదుతో ఇటీవల చెడ్డపేరు మూటగట్టుకుంటున్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత కడపలో పసుపు జెండా ఎగురవేసిన టీడీపీకి మాధవీరెడ్డి రూపంలో సమర్థురాలైన నాయకురాలు దొరికిందని అంతా అనుకున్నారు. కానీ, ఇటీవల చోటుచేసుకుంటున్న సంఘటనతో మాధవీరెడ్డి వివాదాల్లో చిక్కుకుంటున్నారు. తాను అధికార పార్టీ శాసనసభ్యురాలిని అన్న విషయం విస్మరించి ఆమె దూకుడుగా వ్యవహరించడంతో విమర్శల పాలవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీరుపై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వేదికపై తనకు కుర్చీవేయలేదన్న కారణంగా ఇద్దరు ఐఎఎస్ అధికారులను అవమానించేలా వ్యవహరించారని ఎమ్మెల్యే మాధవిరెడ్డి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అధికారులు తప్పు చేస్తే అధికార పార్టీ నేతలే వెనకేసుకు రావాలని, ఏదైనా ఉంటే నాలుగు గోడల మధ్య తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని చూపించాలని సూచనలు వినిపిస్తున్నాయి. కానీ, అందరి ముందు అఖిల భారత సర్వీసు అధికారులను అవమానించేలా ప్రవర్తించడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ సీనియర్లు సైతం ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. అనుభవరాహిత్యం వల్లే ఆమె ఇలా ప్రవర్తిస్తున్నారా? అన్న చర్చ కూడా జరుగుతోంది. వాస్తవానికి స్వాతంత్ర్య దినోత్సవాల్లో బహిరంగ సభలు ఉండవు. జెండా ఆవిష్కరణ తర్వాత అవార్డు ప్రదానోత్సవం ఉంటుంది. ముఖ్య అతిథిగా వచ్చేవారితో ఈ కార్యక్రమం జరిపిస్తారు. అయితే స్థానిక శాసనసభ్యులు ఆహ్వానితులే కాని అతిథులు కాదు అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఈ విషయాన్ని తెలుసుకోకుండా అందరి ముందు ఇద్దరు ఐఏఎస్ అధికారులపై కన్నెర్రజేయడం విమర్శలకు కారణమవుతోంది.
నిజానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి పనితీరుపై టీడీపీ కార్యకర్తలు సంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ఆమె దూకుడు ఈ కాలానికి తగ్గ రాజకీయమే అంటూ ఆమెను సమర్థిస్తున్నవారు ఉన్నారు. కానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేగా కాస్త సంయమనం పాటించాలి కదా? అన్న సూచనలు వినిపిస్తున్నాయి. కడప నగరపాలక సంస్థలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి కుర్చీ కోసం చేసిన ఫైటింగ్ రాష్ట్రవ్యాప్తంగా ఆమె ఇమేజ్ ను పెంచింది. నిబంధనలు అనుమతించకపోయినా.. ప్రతిపక్షం బలంగా ఉన్న చోట ఆమె ధైర్య సాహసాలు ప్రదర్శించడం.. గతంలో అనుసరించిన విధానాన్ని కొనసాగించకపోవడం ఏంటి? అన్న ప్రశ్న లేవనెత్తడంలో మాధవిరెడ్డి సక్సెస్ అయ్యారని అంటున్నారు. అయితే అన్నింటికి ఆమె ఒకే ఫార్ములా అనుసరించడం కరెక్ట్ కాదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం అంటే జాతీయ పండుగ. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ప్రతి పౌరుడు విధి. నియోజకవర్గంలో ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్న మాధవిరెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకలకు ఆలస్యంగా వచ్చారని అంటున్నారు. దీంతో ఆమెకు కేటాయించిన సీటులో వేరే అధికారి కూర్చొన్నారని, ఎమ్మెల్యే వచ్చిన విషయాన్ని గమనించి మరో కుర్చీ వేశారని అక్కడి వారు చెబుతున్నారు. అయితే తనకు కేటాయించిన సీటులో వేరొకరు కూర్చోవడం ఏంటి? అని ఎమ్మెల్యే చిన్నబుచ్చుకున్నారని అంటున్నారు. సర్దుకుపోతే చిన్నవిషయమే అయినప్పటికీ ఎమ్మెల్యే ఆగ్రహం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. కడప కార్పొరేషన్లో వ్యవహరించిన విధంగా ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి అఖిల భారత అధికారులపై చిర్రుబుర్రులాడటమే సమస్యకు కారణంగా చెబుతున్నారు. ఇలా చిన్నచిన్న విషయాలకే కోపగించుకుని రచ్చ చేస్తే ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇమేజ్ కే నష్టమని వ్యాఖ్యానిస్తున్నారు.
వాస్తవానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం. కానీ, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను సీఎం అంగీకరించరని అంటున్నారు. దీనివల్ల ఎమ్మెల్యే తనకు ఉన్న గుర్తింపును కోల్పోయే అవకాశాలే ఎక్కువ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కడపలో మహానాడు నిర్వహణ సందర్భంగా ఎమ్మెల్యే మాధవీరెడ్డి దంపతుల సామర్థ్యానికి టీడీపీ అధిష్టానం ఫిదా అయింది. మారుమూల ప్రాంతంలో.. సరైన వసతులు లేని ప్రదేశంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మహానాడు నిర్వహించి టీడీపీ అధిష్టానం మనసు చూరగొన్నారు మాధవీరెడ్డి దంపతులు. అయితే బిందెడు పాలలో చుక్క విషం పడినట్లు పార్టీ, ప్రభుత్వంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న దశలో దూకుడుతో ఇబ్బందులలో పడటం కరెక్టు కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది ఆమె కెరీర్ కే నష్టం చేకూరుస్తుందని అంటున్నారు.