జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ చాలా గట్టి ఫైట్ చేస్తోంది. మరీ ముఖ్యంగా అధికార పార్టీగా ఉన్నందున, ఈ సీటును గెలవడం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. అందుకే మంత్రులు, కీలక నాయకులు అందరూ రంగంలోకి దిగారు. మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ ఇప్పటికే బస్తీల్లో, కాలనీల్లో ప్రజలను కలుస్తూ ప్రచారం మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కూడా రహమత్ నగర్, బోరబండ వంటి ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తూ పార్టీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుకూలతను బట్టి చూస్తే, కొన్ని పాయింట్లు పార్టీకి ప్లస్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉచిత బస్సు సౌకర్యం మహిళల్లో మంచి స్పందన తెచ్చింది. రేవంత్ రెడ్డి బలమైన నేతగా, యువతకు చేరువైన ముఖ్యమంత్రిగా ప్రజల్లో ఇమేజ్ సంపాదించారు. ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఉద్యోగాల భర్తీ వంటి అంశాలను కూడా కాంగ్రెస్ నేతలు ప్రచారంలో వినియోగిస్తున్నారు. అయితే జూబ్లీహిల్స్ వంటి పట్టణ ప్రాంతాల్లో ఈ పథకాలు పెద్దగా ప్రభావం చూపడం లేదనే అభిప్రాయం కూడా ఉంది.
దీంతో పాటు కాంగ్రెస్‌కు కొన్ని స్పష్టమైన మైనస్ పాయింట్లు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది పేదల ఇళ్ల కూల్చివేత. ఈ అంశాన్ని బీఆర్ఎస్ బలంగా ఎత్తి చూపుతూ “హైడ్రా ప్రభుత్వం” అంటూ ప్రజల్లో నెగెటివ్ ఇమేజ్ క్రియేట్ చేసింది. అదే విధంగా, కాంగ్రెస్ మంత్రుల మధ్య ఉన్న విభేదాలు, అవినీతి ఆరోపణలు కూడా ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేకుండా పనులు జరగడం లేదన్న చర్చ ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. మాగంటి గోపీనాథ్ మరణానంతరం ఉపఎన్నికకు కాంగ్రెస్ పోటీ పెట్టడం కూడా బీఆర్ఎస్ కొన్ని వర్గాల్లోకి తీసుకు వెళుతూ సెంటిమెంట్‌ను పండిస్తోంది. బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ భార్య స్వయంగా రంగంలో ఉండడంతో సానుభూతి, మహిళా సెంటిమెంట్ బాగా వర్కవుట్ అవుతోంది.
ఇక మరొక కీలక అంశం ఏంటంటే మైనారిటీల అసంతృప్తి. మైనారిటీలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యం దక్కలేదని, ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అసంతృప్తిని తేలికగా తీసుకుంటే, అది ఓటు బ్యాంక్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్‌లో గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తోందని చెప్పాలి. కానీ, బీఆర్ఎస్ దూకుడు ప్రచారం, ప్రజల్లో ఉన్న కొంత అసంతృప్తి, అంతర్గత విభేదాలు అన్నీ కలిసి కాంగ్రెస్‌ను కాస్త కఠిన పరిస్థితుల్లోకి నెడుతున్నాయి. ఈ మైనస్‌లను అధిగమించి జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందా ? అన్నది చూడాలి..
గ్రేటర్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది. ఈసారి బీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ పోరులోకి దిగింది. ఇతర పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్, ప్రచారాన్ని హోరెత్తిస్తూ రంగంలో దూసుకుపోతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఇప్పటికే బస్తీ బస్తీకి తిరుగుతూ విస్తృతమైన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఇంకా పలువురు ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు వెళ్లి ఓట్ల కోసం గళం విప్పుతున్నారు.
ఇప్పటికే కేటీఆర్ నిర్వహించిన రెండు మూడు సభలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఆయన డోర్ టు డోర్ క్యాంపెయిన్ పై మరింత దృష్టి సారించారు. ప్రతి ఓటరుకు వ్యక్తిగతంగా చేరుకోవడం ద్వారా బీఆర్ఎస్‌కు మళ్లీ ప్రజల్లో నమ్మకం కల్పించాలనే లక్ష్యంతో కేటీఆర్, ఆయన బృందం కసరత్తులు చేస్తున్నాయి. అదేవిధంగా, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు ప్రజల్లో బలంగా చర్చకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఈసారి ప్రచారంలో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నారన్న వార్త గులాబీ శిబిరానికి కొత్త ఊపునిస్తోంది. ఈ ఎన్నిక పార్టీ భవిష్యత్తుకు కీలకమని, గెలుపు తప్ప ఇంకే ఆప్షన్ లేనట్టే అని భావిస్తోంది బీఆర్ఎస్ నాయకత్వం. కేసీఆర్ బరిలోకి దిగితే కేడర్ మళ్లీ ఉత్సాహం పొందుతుందని లెక్కలు వేసుకుంటున్నారు.
తాజా సమాచారం ప్రకారం, కేసీఆర్ పాల్గొనేలా ఇప్పటికే ప్రచార షెడ్యూల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ నెల 19న జూబ్లీహిల్స్‌లో భారీ రోడ్ షో ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఆ రోజునే ఆయన రెండు సభల్లోనూ పాల్గొనే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చివరి రోజు వరకు కూడా ప్రచార వేడి కొనసాగించేలా, లాస్ట్ మూడు రోజుల్లో ఒకవైపు కేటీఆర్, హరీశ్‌రావు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయగా, మరోవైపు కేసీఆర్ సబా సర్క్యూట్ ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ బైఎలక్షన్ ఫలితం పార్టీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నింటికి మించి ఇక్కడ క్యాండెట్‌ను ఖరారు చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రచారం వరకు కేటీఆరే కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ గెలిస్తే భవిష్యత్తు గులాబీ రాజకీయాల్లో కేటీఆర్ తిరుగులేని కింగ్ అవుతాడు అనడంలో సందేహం లేదు.