అదేంటో వైసీపీ విపక్ష రాజకీయం ఏ మాత్రం సజావుగా సాగడం లేదు. సైలెంట్ గా ఉంటూనే ఏదో ఒక ఇష్యూని అడపా దడపా పట్టుకుంటోంది. అయితే అది మధ్యలోనే వదిలేస్తోంది అన్న విమర్శలు ఉన్నాయి. మరో వైపు కూటమి ప్రభుత్వం కూడా వైసీపీకి దాదాపుగా ఇష్యూ లేకుండానే చేయడానికి చూస్తోంది. ఇదే సమయంలో కల్తీ లిక్కర్ ఇష్యూ అంటూ వైసీపీకి ఒక అస్త్రం దొరికింది అని ఫ్యాన్ నేతలు అంతా అనుకున్నారు. దాని మీద ఆందోళనలు చేశారు, ఇంకేముంది కూటమి ప్రభుత్వాన్ని బాగానే కార్నర్ చేశామని అనుకునే లోగానే ఆ అస్త్రం తమకే ఎదురు తిరగడంతో ఫ్యాన్ పార్టీ ఉక్కబోత కి గురి అవుతోంది.
కల్తీ మద్యం కేసులో నిందితుడు జనార్ధనరావు నుంచి వచ్చిన ఒకే ఒక్క వీడియో బైట్ తో వైసీపీ నేతలకు పరేషాన్ అయింది అని అంటున్నారు. అందులో ఏకంగా వైసీపీని మొత్తంగా ఇరికించేశారు. దీంతో కక్కలేక మింగలేక అన్నట్లుగా వైసీపీ పరిస్థితి తయారు అయింది అని అంటున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ దే ప్రముఖ పాత్ర అంటూ నిందితుడు ఇచ్చిన ఈ రకమైన స్టేట్మెంట్ ఇపుడు అన్ని వైపులా చక్కర్లు కొట్టడంతో వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లో పడినట్లు అయింది అంటున్నారు.
ఒక నిందితుడు నుంచి ఈ తరహా వీడియో బైట్ ఎలా వచ్చింది, ఎవరు రికార్డు చేశారు, ఎవరి వదిలారు అన్నది వైసీపీ వైపు నుంచి వస్తున్న ప్రశ్నలు. అంతే కాదు ఇది కావాలని తమ పైన జల్లుతున్న బురద అని వారు అంటున్నారు అదే సమయంలో తాము దేనికైనా రెడీ అని సవాల్ చేస్తున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ అయితే తాను ఈ విషయం మీద ఎక్కడైనా ప్రమాణం చేయడానికి సిద్ధమని కూడా ప్రకటించారు. అయితే మ్యాటర్ ఏంటి అంటే ఇపుడు వైసీపీ వైపు ఈ కీలక ఇష్యూ టర్న్ అయిన వేళ దాని నుంచి బయటపడే మార్గం ఏంటి అన్నదే అని అంటున్నారు. ఎఫెన్సివ్ మోడ్ లో ఈ ఇష్యూని టేకప్ చేసిన వైసీపీ ఇపుడు తానుగా ఇరకాటంలో పడిందా అన్న చర్చ వస్తోంది.
నిందితుడు జనార్ధనరావు అయితే జోగి రమేష్ తనకు అత్యంత సన్నిహితుడు అని చెప్పుకొచ్చారు. అంతే కాదు ఆయన ప్రమేయం నిండా ఉందని అంటున్నారు. ఆయన పురమాయింపుతోనే అంతా చేశాను అని కూడా క్లియర్ గా చెబుతున్నారు. దాంతో ఇపుడు ఎక్సైజ్ శాఖ ఈ కేసు విషయంలో మాజీ మంత్రి జోగి రమేష్ ని విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో జోగి రమేష్ ని ఏ సమయంలో అయినా అదుపులోకి తీసుకుంటారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతోంది.
ఇక తాజాగా కల్తీ మద్యం పట్టుబడడం అందులో జనార్ధన రావు నిందితుడిగా చిక్కడం ఒక ఎత్తు అయితే దీని కంటే ముందే 2021లోనే విజయవాడ కేంద్రంగా ఇబ్రహీంపట్నంలో తాను కల్తీ మద్యం తయారు చేశాను అని స్వయంగా నిందితుడు అంగీకరించడంతో ఈ కేసుకు మరింత బలం చేకూరుతోందని అంటున్నారు. అంతే కాదు జోగి రమేష్ ప్రమేయం మీద జనార్ధన్ రావు బల్ల గుద్ది చెబుతూండడంతో ఆయన వైపుగా ఈ కేసు గట్టిగానే చుట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు.
ఎక్కడో మొదలై ఎక్కడికో కధ సాగి చివరికి ఇలా కంచికి చేరుతుందని వైసీపీ ఊహించిందా అన్నదే ఇపుడు ప్రశ్న. మాజీ మంత్రి జోగి రమేష్ ని ఈ కేసులో అన్యాయంగా ఇరికిస్తున్నారు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో తమ ప్రమేయం ఏమీ లేదని రమేష్ అంటున్నారు. కానీ ములకల చెరువు కల్తీ మద్యం మొత్తం కూపీ తీసే పనిలో ఎక్సైజ్ శాఖ పోలీసులు ఉన్నారని చెబుతున్నారు. నిందితుడు తన ఫోన్ పోయింది అని అంటున్నా దానిని సైతం రప్పించే పనిలో అధికారులు ఉన్నారంటే మ్యాటర్ వెరీ సీరియస్ అని అంటున్నారు ఇది అల్లిన కధ వైసీపీని ఇరికించే కుట్ర అని వైసీపీ అంటున్నా ఆ దిశగా తన వంతుగా ప్రయత్నాలు చేసి నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడమే ఇపుడు అతి పెద్ద సవాల్ గా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.