తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ జరుగుతున్న ప్రచారంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శనివారం ఘాటుగా స్పందించారు. కొందరు రౌడీషీటర్లు మద్యం తాగుతూ కోటంరెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బే అంటూ మాట్లాడుకున్న వీడియో శుక్రవారం నుంచి వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఓ రౌడీషీటరును పోలీసులు వేరే కేసులో అరెస్టు చేసి జైలుకు పంపగా, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఇక వీడియో బయటకు వచ్చిన నుంచి కోటంరెడ్డి భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన అభిమానులు, సన్నిహితులు ఫోన్ ద్వారా, నేరుగా ఆయనను కలుస్తూ వాకబు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ప్రతిపక్ష వైసీపీ తీరును తప్పుబట్టిన కోటంరెడ్డి.. నన్నుచంపేస్తారా? అంటూ ప్రశ్నించారు.
తుదిశ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పిన ఎమ్మెల్యే కోటంరెడ్డి, వైసీపీ సోషల్ మీడియా బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ‘వైసీపీ సోషల్ మీడియాకు ఇది కొత్తకాదు. సొంత కుటుంబ సభ్యులను చంపించే సంప్రదాయం తనది కాదు. ఆస్తులు, అంతస్తుల కోసం తోడబుట్టిన వారిని వేధించే సంప్రదాయం తనది కాదు’’ అంటూ కోటంరెడ్డి నిప్పులు చెరిగారు. విద్యార్థి నేతగా ఉన్నప్పుడే నెల్లూరులో రౌడీషీటర్లను తరిమి తరిమి కొట్టిన చరిత్ర తనది అంటూ చెప్పుకొచ్చారు. గతంలనూ తనకు, కుటుంబ సభ్యులకు ఎన్నో బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు. ప్రజల కోసం తన వెంట నడిచే కార్యకర్తల కోసం దేన్నయినా ఎదుర్కొంటా అంటూ తేల్చిచెప్పారు కోటంరెడ్డి.
వీడియో బయటకు వచ్చిన నుంచి తనకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. వీడియో చూశాక షాక్ అయ్యాను. నేరచరిత్ర కలిగిన కొందరు జులై 1న మాట్లాడుకున్నారు. అందులో ఒకరు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు. మరొకరు చంపెద్దాం అన్నారు. ఇంకొకరు ఉదయం మాట్లాడదాం అన్నారు. జిల్లా ఎస్పీకి మూడు రోజుల ముందే సమాచారం ఉన్నట్లు మీడియాలో వచ్చింది. అలాంటప్పుడు ఆయన నాకు ముందే ఎందుకు చెప్పలేదు. ఈ విషయంలో పోలీసులు నన్నెందుకు అలర్ట్ చేయలేదు. ఎమ్మెల్యేగా కాదు. ఒక పౌరుడిగా అడుగుతున్నా, రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా? ఆ డబ్బు ఎవరు ఇస్తారు? పోలీసుల విచారణలో అది తేలాలని అని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు వైసీపీ ఎందుకు స్పందించింది. వీడియోలో ఉన్న మాటలు నిజం కాదా? అంటూ కోటంరెడ్డి ప్రశ్నించారు.
నా తమ్ముడు కోటంరెడ్డి గిరి కుట్ర చేశారని అంటున్నారు. రాజ్యాధికారం కోసం సొంతవాళ్లనే హతమార్చిన డీఎన్ఏ మీది? మాది కాదు ఇలాంటి బెదిరింపులు భయపడేవాడిని కాదు. నన్ను దిక్కరిస్తే అణచివేస్తా అన్నందుకు జగన్ సీఎంగా ఉన్నప్పుడు 16 నెలల ముందే బయటకు వచ్చా, నన్ను నా తమ్ముడిని బోరుగడ్డ అనిల్ కట్టేసి లాగుతా అన్నప్పుడే భయపడలేదు. ఏదో ఒక రోజు మరణం తప్పదు. చావుకు భయపడుతూ బతకడం మాకు తెలియదు. నన్ను చంపితే ఎవరికి ప్రయోజనం అన్నది పోలీసులే తేల్చాలని కోటంరెడ్డి కోరారు.