రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న కాలేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ నివేదికలో పేర్కొన్న అంశాలు అప్పటి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఏకపక్ష నిర్ణయాల వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన తీవ్రమైన లోపాలను స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. ఈ నివేదిక ఆధారంగా ప్రాజెక్టులోని అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని అసెంబ్లీ తీర్మానించింది.
కమిషన్ నివేదిక ప్రకారం.. మేడిగడ్డ బ్యారేజీతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సొంత నిర్ణయాలతోనే జరిగిందని స్పష్టమైంది. సాంకేతిక నిపుణుల సిఫార్సులు, మంత్రివర్గ ఉపసంఘం సూచనలు, హై పవర్ కమిటీ అభిప్రాయాలు ఏవీ తీసుకోకుండానే ఈ బ్యారేజీల స్థానాలను మార్చారు. నిపుణుల కమిటీ వేమనపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మించాలని సూచించినప్పటికీ, ఆ సలహాను పట్టించుకోకుండా మేడిగడ్డ వద్ద నిర్మాణాన్ని చేపట్టారు.
నివేదికలో పరిపాలనాపరమైన.. ఆర్థిక ఉల్లంఘనలు తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు. పరిపాలనాపరమైన అనుమతులు (2016 మార్చి 1) మహారాష్ట్రతో ఒప్పందం (2016 మార్చి 8) కుదరక ముందే, ఇంకా చివరి డిపిఆర్ (2016 మార్చి 27) కూడా సమర్పించక ముందే ఇవ్వబడ్డాయి. ఇది నిబంధనలకు విరుద్ధమైన చర్య అని కమిషన్ తేల్చింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ. 38,500 కోట్ల నుంచి రూ. 1.10 లక్షల కోట్లకు పెరిగిందని, అయితే ఈ అంచనా పెంపునకు సరైన ఆధారాలు లేవని కమిషన్ తెలిపింది. డిపిఆర్ సిద్ధం కాకముందే భారీగా నిధులు ఖర్చు చేయడం ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడాన్ని సూచిస్తుంది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన సంఘటనతో ప్రాజెక్టులోని నాణ్యత లోపాలు బహిర్గతమయ్యాయి. ఈ ఘటన తర్వాత అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో కూడా లోపాలు బయటపడ్డాయి. ఈ లోపాలు, నాసిరకం నిర్మాణ పనులు, నాణ్యత నియంత్రణలో వైఫల్యాలు ప్రాజెక్టు భారీ నష్టానికి కారణమయ్యాయి. ప్రాజెక్టు నిర్వహణలో లోపాలున్నాయని కూడా నివేదికలో పేర్కొన్నారు.
నివేదికలో కెసిఆర్ పేరు 266 సార్లు, హరీష్ రావు పేరు 63 సార్లు ప్రస్తావించబడడం ఈ ప్రాజెక్టులో వారి ప్రత్యక్ష ప్రమేయాన్ని సూచిస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. రాజకీయ జోక్యం.. పరిపాలనా నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు దెబ్బతిన్నట్లు కమిషన్ స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగా దోషులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చింది. శాసనసభలో చర్చల అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామి కావడం.. లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం కావడం వంటి కారణాల వల్ల కేసును సీబీఐకి అప్పగించడం సరైనదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్యతో ప్రాజెక్టులోని అక్రమాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.