తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే, దివంగత పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ వేశారు. ఇప్పటికే సిటింగ్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు బీఫామ్ కూడా ఇచ్చారు. కానీ, ఇంతలో విష్ణు కూడా నామినేషన్ వేయడం గమనార్హం. వాస్తవానికి ఉప ఎన్నికలో బీఆర్ఎస్ టికెట్ కోసం విష్ణు తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ, పార్టీ నిర్ణయానికే ఓటేశారు. సునీత అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు. అయితే, శనివారం ఆయన అనూహ్యంగా నామినేషన్ వేసేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇప్పటికే నామినేషన్ల సంఖ్య వంద దాటింది. శనివారం నాటికి ఈ సంఖ్య ఇంకా పెరిగింది. వీరిలో విష్ణు కూడా ఒకరు. ప్రతిష్ఠాత్మకంగా సాగుతున్న ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున మరి ఆయన ఎందుకు బరిలో దిగుతున్నారు? అనేది చర్చనీయంగా మారింది. వాస్తవానికి గొప్ప నాయకుడైన పీజేఆర్ ప్రాతినిధ్యం వహించిన ఉమ్మడి ఖైరతాబాద్ లో భాగమైన జూబ్లీహిల్స్ 2009లో కొత్తగా ఏర్పడింది. తొలి ఎన్నికలోకాంగ్రెస్ అభ్యర్థిగా విష్ణునే గెలిచారు. కానీ, 2014, 2018లో ఓటమి పాలయ్యారు. దీంతో 2023లో విష్ణు బదులు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్‌కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. నిరాశ చెందిన విష్ణు అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ లో చేరారు. మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అవకాశం వస్తుందని తొలుత భావించినా చివరకు టికెట్ గోపీనాథ్ సతీమణికే వెళ్లింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవంబరు 11న పోలింగ్ జరగనుంది. 14 ఫలితాలు వెల్లడవుతాయి. ఈ నెల (అక్టోబరు) 21 మంగళవారం వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. 22న స్క్రూటినీ జరుగుతుంది. 24న నామినేషన్ల ఉప సంహరణకు చివరి అవకాశం. అయితే, ముందుజాగ్రత్తగానే విష్ణుతో బీఆర్ఎస్ నామినేషన్ వేయించింది అని తెలుస్తోంది. దుబ్బాకలో 2020లో జరిగిన ఉప ఎన్నికలో అప్పటి సిటింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అకాల మరణంతో ఆయన సతీమణిని ఉప ఎన్నికలో దింపారు. అధికార పార్టీగా ఉన్నప్పటికీ.. ఆమె గెలవలేదు.
బీఆర్ఎస్ నుంచి సునీత మూడు సెట్ల నామినేషన్లు వేశారు. పూర్తిగా రాజకీయాలకు కొత్త అయినప్పటికీ చొరవగా వెళ్తూ ప్రచారం చేస్తున్నారు. ముందుగానే అభ్యర్థిత్వం ఖాయం కావడం ఆమెకు కలిసివచ్చింది. అయితే, అనుకోని విధంగా సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే ఎందుకొచ్చిన ఇబ్బంది అని భావించిన బీఆర్ఎస్ అధిష్ఠానం ముందుజాగ్రత్త చర్యగా విష్ణుతోనూ నామినేషన్ వేయించినట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.