ఇంట్లో పనిమనిషిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన కేసులో హాసన మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను కోర్టు దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శిక్షను ఈ రోజు వెల్లడిస్తానని తెలిపింది. ఈ క్రమంలో తాజాగా ప్రజ్వల్ రేవణ్ణకు జీవిత ఖైదు పడింది. ఈ మేరకు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సంతోశ్ గజానన హెగ్డే తీర్పు వెల్లడించారు!
అవును… ఇంట్లో పనిమనిషిపై పదే పదే అత్యాచారానికి పాల్పడినట్లు నమోదైన కేసులో మాజీ ప్రధాని దేవె గౌడ మనవడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దోషిగా తేలిన నేపథ్యంలో తాజాగా శిక్ష ఖరారైంది. ఇందులో భాగంగా… అతనికి జీవిత ఖైదు పడింది. రూ.10 లక్షల జరిమానాను కోర్టు విధించింది. ఇదే సమయంలో.. బాధితురాలికి రూ.7లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
కాగా… హొళెనరసీపురలోని రేవన్న కుటుంబానికి చెందిన ఫామ్ హౌస్ లో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న మహిళ (47).. 2021 నుండి ప్రజ్వల్ రేవణ్ణ తనపై పదే పదే అత్యాచారం చేశాడని 2024 ఏప్రిల్ 28న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వీడియో రికార్డ్ చేసి, ఈ వ్యవహారం గురించి ఎవరికైనా చెబితే వాటిని బయట పెడతానని బెదిరించాడని ఆరోపించారు! అతడి ఫోన్ లో 2,000కు పైగా వీడియోలు ఉన్నాయని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అనంతరం మరికొన్ని అత్యాచార కేసులు ప్రజ్వల్ పై నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజ్వల్ విదేశాలకు వెళ్లిపోయారు. అయితే.. కుటుంబసభ్యుల హెచ్చరికతో చివరకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది.
ఈ క్రమంలో 14 నెలలుగా ప్రజ్వల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో… అతడిని దోషిగా తేలుస్తూ ఆగస్టు 1న కోర్టు తీర్పు ప్రకటించింది. ఆ సమయలో తనకు తక్కువ శిక్ష వేయాలంటూ న్యాయమూర్తిని ప్రజ్వల్ వేడుకున్నాడు.. బిగ్గరగా ఏడ్చాడు.. కన్నీరుమున్నీరుగా విలపించాడు.. న్యాయస్థానం నుంచి బయటకు వచ్చిన అనంతరమూ వెక్కివెక్కి ఏడ్చాడు. బాధితురాలి తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిఎన్ జగదీష్ స్పందిస్తూ… ఆమెపై పదే పదే అత్యాచారం చేసి, బ్లాక్ మెయిల్ చేశారని, లైంగిక వేధింపుల వీడియో చూసిన తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని కూడా భావించారని తెలిపారు. లైంగిక వేధింపుల వీడియోలు ప్రజ్వల్ క్రూరమైన మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయని మీడియాతో వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో… అతను సిట్టింగ్ ఎంపీ అని.. అతనికి చట్టం గురించి పూర్తిగా తెలుసని.. అయినప్పటికీ అలాంటి చర్యలకు పాల్పడ్డాడని.. అతను చాలా మంది మహిళల వీడియోలను రికార్డ్ చేసే అలవాటు ఉన్న నేరస్థుడని తెలిపారు!