రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యేల్లో ముందుండే పేరు రెడ్డప్పగారి మాధవీరెడ్డి. కడప ఎమ్మెల్యే అయిన మాధవీరెడ్డి ప్రభుత్వ విప్ గా కూడా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచినా దూకుడుగా రాజకీయాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఎమ్మెల్యే మాధవీరెడ్డి. మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశాల్లో వేదికపై తనకు కుర్చీ వేయాలని పట్టుబట్టి మరీ సాధించిన ఎమ్మెల్యే.. ఇతర వ్యవహారాల్లోనూ అంతే దూకుడుగా పనిచేస్తుంటారు. తాజాగా వార్డు సచివాలయ ఉద్యోగిపై ఆమె కన్నెర్రజేశారు. వందల మంది సమక్షంలో ఉద్యోగికి వార్నింగ్ ఇస్తున్న వీడియో వైరల్ గా మారింది.
‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో భాగంగా కడప నగరంలో పర్యటిస్తున్న మాధవీరెడ్డికి రేషన్ కార్డుల సమస్యపై కొందరు మహిళలు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాధవీరెడ్డి పక్కనే ఉన్న సచివాలయ ఉద్యోగిని ప్రశ్నించారు. దీనికి ఆయన వైసీపీ కార్పొరేటర్ ను అడగాలని చెప్పడంతో ఎమ్మెల్యే మాధవిరెడ్డికి చిర్రెత్తుకొచ్చిందని చెబుతున్నారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి తన దృష్టికి వచ్చే సమస్యపై కార్పొరేటర్ ను అడగమనడం ఏంటని ఆశ్చర్యంతోపాటు ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.. కార్పొరేటర్ కు బ్రోకర్ గా పనిచేస్తున్నావా? అంటూ ఉద్యోగిని నిలదీశారు. ప్రభుత్వం వద్ద జీతం తీసుకుంటూ బ్రోకర్ పనులు చేయొద్దు అంటూ మందలించారు. అయితే ఓ ఉద్యోగిని ఎమ్మెల్యే ‘బ్రోకర్’ అనడంపై విపక్షం మండిపడుతోంది. ఉద్యోగులను పట్టుకుని తిడతారా? అంటూ నిలదీస్తోంది.
ఈ విషయమై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఎలా ఉన్నా, సచివాలయ ఉద్యోగిపై మాధవీరెడ్డి రియాక్షన్ చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి ఆమె లేడీ సివంగిలా పనిచేస్తున్నారని టీడీపీ నేతలు ప్రశంసిస్తున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహనరెడ్డి సొంత జిల్లాలో టీడీపీ తరఫున ఆమె చేస్తున్న పోరాటంపై ఆ పార్టీ సోషల్ మీడియా నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో గన్నవరంలో మాజీ ఎమ్మెల్యే వంశీతో వివాదానికి దిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రాంతం ఏదైనా పార్టీ తరఫున మాధవీరెడ్డి ఎలాంటి భయం లేకుండా పోరాటం చేయడం విశేషంగా చెబుతున్నారు. ఇక తాజా వివాదంలో వైసీపీ విమర్శలను మాధవీరెడ్డి ఎలా అధిగమిస్తారో చూడాల్సివుంది.