`జూనియర్` మూవీ రివ్యూ
ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్థన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అవుతూ నటించిన మూవీ `జూనియర్`. యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో నిన్నటి స్టార్ హీరోయిన్ జెనీలియా ముఖ్య పాత్రలో నటించింది.రవిచంద్రన్, రావు రమేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై రజని కొర్రపాటి నిర్మించారు. చాలా రోజులుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు ఆడియెన్స్ ముందుకు వచ్చింది.
శుక్రవారం(జులై 18)న విడుదలైంది. మరి గాలి జనార్థన్ రెడ్డి కొడుకు తొలి చిత్రంతోనే హిట్ కొట్టాడా? జెనీలియా కమ్ బ్యాక్ ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
`జూనియర్` మూవీ కథః
కోదండపాణి(రవీచంద్రన్) భార్య శ్యామల లేట్ వయసులో గర్భవతి అవుతుంది. దీంతో ఊర్లో అంతా ఎగతాళి చేస్తుంటారు. సూటిపోటి మాటలతో అవమానిస్తుంటారు. ఆ అవమానం తట్టుకోలేక వాళ్లు తమ విజయనగరం ఊరుని వదిలేసి దూరంగా వెళ్లిపోతారు.బస్సులో వెళ్తున్న క్రమంలోనే కోదండపాణి భార్య డెలివరీ అవుతుంది. కొడుకు అభిరామ్(కిరీటి)కి జన్మనిచ్చి శ్యామల కన్నుమూస్తుంది. దీంతో కొడుకుని ఎంతో గారాభంగా పెంచుతాడు కోదండపాణి.కాకపోతే తండ్రి కొడుకుల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ. తాత వయసుగా కనిపించే కోదండపాణి అభి తండ్రి అంటే అది చూసేవారికి, అభికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. పైగా పాత కాలపు ఆలోచనలతో కొడుకుని పెంచుతాడు కోదండపాణి. ఇది అభికి నచ్చదు.పై చదువుల కోసం ఆయనకు దూరంగా వెళ్లిపోతాడు. అందుకు ముగ్గురు స్నేహితులను(శ్రీహర్షతోపాటు మరో ఇద్దరు) ఎంచుకుంటాడు. చిన్నప్పట్నుంచి తమ నాన్న వల్ల ఆ చిన్ననాటి తీపిగుర్తులను పొందలేకపోయానని బాధపడుతుంటాడు అభి.
అందుకే తన స్నేహితులతో కలిసి కిక్ కోసం, థ్రిల్ కోసం తాను చేయాల్సిన కొంటెపనులన్నీ చేస్తాడు. కాలేజీలోనూ గొడవలు పెట్టుకుంటాడు. ఈ క్రమంలో బస్‌లో స్ఫూర్తిని చూసి తొలి చూపులోనే ఇష్టపడతాడు. ఆమె వెంటపడుతుంటాడు.ఆమె కెరీర్, గోల్ అంటూ బిల్డప్ కొడుతుంది. అభిని పట్టించుకోదు, కానీ ఎప్పుడూ అల్లరి చేసే అభి తనకంటే ఎక్కువ మార్కులు సాధించడంతో ఆయనకు కనెక్ట్ అవుతుంది. ఆమె జాబ్ చేసే కంపెనీలోనే ఉద్యోగం తెచ్చుకుంటాడు అభి. అక్కడ ఛైర్మెన్(రావు రమేష్)ని ఇంప్రెస్ చేస్తాడు.కానీ ఆ ఛైర్మెన్ కూతురు విజయ సౌజన్య(జెనీలియా)ని ఫస్ట్ డేనే చిరాకు పెడతాడు. దీంతో అతనిపై పగబడుతుంది విజయ. కొన్ని రోజుల్లోనే ఛైర్మెన్ రిటైర్‌మెంట్. దీంతో తన స్థానంలో తన కూతురు విజయని ఛైర్మెన్‌గా ప్రకటిస్తాడు.
ఆ ప్రకటన రోజు ఆమె పరువు తీస్తాడు అభి. ఆ సమయంలో ఛైర్మెన్ అభి నాన్నని చూస్తాడు. దీంతో షాక్ అవుతాడు. అభి ఎవరో తెలుస్తుంది. దీంతో కథ మొత్తం రివర్స్ అవుతుంది.మరి అభి నాన్నని చూసి ఆయన ఎందుకు షాక్ అయ్యారు? వారికి ఆ ఛైర్మన్ కి ఉన్న సంబంధం ఏంటి? ఇంతకి విజయ ఎవరు? ఆమెకి అభికి ఉన్న రిలేషన్ ఏంటి? విజయ విజయనగరం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అక్కడ ఏం జరిగిందనేది మిగిలిన కథ.
మూవీ విశ్లేషణః
`జూనియర్` మూవీ రెగ్యూలర్ కమర్షియల్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందించిన మంచి ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా చెప్పొచ్చు. సాధారణంగా పెద్ద ఫ్యామిలీ నుంచి పరిచయం అయ్యే హీరోల సినిమాలు రెగ్యూలర్ కమర్షియల్‌గా ఉంటాయి.నాలుగైదు ఫైట్లు, నాలుగైదు పాటలు, ఫ్యామిలీ, ప్రతీకారం, విలన్‌తో గొడవలు, దాన్ని ముగింపు, చిన్న లవ్ ట్రాక్ ఇలా ఫక్తు కమర్షియల్ అంశాలను మేళవించి రూపొందిస్తుంటారు. ఒకప్పుడు అవి అంతో ఇంతో వర్కౌట్ అయ్యేవి. కానీ ఇప్పుడు కష్టమనే చెప్పొచ్చు.కంటెంట్ ఉన్న చిత్రాలనే జనం ఆదరిస్తున్నారు. అందులో స్టార్స్ ఎవరనేది చూడటం లేదు. `జూనియర్` సినిమా విషయంలోనూ కమర్షియాలిటీకే ప్రయారిటీ ఇచ్చారు. కానీ బలమైన ఎమోషన్స్ ని, సెంటిమెంట్లని రాసుకోవడం విశేషం.
అదే ఈ సినిమాకి పెద్ద అసెట్. రొటీన్ కమర్షియల్ మూవీగా నడిచినా, తండ్రీ కొడుకుల ఎమోషన్స్ ని, ఆ బాండింగ్ ని, అదే సమయంలో అక్కా తమ్ముడి సెంటిమెంట్, ముఖ్యంగా తండ్రీ కూతురు సెంటిమెంట్‌ని చాలా ఎమోషనల్‌గా డిజైన్ చేశారు.ఈ సినిమాకి ప్రధాన బలం అదే అని చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి రొటీన్‌గానే సాగుతుంది. కాకపోతే తండ్రి కొడుకుల మధ్య ఏజ్ గ్యాప్ ఫ్యాక్టర్‌ని హైలైట్ చేయడం ఇందులో స్పెషాలిటీ. ఈ యాంగిల్‌లో ఇప్పటి వరకు సినిమా రాలేదని చెప్పొచ్చు. అది కాస్త కొత్తగా ఉంటుంది.
మూవీలోని హైలైట్స్, మైనస్‌లు
హీరో చిన్నప్పుడు తాను మిస్ అయిన మెమొరీస్‌ని ఇప్పుడు పొందాలనుకోవడం, అందుకోసం ముగ్గురు స్నేహితులను హైర్ చేసుకోవడం కొత్తగా ఉన్నా, ఆ తర్వాత లవ్ ట్రాక్, హీరోయిన్ వెంటపడటం, కాలేజీ ఎపిసోడ్లు చాలా రొటీన్‌గానే ఉంటాయి. అక్కడ పెద్దగా కొత్తదనం లేదు.ఎప్పుడైతే కథ కార్పొరేట్ ఆఫీస్‌కి వెళ్తుందో, జెనీలియా పాత్ర ఎంటరవుతుందో అప్పట్నుంచి ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్ ముందు జెనీలియా ఎవరు? అభికి ఉన్న రిలేషన్ ఏంటి? అనేది తెలిసిన తర్వాత మరింత ఆసక్తికరంగా సాగుతుంది.కథలోని ట్విస్ట్ సినిమాపై ఇంట్రెస్ట్ ని పెంచుతుంది. ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. అభి ఫ్యామిలీ, జెనీలియా గతానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయిన తీరు బాగుంది. ఆ ఎపిసోడ్ ఆకట్టుకునేలా ఉంది.
కాకపోతే ఆమె పాత్ర విజయనగరం కి వెళ్లిన తర్వాత కథ మరింత రొటీన్‌గా మారుతుంది. మహేష్ బాబు `శ్రీమంతుడు`, `మహర్షి` చిత్రాలను తలపిస్తుంది. క్లైమాక్స్ వరకు అలానే సాగుతుంది. డిజిటల్ ఇండియా ప్రమోషన్స్ లాగా ఉంటుంది.ఇక క్లైమాక్స్ ఎమోషనల్‌గా మార్చడం విశేషం. ఆ ఎమోషన్స్ అంతే బాగా పండాయి. కిరీటి, జెనీలియా, రవిచంద్రన్ పాత్రల కలయిక ఆద్యంతం భావోద్వేగంగా ఉంటుంది. సినిమా ముగింపు విషయంలో క్లారిటీ మిస్ అయ్యింది. ఒక సస్పెన్స్ తో వదిలేసినట్టుగా ఉంటుంది.
రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్లు మైనస్‌గా చెప్పొచ్చు. అలాగే కామెడీ ట్రాక్ కూడా ఇంకా బాగా రాసుకోవాల్సింది. శ్రీలీల పాత్రని పాటలు, కాసేపు లవ్ ట్రాక్‌కే పరిమితం చేయడం గమనార్హం. ఏ సినిమాకైనా ఒక ఎమోషనల్ థ్రెడ్ ముఖ్యం. అది ఇందులో కొంత మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.అదే సమయంలో `జూనియర్` టైటిల్‌కి జస్టిఫికేషన్ మిస్ అయ్యింది. కనీసం ఒక్క చోట కూడా ఆ ప్రస్తావన రాకపోవడం గమనార్హం. ఓవరాల్‌గా చూస్తే కథ రొటీన్‌గానే సాగినా సెంటిమెంట్, ఎమోషన్స్ ఈ మూవీకి ఆయువు పట్టుగా నిలుస్తుందని చెప్పొచ్చు.
మూవీలోని ఆర్టిస్ట్ ల పర్‌ఫెర్మెన్స్
అభిరామ్ పాత్రలో కిరీటి బాగా నటించాడు. తొలిచిత్రమైనా చాలా కష్టపడ్డాడు. డాన్సులు ఇరగదీశాడు. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ని తలపించేలా ఆయన డాన్సులుండటం విశేషం. యాక్షన్ సీన్లలోనూ అదరగొట్టాడు.తొలి చిత్రమైనా అనుభవం ఉన్న నటుడిగా కనిపించాడు. ఎమోషన్స్ సీన్లలోనూ ఆకట్టుకున్నాడు. ఎక్స్ ప్రెషన్స్ పరంగా ఇంకా బెటర్ కావాల్సింది. సినిమా కోసం తాను పడ్డ కష్టం ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. ఎక్కడా కొత్త అనే ఫీలింగ్ రాకుండా మెప్పించడం విశేషం.విజయ సౌజన్య పాత్రలో జెనీలియా చాలా హుందాగా కనిపించి ఆకట్టుకుంది. గతంలో ఆమెని అల్లరి పిల్లగా చూశాం, కానీ ఇందులో కంపెనీ హెడ్‌గా, హుందాగా వ్యవహరించిన తీరు, ఆ తర్వాత తన గతం గుర్తు చేసుకుని ఆమెలో వచ్చిన మార్పు వంటి సీన్లలో జెనీలియా నటన ఆకట్టుకుంది.
కోదండపాణి పాత్రలో రవి చంద్రన్ చాలా బాగా నటించాడు. పాత్రలో ఒదిగిపోయాడు. కిరీటి, రవిచంద్రన్ మధ్య సీన్లు ఎమోషనల్ గా ఆకట్టుకుంటాయి.మరోవైపు కంపెనీ చైర్మెన్‌గా రావు రమేష్ తనకు నప్పిన పాత్రలో మెప్పించారు. హీరో ఫ్రెండ్స్ వైవా హర్ష ఆయన బ్యాచ్, సత్య నవ్వులు పూయించారు. అచ్చుత్ కుమార్ కాసేపు తన విలనిజం చూపించారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.
మూవీ టెక్నీషియన్ల పనితీరు
సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ విజువల్స్ కళ్లకు విందుగా, గ్రాండ్‌గా ఉన్నాయి. విజువల్స్ సినిమాకి అసెట్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఫర్వాలేదు. కాకపోతే తన పాత సినిమా పాటలే ఎక్కువగా గుర్తొస్తాయి.బీజీఎం సైతం రొటీన్‌గానే ఉంది. ఎమోషనల్ సీన్లలో ఆర్‌ఆర్ ఆకట్టుకుంది. ప్రొడక్షన్ డిజైన్‌కి రవీందర్ తన మార్క్ ని చూపించారు. సినిమా రిచ్ లుక్‌లో ఆయన పాత్ర ఎంతో ఉంది. నిరంజన్ దేవరమనే ఎడిటింగ్ ఇంకా బాగా చేయాల్సింది. కొన్ని చోట్ల సీన్లు మిస్ మ్యాచ్ అనిపిస్తాయి.కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ బాగున్నాయి. దర్శకుడు రామకృష్ణ ఎంచుకున్న కథ రొటీన్‌గానే ఉన్నా, ఎమోషన్స్ ని, సెంటిమెంట్‌ని బాగా పండించారు. చిన్న చిన్న ట్రిక్స్ ప్లే చేసి కొత్తగా మార్చే ప్రయత్నం చేశాడు. కాకపోతే సినిమా మొత్తం ఆ కొత్తదనం ప్రయత్నించి ఉంటే బాగుండేది.
రేటింగ్‌ః 3/5