రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో.. ఎవరూ ఊహించలేరు. నిండిన రంగం. ఇక్కడ రక్తసంబంధాలు, కుటుంబ అనుబంధాలు కూడా తమ రాజకీయ ప్రయోజనాల ముందు వెనక్కి తగ్గుతాయనడంలో ఎలాంటి సందేహాం లేదు. కల్వకుంట్ల కవితకు ఇటీవల ఎదురైన పరిణామాలు దీనికి ప్రతీకాత్మక ఉదాహరణ.
బీఆర్ఎస్‌లో కవితపై అసంతృప్తి చాలా కాలంగా ఉందనే వార్తలు వినిపించేవి. ఆమె చర్యలు, వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు బలం చేకూరుస్తున్నాయనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో పెరిగింది. చివరికి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆమెను సస్పెండ్ చేశారు. ఆ వెంటనే కవిత కూడా ఎమ్మెల్సీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బీఆర్ఎస్‌తో ఉన్న సంబంధాలను తెంచుకున్నారు.
ఇక్కడ గమనించదగ్గ అంశం ఏమిటంటే పార్టీ ఆమెను రాజకీయంగా మాత్రమే కాకుండా, వ్యక్తిగత గుర్తింపులోనూ వేరుచేయడానికి ప్రయత్నించింది. ఇప్పటి వరకు “కల్వకుంట్ల కవిత”గా ప్రసిద్ధి చెందిన ఆమెను ఇప్పుడు “దేవనపల్లి కవిత”గా పేర్కొంటున్నారు. ఇది కేవలం ఇంటిపేరు మార్పు కాదు. ఇది కుటుంబ వారసత్వం నుంచి, తండ్రి పేరు నుంచి విడదీసే ఒక వ్యూహాత్మక కదలిక. ఆమె భర్త అనిల్‌కుమార్ ఇంటిపేరు దేవనపల్లి అయినప్పటికీ, ఇప్పటి వరకు కవిత తన తండ్రి కేసీఆర్ వారసత్వాన్నే ముందుకు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే పునాదిని బీఆర్ఎస్ తొలగించే ప్రయత్నం చేస్తోంది.
ఇలాంటి పరిణామాలు ఇతర రాజకీయ కుటుంబాల్లో కూడా జరిగాయి. వైఎస్ షర్మిల ఉదాహరణ ఇందుకు దగ్గరది. ఆమె తన తండ్రి వైఎస్సార్ పేరు ఆధారంగా ప్రజల్లోకి రావాలని చూస్తే, వైఎస్సార్‌సీపీ ఆమెను “మొరుసుపల్లి షర్మిల”గా పిలుస్తూ వేరుచేసింది. దీంతో పార్టీ, కుటుంబ విభేదాలు బహిరంగమయ్యాయి.
కవిత విషయంలోనూ ఇదే రీతిలో సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మహిళా శక్తికి ప్రతీకగా నిలిచిన ఆమె, ఇప్పుడు అదే పార్టీ చేతిలో విమర్శలకు గురవుతున్నారు. ఇది కేవలం వ్యక్తిగత ఓటమి కాదు, బీఆర్ఎస్‌లో అంతర్గత కలహాల తీవ్రతను కూడా బయటపెడుతోంది.కవిత భవిష్యత్తు రాజకీయ దిశ ఏంటి? కొత్త పార్టీని స్థాపిస్తారా? లేక ఇతర కూటముల్లో అవకాశాలు వెతుకుతారా? ఒకవేళ ఆమె తన తండ్రి వారసత్వాన్ని కోల్పోతే, ప్రజల్లో కొత్త గుర్తింపు సాధించగలరా? ఇవన్నీ సమాధానం కోసం ఎదురుచూస్తున్న ప్రశ్నలు.