కన్నడ ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 సినిమా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. తొలి రోజు రూ.89 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా.. మూడు రోజుల్లో రూ.200 కోట్లు సాధించి ఓ రేంజ్ లో సందడి చేస్తోంది. వీకెండ్ ముగిసేలోగా రూ.300 కోట్ల క్లబ్ లోకి చేరుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
అయితే బ్లాక్ బస్టర్ హిట్ కాంతారకు ప్రీక్వెల్ గా రూపొందిన కాంతార చాప్టర్ 1 మూవీకి ఇప్పటి వరకు ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో 50,00,000+ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇది ఓ ఇండియన్ మూవీకి దక్కిన అరుదైన ఘనత అనే చెప్పాలి. అదే సమయంలో థియేటర్స్ లో సినిమాను అంతా ఎంజాయ్ చేస్తున్నారు.
అన్ని వర్గాల ఆడియన్స్ ను ఆకట్టుకుని మెప్పిస్తోంది చిత్రం. దీంతో పాజిటివ్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ అవుతోంది. ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పిస్తోంది. దసరా లాంగ్ వీకెండ్ కావడంతో.. బాక్సాఫీస్ వద్ద భారీ నెంబర్స్ ను నమోదు చేస్తోంది. వరల్డ్ వైడ్ గా అదరగొడుతోంది. ఇండియాతోపాటు ఓవర్సీస్ లో ఫస్ట్ షో నుంచి కూడా అద్బుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది.
ఇప్పుడు ఉత్తర అమెరికాలో కాంతార చాప్టర్ 1 మూవీ.. అరుదైన ఘనత సాధించింది. రెండు మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇది ఓ కన్నడ చిత్రానికి ఒక అద్భుతమైన విజయమనే చెప్పాలి. అంచనాలు అందుకుని దూసుకుపోతున్న ఆ సినిమా.. ఇప్పుడు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేకతను సంపాదించింది. టోటల్ గా లెక్క వరల్డ్ వైడ్ 230 కోట్లు దాటినట్లు మెకర్స్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.
కాగా.. సినిమా విషయానికొస్తే హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్, చాలువే గౌడలు కాంతార చాప్టర్ 1ను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మూవీలో రిషబ్ శెట్టి సరసన యంగ్ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించారు. బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలక పాత్ర పోషించారు. జయరామ్ మరో ముఖ్య పాత్రలో యాక్ట్ చేశారు.
వారితో పాటు ప్రమోద్ శెట్టి, రాకేశ్ పూజారి, ప్రకాశ్ తుమినాడ్, దీపక్ రామ్ పనాజీ, హరిప్రసాద్ సహా పలువురు నటీనటులు ఇతర కీలకపాత్రలు పోషించారు. సినిమాకు అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ డైరెక్టర్ గా.. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రాఫర్ గా బాధ్యతలు చేపట్టారు. సురేష్ మల్లయ్య ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన సినిమా విడుదలైంది.