భార్యా భర్తల నడుమ కలహాలు, కుమ్ములాటల వార్తలే కాదు.. భార్య కోసం ప్రాణం పెట్టేసే, తప్పిపోయిన భార్య కోసం జీవితాంతం ఎదురు చూసే భర్తలు కూడా ఉంటారు ఈ సమాజంలో. అలాంటి ఒక ఉదాహరణ ఈ జపనీ హబ్బీ. 14 ఏళ్లుగా అతడు తప్పిపోయిన భార్య కోసం వెతుకుతున్నాడంటే, ఆమెపై అతడి ప్రేమను అర్థం చేసుకోవాలి. 2011లో వచ్చిన సునామీలో తప్పిపోయిన తన భార్య యుకో కోసం జపాన్‌కు చెందిన యసువో టకామట్సు అనే వ్యక్తి నిరంతరం అన్వేషణలో ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు భార్య బతికి ఉండదని అతడికి తెలుసు. కనీసం అంత్యక్రియలను సక్రమంగా నిర్వహించాలనే కోరికతో టకామట్సు ఫుకుషిమాలోని మురికి నీటిలో డైవింగ్ చేస్తూ భార్య అవశేషాల కోసం ఒక దశాబ్దానికి పైగా గడిపాడనేది తెలిస్తే అది ఆశ్చర్యపరచకుండా ఉండదు.
జపాన్ లో దాదాపు 20,000 మంది ప్రాణాలను బలిగొన్న ఈ సునామీలో వేలాది మంది తప్పిపోయారు. సమీపంలోని ఒడ్డున పనిచేసే యుకో వేగంగా దూసుకొచ్చిన ఎత్తైన అలల ధాటికి కొట్టుకుపోయాడు. అతడి భార్య కూడా ఎటు కొట్టుకుపోయిందో అతడికి తెలీదు. కానీ భార్య కోసం టకామట్సు అన్వేషణ అవిశ్రాంత ప్రయత్నం ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవింపజేస్తున్నాయి. మసయోషి టకామట్సు అనే స్వచ్ఛంద సేవకుడి సహాయంతో టకామట్సు డైవ్ చేయడం నేర్చుకున్నాడు. గతంలో నీటి అడుగున సునామీ శిథిలాలను శుభ్రం చేసిన అనుభవం అతడికి ఉంది.
సముద్రం అడుగున అంధకారం, ఎముకలు కొరికే చలి ఉన్నా, అసాధారణ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఇద్దరూ యుకో శిథిలాల కోసం వెతుకుతున్నారు. మిస్టర్ టకామట్సు ఇంకా తన భార్య శిథిలాలు లభిస్తాయనే ఆశతోనే ఉన్నడు. సవ్యంగా వాటికి సంస్కారాలు చేయడం ద్వారా తన ఆత్మ శాంతిస్తుందని అతడు నమ్ముతున్నాడు. అతడి ధృఢమైన నమ్మకం ఏనాటికైనా ఫలించాలని ఇది తెలిసినవారంతా కోరుకుంటున్నారు.
సునామీలో కొట్టుకుపోయే సమయంలో యుకో తన భర్తకు తన ఫోన్‌లో రెండు సందేశాలు పంపింది. ఆమె చివరి సందేశంలో “మీరు క్షేమంగా ఉన్నారా? నేను ఇంటికి వెళ్లాలనుకుంటున్నాను“ అని రాసింది. టైప్ చేసి వెళ్లని మెసేజ్ లో ఆమె సునామీ తీవ్రతను తెలియజేయడానికి ప్రయత్నించింది. `సునామీ వినాశకరమైనది` అని రాసింది.