బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత.. పక్కా ప్లాన్‌తోనే ముందుకు సాగుతున్నారు. రెండు రోజలు కిందట అర్ధరాత్రి సొంత నాయకులతో భేటీ అయిన ఆమె.. ఆ సమావేశంలో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. అదే.. బీఆర్ఎస్‌ను సాధ్యమైనంతగా రెచ్చగొట్టడం. ఈ క్రమంలోనే ఆమె బీఆర్ఎస్‌ను వేరు చేస్తూ.. తాజాగా వ్యాఖ్యలు చేయడం వెనుక మర్మమని తెలుస్తోంది. బీఆర్ఎస్ నాయకులు అందరూ తన వెనుక రావాల్సిందేనని ఆమె వ్యాఖ్యానించారు.
వాస్తవానికి ఆమె బీఆర్ ఎస్‌లో ఉన్నానని అనుకుంటే.. ఇలా ఎవరో వచ్చి తన వెనుక జాయిన్ కావాల్సిన అవసరం లేదు. అంటే.. తాను బీఆర్ఎస్‌లో వేరుగా ఉన్నానని, మిగిలిన వారంతా మరో పక్షంగా ఉన్నారని ఆమె పరోక్షంగా చెబుతున్నట్టుగా అర్ధమవుతోంది. దీనిని బట్టి.. కవిత.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. బీఆర్ ఎస్ నాయకులు అందరూ.. తన వెంట రావాలని చెప్పడం ద్వారా.. తనకు ప్రత్యేక అజెండా ఉందని కూడా ఆమె పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్టు అయింది.
అంటే.. మనసులో ఒకటి.. బయటకు మరొకటి అన్నది కవిత రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిని బట్టి.. ఇక, `డియర్ డాడీ.. కేసీఆర్.. ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు పరిశీలకులు. తీన్మార్ మల్లన్న వ్యవహారంలో బీఆర్ఎస్ మౌనంగా ఉన్న విషయాన్ని కవిత శిబిరం జీర్ణించుకోలేకపోతోంది. తన అన్న కేటీఆర్ కు ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ రేస్ కేసులో నోటీసులు ఇచ్చినప్పుడు కవిత స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంపై కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు ఏకంగా ధర్నా కూడా చేశారు.
కానీ.. తన వరకు వచ్చేసరికి అంటే.. తీన్మార్ మల్లన్న మంచం-కంచం అంటూ.. చేసిన వ్యాఖ్యలపై మాత్రం బీఆర్ఎస్ నాయకులు ఒక్కరు కూడా స్పందించకపోవడాన్ని కవిత జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజుల కిందట అర్ధరాత్రి సమావేశం ఏర్పాటు చేశారన్నది వార్తల్లోనే వచ్చింది. వ్యూహాత్మకంగా వేడి పెంచి.. బీఆర్ఎస్ ముల్లును బీఆర్ ఎస్‌తోనే తీయించేలా.. ఆమె అడుగులు వేస్తున్నారని స్పష్టమవుతోంది. మరి కేసీఆర్ సత్వరమే నిర్ణయం తీసుకుంటారో.. వేచి చూస్తారో చూడాలి.