కేజీఎఫ్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన కన్నడ సినిమా కాంతార. కన్నడ సినీ పరిశ్రమను ఓ రేంజ్‌లో తీసుకెళ్లిన ఈ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న కాంతార: చాప్టర్ 1 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మరోసారి భక్తి, గ్రామీణ నేపథ్యంలో ప్రేక్షకులను కొత్త లోకాల్లోకి తీసుకెళ్లబోతోందన్న మాట ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతోంది.
ఇప్పటికే షూటింగ్ సమయంలో ఎదురైన అనేక ఇబ్బందులను అధిగమించి, ఇప్పుడు ప్రమోషన్లలో జోరు పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే చిత్రానికి సంబంధించి పోస్టర్లు, గ్లింప్స్, బిట్స్ విడుదల చేసినప్పటికీ తాజా అప్డేట్ సినిమాపై హైప్ ను మరింత పెంచింది. తాజాగా, సినిమాలో కీలక పాత్ర అయిన కనకవతి లుక్‌ను విడుదల చేశారు.
ఈ పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించనుండగా, కనకవతి పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రేడిషనల్ లో ఘనంగా ఉన్న రుక్మిణి వసంత్ లుక్ సినిమా మూడ్‌ను తెలియజేస్తోంది. ప్రత్యేకంగా తీసిన ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. ఇదే సందర్భంలో, కాంతార చాప్టర్ 1 సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న గ్రాండ్‌గా విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఇందులో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించడమే కాదు, దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. విజయ్ కిరగందూర్ హోంబాలే ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం, గతంలో అందుకున్న ఘనవిజయాన్ని మరింతగా నిలబెట్టుకుంటుందనే నమ్మకం యూనిట్ లో కనిపిస్తోంది. కాంతార మొదటి భాగంలో చూపించిన కథ కంటే మరిన్ని రహస్యాలు, భక్తి విలువలు ఇవన్నీ రెండో భాగంలో మళ్ళీ చూపించబోతున్నట్టు టీమ్ హింట్ ఇచ్చింది. గతంలో జరిగిన కథను ఈ ప్రీక్వెల్ లో చూపించబోతున్నారు. రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ లతో పాటు మరికొందరు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ట్రైలర్ మరియు మిగతా పాటలకు సంబంధించి త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నాయంటూ సమాచారం.