ఏపీ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా చేసిన ఓ వ్యాఖ్య రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. సందర్భాన్ని సృష్టించుకుని చేసినట్టుగా ఉన్న వ్యాఖ్యల అంతరార్థంపైనా చర్చ జరుగుతోంది. అసలు ఈ వ్యాఖ్యలు ఇప్పుడే ఎందుకు చేయాలన్నది కూడా ప్రశ్నలకు దారి తీసింది. ”ఉచిత పథకాలు ఎవరికి? ఎందుకు?” అనే కోణంలో పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
2018, అక్టోబరు 12న(ఖచ్చితంగా ఆదివారం రోజు) పవన్ కల్యాణ్.. ఉత్తరాంధ్రలో పర్యటించారు. పంచెక ట్టు.. ధవళ వస్త్రాల్లో ఉన్న ఆయన పొలం పనులను పరిశీలించారు. రైతులతోనూ.. రైతు కూలీలతోనూ ఆయన భేటీ అయి.. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సమయంలోనే కొందరు యువత ఆయనను కలుసుకున్నారు. వారి సమస్యలు చెప్పుకొన్నారు. ప్రధానంగా నిరుద్యోగాన్ని ఆనాడు ప్రశ్నించారు. తాము చదువుకుని కూడా నిరుద్యోగులుగా ఉండిపోతున్నామని.. ఉపాధి కల్పించాలని కోరుకున్నారు.
ఆ నాడు తీసిన ఫొటోను.. ఏడేళ్ల తర్వాత ప్రస్తుతం మంత్రిగా ఉన్న… జనసేన నాయకుడు నాదెండ్ల మనో హర్.. తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిని చూసిన పవన్ కల్యాణ్.. రీ పోస్టు చేస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”ఏపీలో యువత ఉచితాలు, సంక్షేమ పథకాలు అడగడం లేదు. 25 సంవత్సరాల భవితను కోరుకుంటున్నారు.” అని పేర్కొన్నారు. అయితే.. ఇవి సర్కారు అను సరిస్తున్న విధానాలపై ఆయన చేసిన వ్యాఖ్యలుగానే ఉన్నాయంటూ.. ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు.
ఇటీవల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా.. ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. ఉచితాలు అనుచితాలు అంటూ.. ఆయన పేర్కొన్నారు. ఉచిత బస్సు ఎందుకని ప్రశ్నించారు. ఉపాధి మార్గాలు చూపించాలని సూచించారు. ఉదయం అంతా సంక్షేమం కింద డబ్బులు ఇస్తూ.. సాయంత్రం అయ్యే సరికి.. మద్యం రూపంలో లాగేస్తున్నారని రెండు తెలుగు రాష్ట్రాలపైనా ఆయన విమర్శలు చేశారు. ఇక, ఈ పరంపరలో రాష్ట్ర సర్కారులో కీలక భాగస్వామిగా ఉన్న పవన్.. ఉచిత పథకాలు ఎవరూ కోరుకోవడం లేదని చెప్పడం విమర్శలకు దారితీసింది.