ఇది విచిత్రమైన వ్వవహారంగానే అంతా చూస్తున్నారు. కాశ్మీర్ ఎపుడూ ఉధ్రిక్తలకు నిలయంగా ఉంటుంది. అక్కడే ఎక్కువగా అలజడులు రేగుతూ ఉంటాయి. కానీ మంచుతో మంచిగా ఉంటే ఉండే లద్దాఖ్ మంటెక్కిపోవడం, వేడెక్కిపోవడం మాత్రం ఇపుడు అతి పెద్ద చర్చకు దారి తీస్తోంది లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కావాలని డిమాండ్ చేస్తూ గతా పక్షం రోజులుగా సాగుతున్న ఆందోళన కాస్తా బుధవారం హింసాత్మకంగా మారింది. ఘర్షణలు సైతం చెలరేగడంతో నలుగురు యువకులు మరణించారు. బీజేపీ ఆఫీసుకు నిప్పంటించిన ఆందోళకారులు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అంటున్నారు.
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా అలాగే ఇవ్వాల్సిందే అన్నది ప్రధాన డిమాండ్ గా చేసుకుని ఈ నెల 10 నుంచి అక్కడ ఆందోళనలు సాగుతున్నాయి. పదిహేను మంది దాకా ఆందోళనకారులు అమరణ దీక్ష కూడా చేస్తున్నారు. అదే విధంగా ఆరో షెడ్యూల్ పొడిగింపుని కూడా ఆందోళనకారులు కోరుతున్నారు. ఇక అమరణ దీక్షలో ఉన్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే లద్దాఖ్ అపెక్స్ బాడీ యువజన విభాగం భారీ ఎత్తున ఆందోళనలకు పిలుపు ఇచ్చింది.
ఎపుడూ కూల్ గా ప్రశాంతంగా ఉండే లేహ్ నగరం ఇపుడు ఆందోళనలతో అట్టుడుకుతోంది. పెద్ద ఎత్తున ఆందోళనకారులు వీధుల్లోకి రావడమే కాదు భద్రతాదళాలను లక్ష్యంగా చేసుకుని రాళ్ళు రువ్వడంతో పాటు ఏకంగా పోలీసుల వాహనాలకే నిప్పు పెట్టారు. అంతే కాదు బీజేపీ ఆఫీసుని తగులబెట్టారు. దాంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా నిషేధాజ్ఞలు విధించారు. ఇక ఆందోళనకారులు పోలీసుల మధ్యలో ఘర్షణ చెలరేగడంతో ఫైరింగ్ చోటు చేసుకుంది. దీంతో నలుగురు యువకులు చనిపోగా మరో ముప్పయి మంది దాకా ఆందోళనకారులు గాయాలపాలు అయ్యారు.
ఇంతటి ఉదిక్తత చోటు చేసుకోవడం అన్నది లద్దాఖ్లో ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. రాష్ట్ర హోదా అంటూ యువత అమరణ దీక్షలకు దిగడంతోనే వాతావరణం మారిపోయింది. రాష్ట్ర హోదా వస్తే తమ బతుకులు బాగుపడతాయని యువత ఈ ఉద్యమాన్ని చేస్తోంది. అయితే ఈ ఉద్యమానికి ప్రముఖ వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన శాంతియుతంగానే అంతా జరగాలని కోరుకుంటున్నా యువతలో ఆవేశం పరిస్థితిని ఇలా దిగజార్చింది అని అంటున్నారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం సైతం అప్రమత్తం అయింది. లద్దాఖ్లో డిమాండ్ల మీద చర్చించేందుకు ప్రతినిధులను అక్టోబర్ 5న ఢిల్లీకి ఆహ్వానించింది. ఇంతలోనే మరో రూపునకు ఉద్యమం దారి తీసింది అని అంటున్నారు.
ఇక 2019 ఆగస్ట్ వరకూ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంగా ఉండేది ప్రత్యేక ప్రతిపత్తి కూడా కల్పించారు. అదె ఏడాది ఆగస్ట్ 5న ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అంతే కాదు కాశ్మీర్ లద్దాఖ్ లని కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసింది. ఆ తరువాత నుంచి లద్దాఖ్ ని ప్రత్యేక రాష్ట్ర హోదాతో వేరేగా ప్రకటించాలని డిమాండ్లు ఉన్నాయి. రాష్ట్ర హోదా ఇచ్చి భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ చేర్చాలనే డిమాండ్ ఉంది. అదిపుడు మరింతగా ఊపందుకుంది. దాంతోనే ఈ విధంగా మంచు కొండల మధ్య మంటలు పుట్టాయని అంటున్నారు. కేంద్రం ఈ మంటలను ఆర్పేందుకు ఏ రకమైన ప్రయత్నాలు చేస్తుందో చూడాల్సి ఉంది.