ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసు తీవ్ర కలకలం రేపుతోంది. ఇందులో వైసీపీ కీలక ఎంపీ మిథున్ రెడ్డిని తాజాగా సిట్ అరెస్టు చేసింది. ఈ కేసులో తాజాగా కోర్టులో దాఖలు చేసిన తొలి ఛార్జి షీట్ లో ఏకంగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పేరును కూడా ప్రస్తావించింది. అయితే ఆయన్ను నిందితుడిగా ఇంకా పేర్కొనలేదు. అయితే ఎంపీ, మాజీ సీఎంను కూడా తాకిన ఈ సెగ నుంచి ఈ స్కాం జరిగిన సమయంలో ఎక్సైజ్ మంత్రిగా ఉన్న నారాయణ స్వామి మాత్రం సేఫ్ గా ఉన్నారు.
వైసీపీ హయాంలో జరిగిన మద్యం స్కాంలో ఇది జరిగిన ఎక్సైజ్ శాఖ పాత్ర కీలకం. ఈ శాఖలో జరిగిన లావాదేవీలపైనే ఇప్పుడు సీఐడీ సిట్ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లోనే ఎంపీ మిథున్ రెడ్డి జైలుకు వెళ్లగా.. జగన్ కూడా జైలుకు వెళ్తారన్న ప్రచారాన్ని కూటమి నేతలు తెరపైకి తెస్తున్నారు. అయితే వీరితో పాటు అప్పటి ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఇవాళ నారాయణ స్వామిని మద్యం కేసులో విచారణకు సాక్షిగా రావాలని సీఐడీ నోటీసులు పంపింది. అయితే నిందితుడిగా కానీ, మరే రకంగానూ ఆయన పేరు ఇప్పటివరకూ తెరపైకి రాలేదు. దీని వెనుక ఓ కీలక కారణం ఉంది.
వైసీపీ హయాంలో రెండుసార్లు డిప్యూటీ సీఎం కమ్ ఎక్సైజ్ శాఖ మంత్రిగా నారాయణ స్వామి పనిచేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన దళిత నేత నారాయణ స్వామికి సామాజిక సమీకరణాల్లో భాగంగా జగన్ రెండుసార్లు ఇలా అవకాశం కల్పించారు. అయితే జగన్ హయాంలో డిప్యూటీ సీఎంలుగా పనిచేసిన వారితో పాటు మంత్రులకు సైతం ఏ విషయంలోనూ సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్ధితి ఉండేది కాదని అప్పట్లో ప్రచారం జరిగేది. అలాగే ఎక్సైజ్ మంత్రిగా ఉన్న నారాయణ స్వామికి సైతం తన శాఖకు సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం లభించలేదు.
అప్పట్లో తన సొంత ఎక్సైజ్ శాఖలో నిర్ణయాలు తీసుకోలేని పరిస్ధితి ఉందని నారాయణ స్వామి బహిరంగంగానే వాపోయేవారు. జగన్ తో పాటు ఆయన చుట్టూ ఉన్న కోటరీ మనుషులే అంతా చక్కబెట్టేస్తున్నారని, ఎక్సైజ్ మంత్రిగా తనకు అధికారాలు లేవని ఆవేదన వ్యక్తం చేసేవారు. అయితే ఇప్పుడు అదే ఆయన్ను కాపాడుతోంది. ఎక్సైజ్ పాలసీ రూపకల్పనతో పాటు ముడుపులు కానీ, ఇతర నిర్ణయాల విషయంలో నారాయణ స్వామి పాత్ర లేదని బలంగా నమ్ముతున్న సిట్ ఆయన పేరును ఇప్పటివరకూ ఎక్కడా ప్రస్తావించలేదు. అయితే ఈ కేసులో ఆయన పాత్ర లేకపోయినా ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపై సాక్షిగా ప్రశ్నించేందుకు నారాయణ స్వామికి ఇవాళ రమ్మని నోటీసులు పంపారు. అయితే ఆయన అనారోగ్యం కారణంగా ఇవాళ రాలేనని సమాచారం ఇచ్చారు.