కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై రాజకీయం బాగా వేడెక్కింది. ఒకదాన్ని మించి ఒకటిగా నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. సిద్దరామయ్య, డీకే శివకుమార్ మధ్య కుర్చీపోరు తుది దశకు చేరుకుంది. తన సహనం నశిస్తోందంటూ డీకే సంకేతాలు ఇస్తుండగా, కుర్చీ దిగేదే లేదన్నట్టు సిద్దరామయ్య తేల్చిచెబుతున్నారు. వీరి పోరాటం తాజాగా సోషల్ మీడియాకు ఎక్కింది. ఇద్దరూ గురువారం ‘ఎక్స్’లో వాడీవేడీ పోస్టులు పెట్టారు. ‘ఇచ్చిన మాటమీద నిలబడటం ప్రపంచంలో గొప్ప విషయం, అది న్యాయమూర్తి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు లేదా నేను కావచ్చు’ అని డీకే శివకుమార్ పోస్టు చేయగా, దీనికి కౌంటర్‌గా సిద్దరామయ్య.. ‘మేము కర్ణాటకకు ఇచ్చిన మాట కేవలం నినాదం కాదు.. అదే మాకు సర్వస్వం’ అని ట్వీట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కన్నడ రాజకీయం ఢిల్లీకి మారింది. బెంగళూరు పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం ఉదయం హడావుడిగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. దీనికి ముందు ఆయన తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ ‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు నాకు తెలుసు. ఒకట్రెండు రోజుల్లోనే సీఎం సిద్దరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌ను ఢిల్లీకి పిలుస్తాం. సోనియా, రాహుల్‌తో సహా సీనియర్ నేతలతో సమావేశమై చర్చిస్తా’ అన్నారు.
మొహమాటపు పరదాలు తొలుగుతున్నాయి. పెద్దమనుషులు చిన్నపిల్లల మాదిరి మారుతున్నారు. మొన్నటి వరకు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరుకు భిన్నంగా నీది తప్పంటే నీదే తప్పు అన్నట్లుగా తమ వాదనల్ని కవితాత్మక ధోరణిలో పోస్టులు పెడుతూ సోషల్ మీడియాలో రచ్చకెక్కారు. కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు అధికార బదిలీ అంశంపై కొద్ది రోజులుగా నడుస్తున్న పంచాయితీ ఇప్పుడు ముదిరి పాకాన పడింది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించటం.. సీఎం కుర్చీలో ఎవరు కూర్చోవాలన్న దానిపై సిద్దరామయ్య.. డీకే శివకుమార్ మధ్య జరిగిన పోరుకు ఒక పరిష్కారాన్ని చెబుతూ.. ఐదేళ్ల అధికారంలో రెండున్నరేళ్లు సిద్దూ.. మిగిలిన రెండున్నరేళ్లు డీకే శివకుమార్ లు ముఖ్యమంత్రిగా ఉండేలా ‘మాట’ మాట్లాడుకోవటం తెలిసిందే.
పెద్ద మనుషుల ఒప్పందం మాదిరి.. అధిష్ఠానం వద్ద జరిగిన ఈ వ్యవహారం మొత్తం నాలుగు గోడల మధ్యే జరిగిందే తప్పించి.. నలుగురి మధ్య జరిగింది కాదు. అధికారాన్ని షేర్ చేసుకోవటం మీద తాము ఓకే చేసిన ఫార్ములా గురించి అటు సిద్దూ కానీ.. ఇటు డీకే కానీ బయట మాట్లాడింది లేదు. చూస్తుండగానే రెండున్నరేళ్ల దాటిపోయింది. ముఖ్యమంత్రి పదవి నుంచి పక్కకు తప్పుకొని.. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ కు పదవీ పగ్గాలు ఇవ్వాల్సిన వేళ.. ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ సిద్దూ రివర్సులోకి రావటంతో అధికారబదిలీ అనుకున్నట్లుగా స్మూత్ గా కాకుండా సమస్యగా మారింది.
ఇలాంటి వేళ.. అధిష్ఠానం పార్టీ జాతీయ అధ్యక్షుడు సాటి కన్నడిగు అయిన మల్లికార్జున ఖర్గేను కర్ణాటకకు పంపినా ఫలితం లేకుండా పోయింది. రోజులు గడుస్తున్నా.. అడుగు ముందుకు పడని నేపథ్యంలో గురువారం ఉదయం 8.21 గంటల వేళలో ఇచ్చిన మాట ఎంత విలువైనదన్న విషయాన్ని ఒక కొటేషన్ ను పోస్టర్ ద్వారా ద్వారా చెబుతూ ఒక పోస్టును పెట్టారు. ఇందులో ‘వర్డ్ పవర్ ఈజ్ వరల్డ్ పవర్’ అంటూ మీడియా మైకుల ముందు డీకే శివకుమార్ మాట్లాడే ఫోటోకు క్యాప్షన్ గా పెట్టేశారు. ఇందులోనే తాను చెప్పాల్సిన అంశాల్ని చెప్పేశారు.
డీకే పెట్టిన పోస్టులో ఏముందంటే.. ‘‘మాట (వర్డ్) నిలబెట్టుకోవటం కంటే గొప్ప విషయం ప్రపంచంలో మరొకటి లేదు. న్యాయమూర్తి.. అధ్యక్షుడు.. ఇలా ఎవరైనా సరే మాట మీద నిలబడాల్సిందే’’ అంటూ తాను చెప్పాల్సిన విషయాన్ని చెప్పేశారు. ఈ పోస్టు కన్నడనాట రాజకీయ సంచలనంగా మారి పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. దీనికి సిద్దూ వర్గం ఎలాంటి కౌంటర్ ఇస్తారని ఆసక్తిగా ఎదురుచూసినోళ్ల నిరీక్షణకు ముగింపు పలుకుతూ కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఎక్స్ ఖాతాలో ఒక పోస్టర్ చేశారు. ఇందులోనూ అశేష ప్రజలకు తాను చెబుతున్నట్లుగా అర్థం వచ్చేలా ఫోటోను షేర్ చేశారు. గురువారం సాయంత్రం 6.39 గంటల వేళలో పోస్టు పెట్టారు.
అందులో ఏముందంటే.. ‘‘కన్నడ ప్రజలు మాకిచ్చిన తీర్పు కేవలం ఒక క్షణం కోసం కాదు. అది ఐదేళ్ల పూర్తి బాధ్యత. నాతో సహా కాంగ్రెస్ పార్టీ మా ప్రజలకు ఇచ్చిన మాటలను చేతల్లో చేసి చూపిస్తున్నాం. కన్నడ ప్రజలకు మేం ఇచ్చిన మాట కేవలం ఒక నినాదం కాదు. అదే మాకు ప్రపంచం’’ అంటూ పోస్టు పెట్టారు. ఉదయం వేళలో డీకే పెట్టిన పోస్టర్ కు కౌంటర్ ఇస్తూ.. మరోవైపు తన వాదనను వినిపించేలా పోస్టు ఉండటంతో ఈ ఇద్దరు నేతలు సోషల్ మీడియా వేదికగా తమ వాదనను వినిపిస్తూనే.. తాము వేలెత్తి చూపించాలనుకున్న వారిపై వ్యాఖ్యలు చేస్తున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. దీంతో.. వీరిద్దరి మధ్య నడుస్తున్న పవర్ పోరు.. రానున్న రోజుల్లో ఓపెన్ అయ్యేలా ఉండటంతో పాటు.. పార్టీ ప్రతిష్ఠను బజార్లో పడేస్తారని మాత్రం చెప్పక తప్పదు.













