ఒకే తరహా పాత్రలకు పరిమితం కాకుండా, భిన్నమైన కథలు–విభిన్న పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరో ఆసక్తికరమైన ప్రయోగానికి సిద్ధమయ్యారు. క్వాలిటీ సినిమాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన, ఇప్పుడు ఒక పవర్‌ఫుల్ పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.విమర్శకుల ప్రశంసలు పొందిన పిండం చిత్రాన్ని నిర్మించిన కలాహీ మీడియా పతాకంపై రూపొందుతోన్న రెండో చిత్రంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘లెగసీ’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు. ‘పిండం’తో తన ప్రతిభను నిరూపించుకున్న సాయి కిరణ్ దైదా ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహిస్తున్నారు.
నూతన సంవత్సర సందర్భంగా 2026 జనవరి 1న విడుదలైన అనౌన్స్‌మెంట్ టీజర్‌తోనే ‘లెగసీ’ సినిమా ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. రాజకీయ నేపథ్యంతో సాగే ఈ కథలో, అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుడి కుమారుడైన సిద్ధార్థ్ అనే యువకుడు, తండ్రి వారసత్వాన్ని అనివార్యంగా మోయాల్సి వచ్చే పరిస్థితుల్లో పడే అంతర్మథనాన్ని ప్రధానంగా చూపించనున్నారు.వారసుడు లేని కుర్చీ చుట్టూ తిరిగే అవకాశవాద రాజకీయ రాబందులపై తన అసహనాన్ని వ్యక్తపరిచే విశ్వక్ సేన్ వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. రాజకీయ క్రీడలు, అధికారం కోసం వేసే ఎత్తుగడలు తనకు నచ్చకపోయినా, వారసత్వాన్ని సమర్థంగా మోయాల్సిన బాధ్యత తనపై పడిందని చెప్పే డైలాగులు కథలోని లోతును స్పష్టం చేస్తున్నాయి.
దివంగత తండ్రి స్మారక చిహ్నం వద్ద కనిపించే సన్నివేశాలు, అక్కడి షాకింగ్ విజువల్స్, ఆపై తుపాకీ పట్టుకుని రాజకీయ నాయకుల మధ్య విశ్వక్ సేన్ కనిపించడం, కాల్పుల సన్నివేశాలు టీజర్‌కు ఉత్కంఠను జోడించాయి. క్రూరంగా, విరిగిపోయిన మనసుతో, రూఢిగా మారిన వ్యక్తిగా విశ్వక్ సేన్ పాత్రలో పూర్తిగా లీనమైపోయారు. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, కళ్లలో కనిపించే తీవ్రత ఈ పొలిటికల్ డ్రామాపై అంచనాలను భారీగా పెంచాయి.దర్శకుడు సాయి కిరణ్ దైదా ఈసారి రాజకీయ నేపథ్యంతో కూడిన ఉత్కంఠభరిత కథకు ప్రాణం పోసినట్టు టీజర్ స్పష్టంగా తెలియజేస్తోంది. నిర్మాతలు యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మాణ విలువలు సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లనున్నాయన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.
సంగీత దర్శకుడు గోవింద్ వసంత అందించిన నేపథ్య సంగీతం పాత్రలోని చీకటి, తీవ్రతను అద్భుతంగా ప్రతిబింబించింది. ‘96’ చిత్రంతో విశేష గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ సినిమాకు ఇచ్చిన బీజీఎం టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. జిజు సన్నీ ఛాయాగ్రహణం, శిరీష్ ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు బలంగా నిలవనున్నాయి.ఈ చిత్రంలో ఏక్తా రాథోడ్ కథానాయికగా నటిస్తుండగా, రావు రమేష్, సచిన్ ఖేడేకర్, మురళీ మోహన్, కే కే మీనన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
అనౌన్స్‌మెంట్ టీజర్‌తోనే ‘లెగసీ’ సినిమా అసాధారణ మార్కులను సాధించింది. ఇలాంటి శక్తివంతమైన ప్రారంభంతో తెలుగు సినిమాకు 2026 నిజంగా ఆశాజనకమైన నూతన సంవత్సరంగా మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా సాగుతుండగా, త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్‌ను చిత్ర బృందం వెల్లడించనుంది.
Legacy
















