తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ కాంగ్రెస్ నాయకులపై చేసిన సంచలన ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన తల్లిని టార్గెట్ చేస్తూ తమ కుటుంబంపై రాజకీయ కుట్ర జరుగుతోందని సుస్మిత తీవ్ర స్థాయిలో విమర్శించారు.
బుధవారం అర్థరాత్రి మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. మాజీ ఓఎస్డీ సుమంత్ ను అరెస్టు చేసేందుకు వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మఫ్టీలో వచ్చారు. ఈ సమయంలో అడ్డుకున్న సుస్మిత పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అరెస్ట్ వారెంట్ చూపించకుండా తమ ఇంట్లోకి రావడానికి వీల్లేదని ఆమె ఖరాఖండీగా తేల్చి చెప్పారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గారు. సుమంత్‌ను సిమెంట్ కంపెనీ యాజమాన్యాన్ని బెదిరించారనే ఆరోపణలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఆయన్ను ఓఎస్డీ పదవి నుంచి తొలగించింది.
పోలీసుల చర్య అనంతరం మీడియాకు మాట్లాడిన కొండా సుస్మిత, సొంత ప్రభుత్వంలోని నేతలపై సంచలన ఆరోపణలు గుప్పించారు. ‘రేవంత్ రెడ్డి మా అమ్మను చాలా సార్లు అసహనంగా మాట్లాడేవాడు.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది’ అంటూ ఆవేదన చెందారు. బీసీ వర్గానికి చెందిన తమ తల్లిని రాజకీయంగా అణగదొక్కేందుకు పార్టీలోని ‘రెడ్డి’ వర్గం కుట్ర పన్నుతోందని ఆమె ఆరోపించారు. “రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి” ఈ కుట్ర వెనుక ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తమ తల్లిని మంత్రి పదవి నుంచి తీసేయాలని చూస్తున్నారని, సుమంత్ కేసును తమ తల్లిపైకి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. “మా తల్లిదండ్రులకు ఏమైనా హాని జరిగితే, పూర్తి బాధ్యత వీళ్లదే. మా నాన్నను, తల్లిని హతమార్చే ప్రయత్నాలు చేస్తున్నారు” అని సుస్మిత ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే తమ కుటుంబం ప్రశాంతంగా ఉందని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తమపై కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ వివాదంపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించినట్లు తెలుస్తోంది. సుస్మిత గురువారం మీడియాతో మాట్లాడుతూ, “అధిష్టానం మాతో మాట్లాడింది, మీడియాలో ఏ అంశాలపై మాట్లాడరాదు అని సూచనలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని విషయాలపై మాట్లాడలేను, ఏం జరిగిందో అందరికీ తెలుసు” అని పేర్కొన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, మంత్రి కొండా సురేఖ గురువారం ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీకి గైర్హాజరయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ నుంచి ఆమెకు పిలుపు రావడంతోనే కేబినెట్ సమావేశానికి వెళ్లలేదని సమాచారం.
ఈ మొత్తం వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను, ముఖ్యంగా బీసీ, రెడ్డి నాయకుల మధ్య రాజకీయ ఉద్రిక్తతలను బట్టబయలు చేసింది.