జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకస్మిక మరణంతో జరగనున్న ఉప ఎన్నిక కోసం అధికార కాంగ్రెస్ నలుగురు ఆశావాహులను షార్ట్ లిస్టు చేసి అధిష్ఠానానికి పంపింది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణిని ఎంపిక చేయటం తెలిసిందే. ఇదిలా ఉంటే కాంగ్రెస్ నుంచి ఆశావాహుల జాబితా భారీగా మారింది. ఇలాంటి వేళలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నలుగురు పేర్లను షార్ట్ లిస్టు తయారు చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో ఈ నాలుగు పేర్లను ఎంపిక చేయగా.. వీరిలో ఒకరిని అభ్యర్థిగా పేర్కొంటూ రెండు రోజుల వ్యవధిలో అధిష్ఠానం ప్రకటిస్తుందని చెబుతున్నారు. ఇంతకూ అధినాయకత్వానికి పంపుతున్న నాలుగు పేర్లు ఏవంటే.. నవీన్ యాదవ్.. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయరు బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డిలు.
బీసీలకు రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జీవో ఇచ్చిన వేళ.. జూబ్లీహిల్స్ టికెట్ ను కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారినే ఎంపిక చేయాలన్నది రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఆలోచనగా చెబుతున్నారు. దీనికి తోడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బలమైన బీసీ సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు బలమైన నేతలు తుది జాబితాలో చోటు దక్కించుకున్నారు. అయితే.. ఇందులో నవీన్ యాదవ్ కే టికెట్ దక్కేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ ఓటమిపాలయ్యారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నేపథ్యంలో.. స్థానిక ఓటర్లతో ఉన్న పరిచయాలు ఆయన వైపు అధిష్ఠానం మొగ్గేందుకు అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉండగా.. అంజన్ కుమార్ యాదవ్ గతంలో సికింద్రాబాద్ ఎంపీగా పని చేసి ఉండటం.. దాని పరిధిలోకే జూబ్లీహిల్స్ నియోజకవర్గం వస్తున్న నేపథ్యంలో ఆయనకు కూడా పరిచయాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి.
ఇక.. బొంతు రామ్మోహన్ విషయానికి వస్తే.. ఆయన నగర మేయర్ గా సేవలు అందించటం.. అందరికి సుపరిచితుడన్నది తెలిసిందే. ఇక.. రహమత్ నగర్ నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ గా ఎన్నికైన సీఎన్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ లో చేరటం.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ జూబ్లీహిల్స్ పరిధిలోనే ఉండటంతో తనకు టికెట్ కేటాయిస్తే ఫలితం పాజిటివ్ గా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధిష్ఠానం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టికెట్ ఎవరికి దక్కినా.. మిగిలినవారంతా కలిసి పార్టీ గెలిచేలా ఐకమత్యంతో పని చేయాలన్న మాటను తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మరి.. అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి.