జేసీ బ్రదర్స్ పాలిటిక్స్ అంతా కాంగ్రెస్ కల్చర్ తోనే సాగుతుంది. వారు ఏ పార్టీలో ఉన్నా స్వేచ్చగా వ్యవహరిస్తారు. తమ ధోరణిలో ముందుకు సాగుతారు. ఆ తరువాత వచ్చే పరిణామాలను కూడా పెద్దగా పట్టించుకోరని చెబుతారు. చంద్రబాబు వైఎస్సార్ సమకాలీనుడుగా మాజీ మంత్రి దిగ్గజ నేత జేసీ ప్రభాకర రెడ్డి అయిదు దశాబ్దాల పాటు రాజకీయాలు నెరిపారు. ఆయన కాంగ్రెస్ లో కింగ్ లాగానే వెలిగారు విభజన తరువాత ఏపీలో 2014లో కాంగ్రెస్ కుదేలు కావడంతో ఆయన టీడీపీని ఎంచుకున్నారు ఆ ఎన్నికల్లో తాడిపత్రి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయి మంత్రి కావాలనుకుంటే బాబు ఆయనను పార్లమెంట్ కి పంపించారు. అలా అయిదేళ్ళ పాటు ఎంపీగా చేసిన జేసీ 2019లో రాజకీయాలకు ఒక దండం పెట్టేసారు. దానికి ఆరోగ్య సమస్యలు కూడా కారణం అని అంటారు.
ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి 2019 లో అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఆయన కూడా పెద్దగా రాజకీయాల వైపు చూడటం లేదు. అయితే తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం జోరు పెంచేశారు. అన్నకు తోడుగా ఉంటూ దశాబ్దాలుగా అనంతపురం రాజకీయాలను ప్రభావం చేస్తున్న ప్రభాకర్ రెడ్డి 2014 లో తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచారు. అదే విధంగా 2019లో మాత్రం తన కుమారుడు అస్మిత్ రెడ్డిని బరిలోకి దింపితే ఓటమి పాలు అయ్యారు. అయితే తెలివిగా ఆయన తాడిపత్రి చైర్మన్ గా గెలిచి అయిదేళ్ళ పాటు తాడిపత్రిలో తమ రాజకీయాన్ని కంట్రోల్ లో పెట్టుకుని 2024 నాటికి కుమారుడు అస్మిత్ రెడ్డిని గెలిపించారు. ఇక ఆయన మొత్తం రాజకీయమంతా తానే చేస్తూ వస్తున్నారు.
ఇదిలా ఉంటే కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో ఆర్టీపీపీ బూడిద కోసం జేసీ తగువు పెట్టుకున్నారు సవాళ్ళూ ప్రతి సవాళ్ళూ ఒక స్థాయిలో అయి అధినాయకత్వానికి వివాదం చేరినా జేసీ అయితే తగ్గలేదు. ఇక వైసీపీ మీద ఆయన ఒంటి కాలి మీద లేస్తూ వైసీపీ తాడిపత్రి ఇంచార్జి పెద్దారెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఇది ప్రత్యర్థి పార్టీ మీద రాజకీయం కాబట్టి టీడీపీకి ఇబ్బంది లేకపోయినా జేసీ అతి ఉత్సాహంతో కొన్ని సార్లు ఇరకాటంలో పడుతోంది అని అంటున్నారు. తాడిపత్రిని వేడెక్కించేలా పాలిటిక్స్ చేస్తూ జేసీ అక్కడ చేస్తున్న దూకుడు టీడీపీ పెద్దల దృష్టిలో ఉందని అంటున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే ఏకంగా సొంత పార్టీ నేతకే జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసి బెదిరించిన ఘటన ఇపుడు కలకలం రేపుతోంది. తన జిల్లా కాదు తన ప్రాంతం కాదు కానీ తన పార్టీకి చెందిన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డికి జేసీ ఫోన్ ద్వారా బెదిరింపులు చేశారని అంటున్నారు ఒంగోలుకు చెందిన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఈ విషయాన్ని బయట పెట్టారు. తనకు జేసీ ఫోన్ బెదిరింపులు చేయడమేంటి అని ఫైర్ అయ్యారు ఆయన మీడియా ముఖంగానే మీసాలు తిప్పి మరీ జేసీకి కౌంటర్ ఇచ్చారు. తనతో ఇలాంటివి ఎపుడూ చేయవద్దని కూడా స్పష్టం చేశారు. రాష్ట్ర పార్టీలో కీలక పదవిలో ఉన్న సూర్యప్రకాష్ రెడ్డి మీద జేసీ చేస్తున్న ఈ బెదిరింపు రాజకీయం ఇపుడు పెద్ద ఎత్తున చర్చగా ఉంది. జేసీ వైఖరికి ఆయన దూకుడుకు తన పర భేదం లేకపోవచ్చు కానీ తరచూ వివాదాలు క్రియేట్ చేస్తూ తల నొప్పులు అయితే తెస్తున్నారు అని పార్టీలో చర్చ సాగుతోందిట. జేసీల రాజకీయం చరమాంకంలో ఉంది. కుమారుడు అస్మిత్ రెడ్డి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని అయినా పెద్దాయన తగ్గాలని అంతా అంటున్నారు కానీ జేసీల తీరే వేరు కదా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.