ఒక వైపు బిడ్డ లాంటి పార్టీ. మరో వైపు సొంత బిడ్డ. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడంలో కేసీఆర్ తడబడ్డారా దాని ఫలితం ఇపుడు పార్టీకి తెలిసి వస్తోందా అన్నదే చర్చగా ఉంది. కేసీఆర్ అంటే అగ్ని కణం, ఒక మొండి ఘటం. ఆయనకు ఎవరెదెళ్ళినా రిస్క్ ఒకనాడు మధ్యాహ్న మార్తాండుడు మాదిరిగా ఆయన వెలిగిపోయారు. ఆయన ప్రభ తెలంగాణా సమాజాన్ని మొత్తం ఒక్కటిగా చేసింది. అంతే కాదు జాతీయ రాజకీయాలను కొన్నాళ్ళ పాటు ప్రభావితం చేసింది. రాదు అనుకున్న తెలంగాణా కలను సాకారం చేసిన మగాడిగా పోరాట యోధుడిగా చరిత్ర పుటలకెక్కిన కేసీఆర్ కి ఇది ఇపుడు గతమైన వైభవమా అన్న చర్చ వస్తోంది.
అధికారాంతమునందు చూడవలదా ఆ అయ్య సౌభాగ్యముల్ అన్నట్లుగా ఇపుడు బీఆర్ఎస్ పరిస్థితి తయారు అయింది అని అంటున్నారు. అధినేత కేసీఆర్ దాదాపుగా రెండేళ్ళుగా జనంలోకి రావడం లేదు. 2023లో పార్టీ ఓటమి తరువాత నుంచి ఆయన ఫాం హౌస్ కే పరిమితం అయ్యారు. ఇక పార్టీని వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేసీఆర్ అలాగే కీలక నేత హరీష్ రావు నడుపుతున్నారు. ఈ ఇద్దరి మధ్య పొరపొచ్చాలు అయితే ప్రస్తుతానికి లేవని అంటున్నారు. కానీ అనూహ్యంగా కవిత రూపంలో బీఆర్ఎస్ కి పెను సవాల్ ఎదురైంది. ఆమె కేసీఆర్ ముద్దుల తనయ. ఆమె ఇలా ఎదురు నిలిచి ఉంటుందని కలలో కూడా ఎవరూ అనుకోని పరిస్థితి. కానీ అదే జరిగింది. దాంతోనే పెద్దాయన ఇబ్బందులో పడ్డారు అని అంటున్నారు.
కుమార్తె కవిత మూడు నెలలుగా బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ధిక్కార ధోరణి వినిపిస్తున్నా పేగు బంధం అడ్డు వచ్చి చర్యలకు వెనకడుగు వేసారు అని అంటున్నారు. కానీ చివరికి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతి అంటూ సీబీఐ దాకా కధ సాగింది, కాంగ్రెస్ బీజేపీ ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవే ఆరోపణలను కవిత చేయడం ద్వారా ఏకంగా కేసీఆర్ కే అవినీతి మరక అంటించారు. ఆమె ఎత్తి చూపుతున్న హరీష్ రావు సంతోష్ రావులదే తప్పు అనుకున్నా వారి కంటే ఎక్కువగా ఎఫెక్ట్ కేసీఆర్ కే ఉంటుంది అన్న లాజిక్ ని ఆమె ఎలా మిస్ అయ్యారు అని అంటున్నారు. సరిగ్గా ఇక్కడే బీఆర్ఎస్ కి భారీ షాక్ తగిలింది. అందుకే పెద్దగా ఆలోచించకుండానే కవిత మీద సస్పెన్షన్ వేటు వేశారు. అయితే సుమారుగా మూడు నెలల పాటు ఆమె చేసిన ధిక్కార ప్రకటనలను అలా చూస్తూ వదిలేసిన వైనం కాస్తా పార్టీలో కట్టు తప్పినట్లుగానే ఉంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే పార్టీని నిందించి బయటకు పోయిన ఎందరో నేతలు ఉంటారు. అయితే వారు వేరు, కవిత విషయం వేరు అని అంటున్నారు. ఆమె సొంత బిడ్డ. దాంతో ఇది పార్టీపరంగానే కాదు వ్యక్తిగతంగా మానసికంగానూ కేసీఆర్ కి అతి పెద్ద దెబ్బగా మారుతోంది అని అంటున్నారు. కేసీఆర్ కవిత ఎపిసోడ్ తో బాగా కృంగిపోయారని అంటున్నారు. ఆయన ఏడు పదులు దాటిన వయసులో ఉన్నారు. అపుడపుడు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. పార్టీ చూస్తే రెండేళ్ళ ఓటమి తరువాత కూడా పెద్దగా ఎత్తిగిల్లలేదు. మరో వైపు రేవంత్ రెడ్డి రూపంలో బలమైన ఆల్టర్నేషన్ అధికారంలో ఉంది. అది బీఆర్ఎస్ నే గురి పెట్టి ఉంది. ఈ క్లిష్ట సమయలో సొంత అనుకున్న బిడ్డ నుంచే ఎదురుదాడి అనూహ్యగా రావడంతో పెద్దాయన మానసికంగా సైతం ఇబ్బంది పడేలా ఉందని అంటున్నారు.
దగ్గరలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. పార్టీ పుంజుకోవడానికి ఇదే సరైన సమయం. కానీ ఈలోగానే సొంత ఇంట్లోనే కలహాలు చెలరేగుతున్నాయి. దాంతో ఏమి చేయాలో పాలు పోని స్థితిలో గులాబీ పార్టీ ఉందని అంటున్నారు. గతంలో ఎన్నో సవాళ్ళు ఎదురైనప్పటికీ పార్టీని సమర్ధంగా నడిపించిన కేసీఆర్ కి కవిత రూపంలో దక్కిన భారీ షాక్ కోలుకోలేనిదే అని అంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ మాత్రం గులాబీ పార్టీ తన ప్రభావాన్ని చూపించలేకపోతే మాత్రం ఆ పార్టీ నుంచి మరిన్ని ఫిరాయింపులు తిరుగుబాట్లూ ఉన్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.