చాలా కాలానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఆయన అది కూడా ఉప ముఖ్యమంత్రి అయ్యాక నిర్వహించే తొలి బహిరంగ సభగా దీనిని చెప్పుకోవాలి. గతంలో జనసేన అధినేత హోదాలో ఆయన చాలా సార్లు విశాఖలో సభలు పెట్టారు. వారాహి సభను అయితే ఏకంగా జగదాంబ జంక్షన్ నడిబొడ్డున పెట్టారు. ఈసారి మాత్రం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్నారు.
పట్టు పెంచుకునేందుకే :
విశాఖ సౌత్ లో జనసేన తొలిసారి గెలిచింది. బలమైన సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా ఉన్న వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇపుడు ఆయన నియోజకవర్గంలోనే ఈ సభ జరుగుతోంది. పైగా వంశీ క్రిష్ణ జనసేన విశాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక పవన్ సభ ఏర్పాట్లను చాలా రోజుల నుంచే అన్నీ దగ్గరుండి కీలక నేతలు చూసుకున్నారు పవన్ సభకు జనాలకు అయితే కొదవ ఉండదు. పెద్ద ఎత్తున వచ్చే జనాలను ఎలా కంట్రోల్ చేయాలన్నదే ఆలోచనగా ఉంటుంది.
బహిరంగ సభ మీదనే చర్చ :
పవన్ ఇపుడు అధికారంలో ఉన్నారు. కూటమిలో కీలకంగా ఉన్నారు ఉప ముఖ్యమంత్రిగా ఆయన పాలిస్తున్నారు. దాంతో పవన్ ఏమి చెప్పబోతున్నారు అన్నదే అంతటా చర్చగా ఉంది. బహిరంగ సభ కాబట్టి ఆయన జనాలను ఉద్దేశించే మాట్లాడుతారు అని అంటున్నారు. అంతే కాదు గత పదిహేను నెలలుగా రాష్ట్రంలో సాగిన కూటమి పాలన అభివృద్ధి సంక్షేమం వంటి వాటి గురించి ఆయన చెబుతారు అని అంటున్నారు. అదే సమయంలో జనసేన పార్టీ సభ కాబట్టి క్యాడర్ కి ఉత్సాహం ఇచ్చేలా ఆయన వైసీపీ మీద కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారు అని అంటున్నారు పైగా కూటమి ఐక్యత మీద మాట్లాడుతారని పొత్తుల గురించి కూడా మరింత స్పష్టత అటు పార్టీ జనాలకూ ఇటు ప్రజలకూ ఇస్తారని అంటున్నారు.
ఆ రెండు విషయాల మీద :
ఇక పవన్ విశాఖ వచ్చారో లేదో అలా సుగాలీ ప్రీతి కేసు మీద ఆమె తల్లి వీల్ చెయిర్ పాదయాత్ర అంటూ ప్రకటించారు అది సంచలనం అయింది. పవన్ మీద ఆమె విమర్శలు చేశారు. దానికి పవన్ కూడా పార్టీ సమావేశంలో గట్టిగానే మాట్లాడారని వివరణ ఇచ్చారని అంటున్నారు. అయితే బహిరంగ సభలో ఆయన మరింత స్పష్టంగా వివరణ ఇస్తారని చెబుతున్నారు అంతే కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ మాట్లాడాలని ఇటు వైసీపీ అటు ఉక్కు కార్మిక సంఘాలు కూడా కోరుతున్నాయి దాంతో పవన్ ఆ అంశం మీద కూడా మాట్లాడుతారా అన్న చర్చ సాగుతోంది. మొత్తానికి పవన్ స్పీచ్ ఎలా ఉండబోతోంది అన్నదే చర్చ. పవర్ ఫుల్ స్పీచ్ ఇస్తారా లేక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఒక స్థాయి వరకే మాట్లాడి ఊరుకుంటారా అన్నదే అంతా ఆలోచిస్తున్నారుట.