ఆయన అలుపెరని పోరాటం చేశారు. తన జీవితం మొదటి నుంచే పోరాటాలకు అలవాటు పడ్డారు. బాల్యమంతా ముళ్ళ మీదనే నడిచింది. జీవితంలో ఎక్కడా పూలపానుపు అన్నది ఆయన చూడలేదు. ఒక లక్ష్యం కోసం పుట్టి దానికి సాధించి చివరికి తృప్తిగా తన తనువుని త్యజించిన ఆయనను గిరిజనం గురూజీగా భావిస్తుంది. గుండెలలో పెట్టి చూసుకుంటుంది. ఆయనే తాజాగా కన్నుమూసిన జార్ఖండ్ మాజీ సీఎం శిబూ సోరెన్.
ఈ దేశంలో వందల కోట్ల మంది ప్రజానీకం ఉన్నారు. పార్లమెంట్ మెట్లు ఎక్కేది వందల మందే. అలా కోట్లలో ఏ కొందరికో వచ్చే అవకాశం దక్కించుకోవాలీ అంటే సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. కానీ శిబూ సోరెన్ ఏకంగా ఏడు సార్లు పార్లమెంట్ మెంబర్ అయ్యారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించారు. దాని వెనక ఆయన కఠోర శ్రమ, పోరాడే తత్వం ఉన్నాయని చెప్పాలి.
అత్యంత వెనకబడిన గిరిజన ప్రాంతంలో జన్మించిన ఆయన పడుచు ప్రాయంలో ఉద్యమ బాట పాట్టారు. 28 ఏళ్ళ వయసు నుంచే ఆయన జార్ఖండ్ ప్రాంతం కోసం ప్రత్యేక అస్థిత్వం కోసం జార్ఖండ్ ముక్తీ మోర్చాను స్థాపించి భారీ ఉద్యమమే నడిపారు. గిరిజనుల హక్కుల కోసం అలుపెరగని తీరులో ఉద్యమించారు. కేంద్ర రాష్ట్ర పాలకులతో నిరంతర సమరమే చేశారు. ఈ కృషిలోనే ఆయన తన జీవితాన్ని అంతా వెచ్చించారు అని చెప్పాలి.
బీహార్ నుంచి ప్రత్యేక రాష్ట్రం గిరిజనుల కోసం ఆయన నిరంతరం పరిశ్రమించారు. దాని కోసం ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా వెన్ను వంచలేదని చెప్పాలి. ఒక దేశంలో రాష్ట్ర సాధన ఎంత కష్టమో చెప్పడానికి ఆయనే ఉదాహరణ. ఎంత పోరటం చేస్తే సాధించవచ్చో చెప్పడానికి ఆయనే స్పూఒర్తి అని పేర్కొన్నాలి. అలా మూడు దశాబ్దాల పాటు ఎన్నో ప్రభుత్వాలతో ఆయన చేసిన పోరాటం ఫలితంగా 2000లో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది.
తెలంగాణా రాష్ట్రం కోసం రెండు దశలుగా పోరాటం సాగింది. సరిగ్గా 1960 దశకం చివరిలో తెలంగాణా రాష్ట్ర మొదటి విడత ఉద్యమం సాగింది ఆ సమయంలోనే జార్ఖండ్ లో కూడా సోరెన్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నినాదం ఎత్తుకున్నారు. అయితే ఆ తరువాత తొలి విడత ఉద్యమం చల్లారింది కానీ సోరెన్ మాత్రం పట్టువీడలేదు. రాష్ట్ర సాధనే ధ్యేయంగా పనిచేశారు. అదే కేసీఆర్ కి ఎంతో స్పూర్తిని ఇచ్చింది. ఆయన కూడా రాష్ట్రం పేరుని కలిసేలా తెలంగాణా రాష్ట్ర సమితి అని 2001లో ఉద్యమ పార్టీ పెట్టారు. దానికి శిబూ సోరెన్ ని ఆహ్వానించారు. ఆ తరువాత అనేక సార్లు ఆయన సలహా సూచనలు తీసుకుంటూ వచ్చారు.
శిబూ సోరెన్ అంటే కేసీఅర్ కి ఎంతో గౌరవం. తాను నమ్మిన సిద్ధాంతం కోసం మొక్కవోని విధంగా కడదాకా పోరాటం చేశారు అన్నది కేసీఅర్ భావన. ఇక కేంద్ర పాలకులకు కూడా ఆయన అంటే అంతే గౌరవం ఉంది. అందుకే ఆయన మరణవార్త విన్న వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ ఆయన భౌతిక కాయానికి ఘన నివాళి అర్పించారు. గిరిజనులలో ఎంతో మంది నాయకులు పుట్టారు. ఆధునిక కాలంలో అరుదైన నాయకుడిగా శిబూ సోరెన్ అందరికీ గుర్తుండిపోతారు.