tకోట శ్రీనివాసరావు (83)..
1942 జులై 10 వ తేదీన కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు.1978లో ‘ప్రాణం ఖరీదు’ సినిమాతో చలనచిత్ర రంగంలోకి అరంగ్రేటం చేశారు. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు.శివ, ప్రతిఘటన, గాయం లాంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి!
ప్రతిఘటన, గాయం మూవీ డైలాగులు కోటాను బాగా పాపులర్ చేశాయి!అహ నా పెళ్లంట చిత్రంలో పిసినారి పాత్ర పోషించిన కోటా శ్రీనివాస్ రావు నటనలో విశ్వరూపం ప్రదర్శించి ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారు!ఆయన మొత్తం 750 కి పైగా చిత్రాల్లో నటించారు. 9 నంది అవార్డులు అందుకున్నారు.
1999-2004 వరకు విజయవాడ తూర్పు నియోజకర్గ బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేశారు.హైదరాబాద్ ఫిలింనగర్లో నివాసం ఉంటున్న కోటా శ్రీనివాస్ రావు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.తెలుగు చిత్రపరిశ్రమలో పెను విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు.. పాత్ర ఏదైనా అందులో జీవించే సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు (83) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో ఉన్న తన ఇంట్లో ఆయన తుదిశ్వాస విడిచారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఆయన 750కు పైనే సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.
విలనిజమైనా.. హాస్య పాత్రలైనా.. క్యారెక్టర్ పాత్ర అయినా.. ఆయన పాత్రలోకి ఒదిగిపోయేవారు. ఆయన నటనకు ఇట్టే కనెక్టు అయ్యేవారు. కొన్ని రోజులుగా అస్వస్థతకు గురై.. బాధ పడుతున్న ఆయన కన్నుమూసిన విషయాన్ని కుటుంబ సభ్యులు తెలియజేశారు. 1942 జులై 10న క్రిష్ణాజిల్లా కంకిపాడులో కోటా శ్రీనివాసరావు జన్మించారు.
1978లో ప్రాణం ఖరీదు మూవీతో సినీ రంగంలోకి అరంగ్రేటం చేశారు. నాలుగు దశాబ్దాల తన సినీ ప్రయాణంలో ఆయన బోలెన్ని పాత్రలు పోషించారు. తన నటనతో పాత్రలకు ప్రాణం పోసిన ఆయన.. తెలుగువారికి సుపరిచితులు. 1999 – 2004 వరకు విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆయన.. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. సుదీర్ఘ సినీ జీవితంలో ఆయన నటించినచివరి సినిమా సువర్ణ సుందరి. ఈ సినిమాలో ఆయన చివరిసారిగా కనిపించారు. తెలుగుతో పాటు తమిళం.. హిందీ.. కన్నడ.. మలయాళం సినిమాల్లోనూ ఆయన నటించారు.
కోటా శ్రీనివాసరావు 750 చిత్రాల్లో నటించినప్పటికి కొన్ని చిత్రాలకు ఆయనకు భిన్నమైన ఇమేజ్ ను తెచ్చి పెట్టటమే కాదు.. ఆయన సినీ జివితంలో మర్చిపోలేని చిత్రాలుగా చెప్పాలి. అహనా పెళ్లంట.. ప్రతిఘటన.. యుముడికి మొగుడు.. ఖైదీ నెం.786.. శివ.. బొబ్బిలిరాజా.. యమలీల.. సంతోషం.. బొమ్మరిల్లు.. అతడు.. రేసుగుర్రం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే సినిమాలు ఆయన కెరీర్ లో కనిపిస్తాయి. సినిమాల్లో తెలంగాణ మాండలికం ప్రాముఖ్యత పెరిగేందుకు కోటా నటన కారణంగా చెప్పాలి. ఎస్వీ రంగారావు.. కైకాల సత్యనారాయణ.. రావు గోపాలరావు శకం ముగిసిన తర్వాత ఆ లోటును తీర్చిన నటుడిడా కోటా శ్రీనివాసరావు అనే చెప్పాలి. ముచ్చెమటలు పట్టించే విలన్ గా.. పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించటం ఆయనకు మాత్రమే సాధ్యం. సర్కార్ సినిమాలో సెల్వర్ మణిగా నటించి బిగ్ బి అమితాబ్ ప్రశంసల్ని అందుకున్నారు కోటా శ్రీనివాసరావు.
ఈ మధ్యనే ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్.. కోటా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోలో ఆయన బక్కచిక్కిపోయి.. కాలికి కట్టుతో కనిపించటంతో కోటాకు ఏమైందన్న చర్చ మొదలైంది. ఈ సందర్భంగా బండ్ల గణేశ్ పోస్టు పెట్టి.. ‘కోటా బాబాయ్ ను కలవటం చాలా సంతోషాన్ని ఇచ్చింది’ అని పేర్కొన్నారు. ఇదే బయట ప్రపంచం ఆయన్ను చివరిసారిగా చూసిన సందర్భంగా చెప్పాలి. ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే ఆయన తుదిశ్వాస విడిచి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణవార్త తెలుసుకున్న వారంతా షాక్ కు గురవుతున్నారు. పలువురు నటీనటులు ఆయన మృతికి విచారం వ్యక్తం చేస్తూ.. ఆయన కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
పరిచయం చేయాల్సిన అవసరం లేని తెలుగు నటుడు కోటా శ్రీనివాసరావు. నిజానికి ఆయన తెలుగువాడు కాకుండా.. ఉత్తరాదికి చెందిన నటుడైతే ఆయన ఎలివేషన్ మరోలా ఉందన్న మాట అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. కర్కసమైన రాజకీయ నాయకుడిగా.. కసి పుట్టించే విలనిజాన్ని పండించాలన్నా కోటాకు మించినోళ్లు మరొకరు ఉండరు. తన గంభీరమైన గొంతును.. సెటిల్డ్ గా చేసే డైలాగ్ డెలివరీతో ఆయన పండించే విలనిజం నభుతో నభవిష్యతి అని చెప్పాలి.
ఓవైపు తీవ్రమైన భావోద్వేగానికి గురి చేసే విలనిజాన్ని పండిస్తూనే..కడుపుబ్బా నవ్వించే కామెడీ పాత్రలు పోషించే టాలెంట్ కోటాకు సొంతం. ఆయన 83వ జన్మదిన వేడుకలు రెండు రోజుల క్రితమే (జులై 10న) చేసుకున్నారు. 83లోకి అడుగు పెట్టిన రెండు రోజులకే ఆయన తుదిశ్వాస విడవటం వేదనకు గురి చేస్తుందని చెప్పాలి. టాలీవుడ్ పరిశ్రమకు ఒక గొప్ప నటుడ్ని కోల్పోయిందని చెప్పాలి. క్యారెక్టర్ నటుడిగా ఒక స్థాయిని సెట్ చేసుకోవటం కోటాకు మాత్రమే సాధ్యమైందని చెప్పాలి. తన నటనతో సిల్వర్ స్క్రీన్ ను సుసంపన్నం చేసిన ఆయన లాంటి నటుడు మళ్లీ రారని మాత్రం చెప్పక తప్పదు.
తన నటనతో విలనిజానికి కొత్త అర్థం చెప్పిన నటుడిగా కోటాను చెప్పాలి. రంగస్థలం నటుడిగా తన సత్తాను చాటిన ఆయన.. వెండితెర మీద తన నట విశ్వరూపాన్ని చూపారనే చెప్పాలి. సినిమాలో ఆయన ప్రదర్శించే విలనిజంతో ఆయనంటే రగిలిపోయేలా చేసిన టాలెంట్ ఆయన సొంతం. స్క్రీ న్ మీద ఆయన కనిపించే వేళ.. ఆయన నటనతో సాటి నటులకు మాత్రమే.. హీరోలను సైతం డామినేట్ చేయటం ఆయనకే చెల్లుతుంది. టాలీవుడ్ లో ఎంతో మంది నటులు ఉండొచ్చు కానీ కోటాను రీప్లేస్ చేసే నటుడ్ని మాత్రం తీసుకురాలేదని చెప్పాలి. నవరసాల్ని ఇట్టే పలికించే ఆయన టాలెంట్ అరుదైనదిగా చెప్పాలి. కోటా శ్రీనివాసరావు విషయంలో ఒక అంశాన్ని ప్రస్తావించాలి. ప్రసార మాధ్యమాలు.. మరి ముఖ్యంగా టీవీ న్యూస్ చానళ్ల పుణ్యమా అని పలు సందర్భాల్లో ఆయన మరణించినట్లుగా బ్రేకింగ్ న్యూస్ లు వేసి.. ఆ తర్వాత నాలుకర్చుకున్న సందర్భాలెన్నో.
సాధారణంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించే నటుడికి ప్రత్యేక గుర్తింపు.. గౌరవం పెద్దగా లభించదు. అయితే.. కోటా శ్రీనివాసరావు అందుకు మినహాయింపుగా చెప్పాలి. ఆయనకు మాత్రమే సాధ్యమైన మరో మేజిక్ ను ఇక్కడ ప్రస్తావించాలి. ఓవైపు విలన్ వేషాలు వేస్తూ.. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ గా.. హాస్య నటుడిగా ఆయన నటించిన సినిమాల్లో బాబూమోహన్ కలిసిన పాత్రలు ప్రత్యేకమని చెప్పాలి. ఈ ఇద్దరి కాంబినేషన్ కొన్నేళ్లు పాటు సాగింది. ఈ ఇద్దరు పలు జోనర్లలో కలిసి పని చేయటం వారికిమాత్రమే సాధ్యమవుతుందేమో. అలాంటి కాంబినేషన్ టాలీవుడ్ లో సాధ్యం కాదనే చెప్పాలి.