కూటమి ప్రభుత్వంలో సాధారణ కార్యకర్తలకు పెద్ద పదవులు దక్కుతున్నాయి. గత ప్రభుత్వంలో ప్రజల తరఫున పోరాడిన కార్యకర్తలకు ఊహించని పదవులు కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రంలో ప్రధాన ఆలయాల్లో ఒకటైన శ్రీకాళహస్తి ఆలయ ట్రస్టు బోర్డు చైర్మనుగా అత్యంత సాధారణ కార్యకర్తను ఎంపిక చేశారు. తిరుపతి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్టే సాయిప్రసాద్ కు ఈ పదవిని కట్టబెట్టడం ద్వారా పనిచేసిన వారికి తగిన గుర్తింపు, గౌరవం దక్కుతుందని జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరూపించారని కార్యకర్తల ప్రశంసలు అందుకుంటున్నారు.
శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన కొట్టే సాయిప్రసాద్ రాజకీయాలపై ఆసక్తి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అభిమానంతో జనసేన తరపున చురుకైన కార్యకర్తగా మారారు. ఫ్యాన్సీ షాపు వ్యాపారిగా ఉంటూ రాజకీయంగా చురుగ్గా వ్యవహరించిన సాయిప్రసాద్ గత ప్రభుత్వంలో చేసిన ఓ చిన్న పోరాటం ఆయనకు రాష్ట్రవ్యాప్త గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు ఓ పెద్ద ఆలయానికి చైర్మన్ గా చేసిందని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా, శ్రీకాళహస్తిలో ఓ బాలిక మిస్సింగ్ కేసుకు సంబంధించి ఆందోళన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అప్పటి శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ ఆందోళన చేస్తున్న జనసైనికుడు కొట్టే సాయిప్రసాద్ ను చెంపపై కొట్టారు. అంతేకాకుండా ఆయనపై దురుసుగా వ్యవహరించారు.
ఈ సంఘటనపై వీడియో వైరల్ అయింది. అంతేకాకుండా పోలీసు అధికారిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిందిపోయి, తమ పార్టీ కార్యకర్తలపై చేయిచేసుకోడాన్ని సీరియస్ గా తీసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్, పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తో కలిసి శ్రీకాళహస్తి వచ్చి సాయిప్రసాద్ కి సంఘీభావం తెలిపారు. అంతేకాకుండా అతడిని తీసుకుని వెళ్లి తిరుపతి ఎస్పీకి అప్పట్లోనే ఫిర్యాదు చేశారు. బాలిక మిస్సింగ్ కేసుపై జనసేన కార్యకర్తలు ఆందోళన చేయడం, ఈ సందర్భంగా చోటుచేసుకున్న వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనాని పవన్ గతంలో పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించుకుని పదవుల పందేరంలో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో టీటీడీ తర్వాత పెద్దదైన శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవిని ఏరికోరి సాయిప్రసాద్ కి కట్టబెట్టారు. ఈ పదవి కోసం కూటమిలోని టీడీపీ, బీజేపీ నుంచి కూడా తీవ్ర పోటీ ఎదురైంది. ముఖ్యంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు సైతం ఆలయ చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ, జనసేనాని పవన్ నిర్ణయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన కార్యకర్త కొట్టే సాయిప్రసాద్ ను ఆలయ కమిటీ చైర్మన్ గా ఎంపిక చేశారు. ఈ నియామకంపై కూటమి పార్టీల కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని సాధారణ కార్యకర్తకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని అభినందిస్తున్నారు.