జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, ఎమ్మెల్సీ విజయశాంతి ప్రతిపక్ష పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ (టిడిపి)తో పాటు భారతరాష్ట్ర సమితి (బిఆర్ఎస్), భారతీయ జనతా పార్టీ (బిజెపి)లు కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకునేందుకు “అవినీతిపరమైన రాజకీయ ఒప్పందాలు” చేసుకున్నాయని ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్‌లో గెలుపు ఖాయమని గ్రహించడంతోనే బిఆర్ఎస్, బిజెపిలు రహస్యంగా చేతులు కలిపాయని విజయశాంతి ఆరోపించారు. ఈ కుట్రలో టిడిపి కూడా పరోక్షంగా భాగమైందని ఆమె వెల్లడించారు. బిజెపితో పొత్తులో ఉన్న టిడిపి, ఉపఎన్నిక నుంచి తప్పుకోవడం మిత్ర ధర్మమని పైకి చెబుతున్నా, వాస్తవానికి తన కార్యకర్తలను బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయమని గోప్యంగా ఆదేశించిందని ఆమె ఆరోపించారు. “ఇది కూటమి నైతిక విలువలకు విరుద్ధమైన చర్య. కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకునే కుట్ర,” అని విజయశాంతి ఘాటుగా విమర్శించారు
బిజెపి కూడా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో “డమ్మీ అభ్యర్థిని” బరిలోకి దింపిందని విజయశాంతి పేర్కొన్నారు. ఓట్ల విభజన ద్వారా తమ రహస్య మిత్రపక్షమైన బిఆర్ఎస్‌కు లాభం చేకూర్చడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ ఎదుగుదలను అడ్డుకునేందుకు బిఆర్ఎస్-బిజెపి-టిడిపి మధ్య జరుగుతున్న ఈ రాజకీయ నాటకాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు తెలుసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
అయితే, విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలు, ముఖ్యంగా ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే, ప్రతిపక్షాల నేతలు, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. “ఇదెక్కడి లాజిక్ రాములమ్మ,” అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి బాగుంటే, ఎవరు పొత్తు పెట్టుకున్నా భయమెందుకని ప్రశ్నిస్తున్నారు. తమ పార్టీ పనితీరుపై నమ్మకం లేకనే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆరోపణలు చేయిస్తోందనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని మీకు ఎవరు చెప్పారంటూ మరికొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
విమర్శలు ఎలా ఉన్నా, కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఈ కుట్రను ప్రజల్లోకి తీసుకువెళ్లి, నిజాలను వెలుగులోకి తీసుకురావాలని, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ విజయానికి అహర్నిశలు కృషి చేయాలని విజయశాంతి పిలుపునిచ్చారు. సిట్టింగ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నిక రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక పెద్ద పరీక్షగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతి ఆరోపణలు ఎన్నికల రాజకీయ ఉద్రిక్తతను మరింత పెంచాయి.
జూబ్లీహిల్స్ ఊప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని తేలడంతో బిఆర్ఎస్ పార్టీ అనైతిక అవగాహన కుదుర్చుకునేందుకు కుట్రలు చేస్తున్నట్లువార్తలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజెపి పోటీ చేస్తున్న కారణంగా కమలం పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ మిత్ర ధర్మం కోసం ఈ… pic.twitter.com/lZmuxZIK7X
— VIJAYASHANTHI (@vijayashanthi_m) October 6, 2025