ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంపై పట్టు సాధించాలని కలలుగన్న వైసీపీ ఒకవైపు.. తమ పట్టు నిలుపుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన టీడీపీ మరోవైపు.. రెండు పార్టీల మధ్య జరిగిన ఈ వ్యక్తిగత పోరులో టీడీపీదే మరోసారి కూడా పైచేయి అయింది. వాస్తవానికి.. గత ఎన్నికలకు ముందు నుంచి కూడా కుప్పాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ.. ఇక్కడ వ్యూహ ప్రతివ్యూహాలను అమలు చేసింది. ఒకానొక దశలో కుప్పంలో టీడీపీ నాయకులను అదిరించి, బెదిరించి కూడా వైసీపీ పంచన చేర్చుకున్నారు.
గత ఎన్నికల్లో చంద్రబాబు పరాజయమే లక్ష్యంగా కూడా వైసీపీ నాయకులు అడుగులు వేశారు. అయితే.. రాజకీయాల్లో అనుకున్నంత ఈజీగా పట్టు పెంచుకోవడం సాధ్యమా? అనేది గత ఎన్నికలే వైసీపీ రుజువు చేశాయి. దీంతో కుప్పంలో ఇప్పుడు జెండా మోసేవారు.. పార్టీ తరఫున వాయిస్ వినిపించే వారు కూడా లేకుండా పోయారు. గత ఎన్నికల్లో చంద్రబాబుపై పోటీ చేసిన ఎమ్మెల్సీ భరత్ ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఆయన నియోజకవర్గంలోనే ఉంటున్నారని వైసీపీ నాయకులు చెబుతు న్నా.. దీనికి సంబంధించిన సంకేతాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
అంతేకాదు.. తాజాగా జరిగిన ముణేంద్రం ఎంపీపీ ఉప ఎన్నికలో టీడీపీ ఏకగ్రీవంగా ఈ సీటును దక్కించు కుంది. అంటే.. వైసీపీ తరఫున అసలు పోటీ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్న విషయం అర్థమవుతూనే ఉంది. గత ఎన్నికలకు ముందు కనీసం.. మండల స్థాయిలో అయినా.. వైసీపీ నాయకులు ఉండగా.. ఇప్పుడు నియోజకవర్గం స్థాయిలో కూడా నాయకులు కనిపించడం లేదు. ఇదే.. టీడీపీని ఇక్కడ బలపరిచిన వ్యవహారంగా నాయకులు చెబుతున్నారు. అంతేకాదు.. పొరుగు నియోజకవర్గాల నుంచి కూడా టీడీపీ నాయకులు ఇక్కడ పాగా వేశారు.
గతంలో చిత్తూరు ఎంపీ, పుంగనూరు ఎమ్మెల్యేలు.. ఇక్కడ వైసీపీ తరఫున చక్రం తిప్పారు. కానీ, వారు ఎన్నికల అనంతరం.. ఏమయ్యారో తెలిసిందే. కనీసం.. కుప్పంలో చోటు కూడా లేకుండా.. పోయింది. ఈ పరిణామాలతో టీడీపీ మరింత పుంజుకుంది. పైగా.. కుప్పంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు.. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం వంటివిషయాల్లో ఈ నియోజకవర్గం టాప్‌లో ఉందని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు. ప్రతి నెల చంద్రబాబు తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు.. నెలకొన్న పరిస్థితులు తెలుసుకుని .. వాటికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. దీంతో కుప్పంలో ఇప్పుడు వైసీపీ టాక్ ఎక్కడా వినిపించకుండా పోయి.. ఎంపీపీ ఎన్నికల్లో పోటీ చేసేవారు కూడా కరువయ్యారు.