కల్వకుంట్ల కవిత తన ప్రత్యర్ధి ఎవరో తేల్చుకున్నారు. ఆమె బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్ళి కొద్ది కాలమే అయింది. అయితే ఆమె తన విమర్శల బాణాలు అన్నీ కూడా హరీష్ రావు మీదనే చేస్తూ వచ్చారు. తన తండ్రికి కుటుంబానికి బీఆర్ఎస్ కి తనను దూరం చేయడం వెనక హరీష్ రావు పాత్ర చాలానే ఉందని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆమె హరీష్ రావునే గట్టిగా టార్గెట్ చేస్తున్నారు.
ఇక కవిత తాజాగా కేసీఆర్ పుట్టిన ఊరు అయిన చింతమడకకు వచ్చారు. ఇది సిద్దిపేట నియోజకవర్గంలో ఉంది. కేసీఆర్ సొంత ఊరు అంటే కవితకు కూడా పుట్టిల్లు కింద లెక్క. ఇక ఆమెకు చింతమడకలో ఘన స్వాగతం లభించింది. ఆమె బతుకమ్మ ఆడుతూ అక్కడ వారితో కలిసిపోయారు. మొత్తం గ్రామం అంతా ఆమెను అక్కున చేర్చుకున్నారు, ఆదరించారు. ఒక విధంగా చాన్నాళ్ళుగా బీఆర్ఎస్ మీద పోరాడుతూ ఆఖరికి పార్టీకి దూరమై ఇబ్బంది పడుతున్న కవితకు తన తండ్రి సొంత ఊరిలో ఘన స్వాగతం అతి పెద్ద ఊరటగా చెబుతున్నారు.
సిద్ధిపేట ఎవరి జాగీరు కాదని ఈ సందర్భంగా కవిత కీలక వ్యాఖ్యలు చేసారు. సిద్దిపేట నుంచి అనేక సార్లు కేసీఆర్ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 2004లో ఎంపీగా పోటీ చేయడంతో సిద్దిపేట హరీష్ రావుకు దక్కింది. ఆయన కూడా గత పాతికేళ్ళుగా అక్కడ నుంచి ఎన్నో సార్లు పోటీ చేసి పాతుకు పోయారు. అయితే కవిత తాజాగా చింతమడకను సందర్శించి చేసిన వ్యాఖ్యలు చూస్తే హరీష్ మీదనే గురి పెట్టినట్లుగా అర్ధం అవుతోంది. సిద్దిపేట ప్రైవేట్ ప్రాపర్టీగా మార్చుకౌన్నారని ఆమె విమర్శించారు. ఇక్కడ ఎవరినీ రావద్దు అని నిబంధనలు విధించడం కూడా కుదరదు, చింతమడకకు తాను కచ్చితంగా వచ్చి తీరుతాను అని ఆమె స్పష్టం చేశారు. ఇక మీదట పదే పదే వస్తాను అని చెప్పడం ద్వారా సిద్దిపేట తన సొంత ఇలాకా అని ఆమె చెబుతున్నారన్న మాట.
కొత్త పార్టీ కవిత పెట్టబోతున్నారా అంటే దానికి కూడా కొన్ని సంకేతాలు అయితే ఆమె నుంచి వచ్చాయి. అయితే ప్రస్తుతం రాజకీయాల్లో కొత్త పార్టీకి స్పేస్ ఉందా అన్న ప్రశ్నకు ఆమె జవాబు లాజిక్ కి అందేలా ఉంది. ఎవరూ కూడా రాజకీయాల్లో స్పేస్ ఇవ్వరు. మనమే నిచ్చెన ఎక్కి దాని మీద ఉన్న వారిని దించేయాలి. అపుడే స్పేస్ దొరుకుతుంది అని అన్నారు. అంతే కాదు, తనకు జీవితంలో రెండు ఏడాదులు చేదుగా మారాయని ఆమె చెప్పారు. 2023, 2025 అని ఆమె అంటున్నారు . 2023లో బీఆర్ఎస్ ఓటమి ఆమెని బాధించింది అని అర్థం చేసుకోవాలి. అలాగే 2025లో బీఆర్ ఎస్ నుంచి తనను దూరం చేయడం మరింత బాధించింది అని అంటున్నారు.
బీఆర్ఎస్ కి ఈ రోజున అవినీతి ముద్ర పడడం కానీ ఓటమి పాలు కావడం కానీ ఇలా అనేక విషయాలలో హరీష్ పాత్ర ఉందని కవిత నమ్ముతున్నారు. అందుకే ఆమె హరీష్ రావునే టార్గెట్ చేస్తున్నారు. ఆయన సిద్దిపేటనే తన ఎన్నికల కార్యక్షేత్రంగా మార్చుకోవాలని చూస్తున్నారు. 2028లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కవిత సిద్దిపేట నుంచి పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. సిద్దిపేట ఎటూ కేసీఆర్ సొంత సీటే కావడం ఆయన పుట్టిన ఊరు అక్కడే ఉండడం అనేక సార్లు కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి ఉండడంతో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని భావిస్తున్నారు. అంతే కాదు ఎక్కువ సార్లు గెలిచినందువల్ల హరీష్ రావు మీద యాంటీ ఇంకెంబెన్సీ కూడా ఉందని అంటున్నారు. మొత్తానికి మాస్టర్ ప్లాన్ తోనే కవిత ముందుకు సాగుతున్నారని అంటున్నారు.