కాలక్రమంలో ఎన్నో జంతు, పక్షి జాతులు అతరించిపోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడు కనిపించే పిచ్చుకలు సైతం ఇప్పుడు గ్రామాల్లోనూ కనిపించని పరిస్థితి. పెరిగిపోతున్న రేడియేషన్ తో పాటు మనిషి చేస్తున్న ఎన్నో పనులు ఇవి అంతరించిపోవడానికి కారణాలుగా ఉన్నాయి. ఈ క్రమంలో ఓ అరుదైన పక్షి కోసం ప్రభుత్వాలు రూ.50 కోట్లు ఖర్చు చేశాయి.
అవును… 1848లో పెన్నా నదీ పరివాహక ప్రాంతంలో కనిపించిన అత్యంత అరుదైన పక్షిల్లో ఒకటైన కలివికోడి అంతరించిపోతున్న పరిస్థితి. అప్పుడు కనిపించిన ఆ కోడి మళ్లీ 1985 జనవరి 5న కనిపించింది. దీన్ని ఓ వ్యక్తి పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు. అనంతరం ఈ పక్షి జాతి అంతరించిపోయినట్లు నిపుణులు చెబుతూ వచ్చారు.
ఈ నేపథ్యంలో 1998 నుంచి 2002 వరకు తిరుపతి ఎస్వీయూ పరిశోధకుల బృందం అన్వేషణ సాగించింది. ఈ క్రమంలో వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు ప్రాంతంలోని లంకమలలో 2002లో ముంబయి నేచురల్ హిస్టరీ సొసైటీ ఈ పక్షి పాదముద్ర, కూతను రికార్డు చేసింది. అదే జిల్లాలోని కొండూరు సమీపంలోని చిట్టడవుల్లో వీటి జాడ కనిపించింది.
దీంతో ప్రభుత్వం మూడు వేల ఎకరాల్లో శ్రీలంకమల్లేశ్వర అభయారణ్యాన్ని ఏర్పాటుచేసింది. ఇక్కడ వీటి ఉనికిని గుర్తించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.50 కోట్ల వరకు వెచ్చించాయి. ఇక.. గత జులై, ఆగస్టు నెలల్లో ఈ అభయారణ్యంలో పరిశోధక బృందం సభ్యులు వారాల తరబడి పరిశోధనలు సాగించి ఈ పక్షిని గుర్తించడంతోపాటు వాటి కూతను రికార్డు చేశారు.
ఈ పక్షి మిగిలిన వాటిలా గాల్లో ఎగరలేదు. అందువల్ల ఎత్తైన పొదల్లో నివాసం ఉంటుంది. గులక రాళ్లను సేకరించి వాటి మధ్య గుడ్లు పెడుతుంది. వీటికి ఉన్న మరో ప్రత్యేకత… ఇవి పగటిపూట నిద్రపోయి, రాత్రి పూట ఆహారం సేకరించుకుంటాయి. ఈ పక్షి కూత సుమారు 200 మీటర్ల వరకూ వినిపిస్తుంది.