జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయ మేధమెటిక్స్ ని బాగా ఔపాసన పట్టారు. ఆయన రాజకీయ వ్యూహాలను కూడా బాగానే ఒడిసిపట్టారు. దాంతోనే వైసీపీకి ఉక్కిరి బిక్కిరి తప్పడం లేదు. 2019లో జరిగిన పొరపాట్లు 2024 నాటికి రిపీట్ కాకుండా పవన్ చూసుకున్నారు ఫలితంగా ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అదే సమయలో వైసీపీ ఏకంగా 11 సీట్లకు పడిపోయి పాతాళం అంచులను చూసింది. కట్ చేస్తే పవన్ మరింతగా తన వ్యూహాలను పదును పెడుతున్నారు. అది టీడీపీ అధికార ఆశలను కలగా మార్చేసే పరిస్థితి ఉందా అన్నదే ఇపుడు చర్చగా కనిపిస్తోంది.
టీడీపీతోనే బలమైన బంధం :
పవన్ 2014లో పార్టీ పెట్టారు అంతకు ముందు ప్రజారాజ్యంలో కొంతకాలం పనిచేశారు. మొత్తంగా చూస్తే కనుక ఆయనకు 15 ఏళ్ళకు మించి రాజకీయ అనుభవం ఉంది. అదే ఇపుడు ఆయన నిర్ణయాలలో కనిపిస్తోంది అని అంటున్నారు. ఏపీలో అధికారం 2014లో టీడీపీ వస్తే 2019లో వైసీపీకి వచ్చింది. 2024లో తిరిగి టీడీపీ కూటమికి వచ్చింది ఈ లెక్కన 2029లో వైసీపీకే అధికారం అని ఆ పార్టీ భావిస్తోంది. కానీ అలా కాదు అని పవన్ పక్కా లెక్కలతో నిరూపించబోతున్నారు. ఆయన టీడీపీతో బలమైన బంధాన్ని పెనవేసుకుంటున్నారు.
పొత్తుతోనే వైసీపీ చిత్తు :
ఏపీలో త్రిముఖ పోరు సాగితే వైసీపీకి లాభిస్తుంది. ఎందుకంటే వైసీపీ అయిదేళ్ల పాటు అధికారం చూసింది గ్రౌండ్ లెవెల్ లో విస్తరించి ఉంది అలాగే అనేక సార్లు టీడీపీ అధికారంలో ఉంది. ఆ పార్టీ గ్రాస్ రూట్ లెవెల్ దాకా బలంగా ఉంది ఇలా రెండు బలమైన ప్రాంతీయ పార్టీల మధ్య అధికారం పూర్తిగా దక్కించుకోని జనసేన పోటీకి సొంతంగా దిగితే ఓట్లు చీలి వైసీపీకి అధికారం దఖలు పడుతుంది. అందువల్లనే పవన్ టీడీపీతో పదిహేనేళ్ళ బంధం అని అంటున్నారు. ఆ పార్టీతో కలసి ప్రయాణం చేయాల్సిందే అని శ్రేణులకు కూడా చెబుతున్నారు . కూటమితో ఉండడం అనివార్యం దానికి సిద్ధపడి పార్టీ పనిచేయాల్సి ఉంటుందని దిశా నిర్దేశం చేస్తున్నారు.
పవన్ సందేశం ఇదే :
విశాఖ వేదికగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న జనసేన విస్తృత స్థాయి పార్టీ సమావేశాలలో పవన్ క్యాడర్ కి ఇస్తున్న సందేశం ఇదే అని అంటున్నారు. కూటమి అన్నాక కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ రాష్ట్ర హితం కోరుకుంటూ సర్దుకుని పోవాలని ఆయన సూచిస్తున్నారు అని అంటున్నారు. జనసేనకు అధికారం పదవుల కంటే కూడా రాష్ట్రం చాలా ముఖ్యమని పవన్ పదే పదే చెబుతున్నారు. ఏపీలో టీడీపీ జనసేన పొత్తు ఏకంగా పదిహేనేళ్ళ పాటు కొనసాగించడానికి సిద్ధమని కూడా ఆయన చెబుతున్నారు. ఈ విధంగా జనసేన శ్రేణులను ఆయన మానసికంగా సిద్ధం చేస్తున్నారని అంటున్నారు.
వైసీపీకి చిక్కులు తప్పవా :
ఏపీలో టీడీపీ జనసేన బంధం ఎంత గట్టిగా ఉంటే అంత ఎక్కువగా వైసీపీకి చిక్కులు ఉంటాయి ఆ రెండు పార్టీలు కలిస్తే సహజంగానే వారి ఓటు షేర్ 50 శాతం దాటేస్తుంది. టీడీపీకి నలభై శాతం జనసేనకు పది శాతం కలుపుకుంటే చాలు అధికారం వారి చేతిలోనే ఉంటుంది ఈ మధ్యలో వైసీపీ తన ఓటు షేర్ ని మరో అయిదారు శాతం పెంచుకున్నా అధికారానికి దూరంగానే ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద విశాఖ వేదికగా జరుగుతున్న జనసేన సమావేశాల నుంచి వైసీపీకి ఒక చేదు సందేశాన్నే పవన్ వినిపించబోతున్నారు అని అంటున్నారు. ఈ నెల 30న జరిగే బహిరంగ సభలో టీడీపీతో పొత్తుల గురించి ఆయనే మరింత గట్టిగా ప్రకటిస్తారు అని అంటున్నారు.