తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. గులాబీ బాస్ కేసీఆర్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన రెండో రోజున ఆయన ఫాంహౌస్ లో జారి పడటం.. అస్వస్థతకు గురి కావటం.. ఆయన్ను ఆసుపత్రిలో చేర్చటం తెలిసిందే. అది మొదలు.. అప్పుడప్పుడు ఆయన అస్వస్థకు గురైనట్లుగా వార్తలు వస్తున్నాయి. నెల క్రితం ఆయన హటాత్తుగా యశోదా ఆసుపత్రికి వెళ్లటం తెలిసిందే. పలు పరీక్షలు జరపటంతో పాటు.. ఆసుపత్రిలో ఉండాల్సి రావటంతో గులాబీ దళంలో చర్చగా మారింది.
అయితే.. ఆయనకు సోడియం నిల్వలు తగ్గాయని.. తగిన చికిత్స చేస్తున్నట్లుగా చెప్పినప్పటికీ.. కేసీఆర్ ను ఇబ్బందికి గురి చేస్తున్న ఆరోగ్య సమస్య వివరాలు మాత్రం పూర్తిస్థాయిలో వెలుగు చూసింది లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్ మరోసారి అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. ఆయన బాడీలోని చక్కెర.. సోడియం స్థాయిల్లో వ్యత్యాసాలు వస్తున్నట్లుగా గుర్తించిన వైద్యులు.. అందుకు అవసరమైన చికిత్సను అందిస్తున్నట్లుగా సమాచారం.
కేసీఆర్ మరోసారి అస్వస్థతకు గురి కావటంతో వైద్యుల టీం ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ కు వెళ్లింది.ఇదిలా ఉండగా మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొడుకు హిమాన్షుతో కలిసి కేటీఆర్ స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లిన వైనం అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది. ఫాంహౌస్ లోనే ఉన్న డాక్టర్ల టీం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఒకట్రెండు రోజులు ఫాంహౌస్ లోనే ఉంచి చికిత్స చేస్తారని.. పరిస్థితి మెరుగుపడకుంటే మాత్రం.. హైదరాబాద్ కు తరలిస్తారని చెబుతున్నారు. ఏమైనా.. తరచూ అనారోగ్యానికి గురవుతున్న కేసీఆర్ తీరు.. ఆయన ఆరోగ్యంపై మరిన్ని వివరాల్ని వెల్లడించాల్సిన అవసరం గులాబీ పార్టీ ముఖ్యనేతల మీద ఉన్నట్లుగా చెప్పక తప్పదు.