కామారెడ్డి | జాగృతి జనం బాట పర్యటన
కామారెడ్డిలో జాగృతి చైర్‌పర్సన్ కవిత మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ద్వారా కామారెడ్డికి ఇప్పటివరకు ఒక్క ఎకరాకు కూడా నీళ్లు రాలేదని, ప్యాకేజీల ద్వారా ప్రజలకు మేలు కాకుండా కాంట్రాక్టర్లకే లాభం జరిగిందని విమర్శించారు. ప్రాజెక్టులను కొనసాగించే విషయంలో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సి ఉందని అన్నారు.తనను కుటుంబం నుంచి దూరం చేసే కుట్రలో సస్పెన్షన్ జరిగిందని, కానీ “తెలంగాణ అనే మరో కుటుంబం కోసం పనిచేయడం ఆపను” అని కవిత స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో BJP, కాంగ్రెస్ రెండూ ద్రోహి పార్టీలేనని ఆరోపించారు. బీసీలకు చేసిన హామీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత కరెంట్, కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు, బడ్జెట్ అంశాల్లో ప్రజలు మోసపోయారన్నారు.కామారెడ్డి వరద సహాయం, రోడ్లు, బ్రిడ్జిల మరమ్మత్తు, జుక్కల్–నాగమడుగు ప్రాజెక్ట్ పూర్తి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. వరదల్లో ఇళ్లు కోల్పోయిన వేలాది కుటుంబాలకు ఇప్పటికీ ఒక్క రూపాయి సహాయం రాలేదన్నారు.
ఎమ్మెల్యేలు ప్రజల్లో లేకపోవడం, సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం ఉందని విమర్శించిన కవిత, జుక్కల్‌లో యువకులపై పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.గొర్రెల కాపరి సుధాకర్ మరణించిన ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ, జాగృతి తరఫున ₹50,000 సాయం చేసి, పిల్లల చదువు బాధ్యతను తీసుకున్నట్లు తెలిపారు.
“కామారెడ్డికి నీళ్లు, బీసీలకు న్యాయం—ఇవి సాధించే వరకు జాగృతి పోరాటం కొనసాగుతుంది” అని కవిత ప్రకటించారు.












