ఆయన అలాంటి ఇలాంటి అధికారి కాదు. ఇరిగేషన్ శాఖలో అత్యున్నత స్థానంలో పని చేసిన పెద్దమనిషి. గత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకంగా వ్యవహరించిన సీనియర్ అధికారి. ఆయనే.. రిటైర్డు ఇంజనీర్ ఇన్ చీఫ్ సి. మురళీధర్ రావు. ఆదాయానికి మించిన ఆస్తుల కొండను పోగేసినట్లుగా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వెలుగు చూసిన ఆస్తులు కళ్లు చెదిరేలా ఉన్నాయి.
హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన మోకిలలో 6500 చదరపుగజాల స్థలం (అంటే దగ్గర దగ్గర ఒకటిన్నర ఎకరం).. హైదరాబాద్ శివారులో 11 ఎకరాల పొలం.. హైదరాబాద్ మహా నగరంతో సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలు.. అపార్టుమెంట్లు.. ఫైవ్ స్టార్ లగ్జరీ విల్లాలు.. సెలబ్రిటీ ప్రాజెక్టుల్లో కోట్లాది రూపాయిల విలువైన ఫ్లాట్లు.. ఇవి సరిపోవన్నట్లుగా ఒక సోలార్ పవర్ ప్రాజెక్టు మొదలుకొని మరెన్నో ఆస్తులు మురళీధర్ రావు వద్ద ఉన్నట్లుగా అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
భూములు.. నివాసాలు కాకుండా బంగారం.. బ్యాంకు ఖాతాలు.. ఫిక్సెడ్ డిపాజిట్లు.. లాంటి ఆస్తుల వివరాల లెక్క ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటివరకు వెలుగు చూసిన ఆస్తుల లెక్క దగ్గర దగ్గర రూ.500 కోట్లు ఉన్నట్లుగా తేల్చారు. మిగిలిన ఆస్తుల్ని కలిపితే ఈ అంకె మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈఎన్సీ జనరల్ గా రిటైర్ అయిన ఆయన.. తన పదవీ కాలాన్ని పెంచుకుంటూ కేసీఆర్ ప్రభుత్వం ఉన్న పదేళ్లు తన పదవిలో కంటిన్యూ అయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన ఆయన.. రేవంత్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం అదే పదవిలో ఉన్నారు. రిటైర్ అయిన తర్వాత మొత్తంగా 13 ఏళ్లు నీటిపారుదల శాఖలో కంటిన్యూ కావటం గమనార్హం.
హైదరాబాద్ లోని పలు ప్రాంతాలతో సహా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మురళీధర్ రావు బంధువులు.. స్నేహితులు.. సన్నిహితుల ఇళ్లల్లోనూ సోదాలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా వెలుగు చూసిన ఆస్తుల చిట్టా చూస్తే.. – మోకిలలో 6500 చదరపు గజాల స్థలం – కొండాపూర్ లో ఒక విల్లా – బంజారాహిల్స్.. యూసఫ్ గూడ.. కోకాపేట.. బేగంపేటల్లో నాలుగు ఫ్లాట్లు – హైదరాబాద్ లోని నాలుగు ఖరీదైన ప్రాంతాల్లో 4ఇళ్ల స్థలాలు
- హైదరాబాద్.. కరీంనగర్ లలో 2 కమర్షియల్ కాంప్లెక్సులు – కోదాడలో అపార్ట్ మెంట్ – వరంగల్ లో నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్ – హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 11 ఎకరాల భూమి – జహీరాబాద్ లో 2కేవీ సోలార్ పవర్ ప్రాజెక్టు – ఒక బెంజ్ కారు – మరో రెండు ఖరీదైన కార్లు ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమంటే..ఇటీవల కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారుల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు.. వందల కోట్లకు పైనే ఆస్తుల లెక్క తేలటం.. ఇవన్నీ ఆదాయపన్ను చట్టాలకు అతిక్రమించి కూడబెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. మురళీధర్ రావుకు చెందిన బంగారం.. బ్యాంకు డిపాజిట్లు.. బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. మొత్తంగా మురళీధర్ రావు ఆస్తుల చిట్టా అవాక్కు అయ్యేలా చేస్తుందని చెప్పక తప్పదు..!