అదిగో తోక అంటే ఇదిగో పులి అన్న రోజులు పోయి చాలా కాలమే అయ్యింది. ఇప్పుడు నడుస్తున్నదంతా డిజిటల్ యుగం. అందునా సోషల్ మీడియా తాను అనుకున్నది అనుకున్నట్లుగా ఫేక్ వార్తల్ని సైతం ఫెయిర్ వార్తలుగా మార్చి.. తప్పుడు ప్రచారంతో అందరిని కన్ఫ్యూజ్ చేయటమే కాదు.. చివరకు ‘శీల’ పరీక్షలో కానీ నిజమేంటో తేలాల్సిన పరిస్థితుల్ని సృష్టిస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. ఏది నిజం? ఏది అబద్ధమన్నది ఎవరికి వారు తెలుసుకోవటం కోసం శ్రమించాల్సి వస్తోంది.
అబద్ధం వ్యాపించే వేగం.. నిజం విస్తరించటం కష్టమే అవుతుంది. ఫ్యాక్ట్ చెక్ లో అబద్ధమని తేలిన తర్వాత కూడా.. సదరు అసత్య వార్త వేగంగా జనం మదిలోకి వెళ్లిపోవటంతో.. అది అబద్దమన్నది నమ్మటానికి కాస్తంత సమయం తీసుకుంటున్న దుస్థితి. అనూహ్య రీతిలో ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్ ఖడ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన రాజీనామాపై సాగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఆయన్నుబలవంతం పెట్టి మరీ పదవికి రాజీనామా చేశారంటూ ఆయన రాజీనామాపై పలు కథనాలు తెర మీదకు వచ్చిన పరిస్థితి.
ఇలాంటి వేళ.. ఆయన అధికారిక నివాసాన్ని సీల్ చేశారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అవుతోంది. అంతేకాదు.. ఆయన అధికారిక నివాసాన్ని తక్షణమే ఖాళీ చేయాలని ఆదేశించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే.. ఇదంతా బోగస్ మాటలని.. సదరు ప్రచారంలో ఎలాంటి నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం సోషల్ మీడియాలో తాజాగా పోస్టు పెట్టింది. అయితే.. తన అధికారిక నివాసం నుంచి త్వరగా బయటకు వెళ్లే ఆలోచనలో ధన్ ఖడ్ ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా తన వస్తువుల్ని మంగళవారం నుంచే ప్యాక్ చేసుకోవటం షురూ చేసినట్లుగా చెబుతున్నారు.
ఆయనకు మాజీ ఉపరాష్ట్రపతి హోదాలో ఢిల్లీలో టైప్ 8 లేదంటే మరో ప్రాంతంలో బంగ్లా ఇచ్చే వీలుందని చెబుతున్నారు. కేంద్ర మంత్రులు..జాతీయ పార్టీ అధ్యక్షులకు ఈ తరహాబంగ్లాను కేటాయిస్తుంటారు. ఇకపోతే ఇప్పుడు ఆయన ఉండే అధికారిక నివాసం (వీపీ ఎన్ క్లేవ్) సెంట్రల్ విస్టా డెవలప్ మెంట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సంగతి తెలిసిందే. గడిచిన పదిహేను నెలలుగా ఉప రాష్ట్రపతి హోదాలో ధన్ ఖడ్ అక్కడే ఉంటున్నారు. మొత్తంగా తనకుండే గడువు కంటే ముందే.. రోజుల వ్యవధిలోనే అధికారిక నివాసాన్ని ఖాళీ చేసే యోచనలో ఆయన ఉన్నట్లుగా చెప్పక తప్పదు.
పదవీకాలం ఉన్నప్పటికి అనూహ్య రీతిలో ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన ధన్ ఖడ్ వ్యవహారం ఎంత సంచలనంగా మారిందో తెలిసిందే. అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేసినట్లు ఆయన చెబుతున్నప్పటికీ.. అసలు కారణం అదేమీ కాదని.. మోడీషాల కారణంగానే ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తటం తెలిసిందే.
తన పదవికి రాజీనామా చేసినట్లుగా సోషల్ మీడియాలో పెట్టిన ధన్ ఖడ్ పోస్టుతో ప్రపంచానికి తెలిసిందే. అయితే.. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఒక కొత్త విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అదేమంటే.. తన రాజీనామా పత్రాన్ని తన సహాయకులతో రాష్ట్రపతికి అందేలా చూడకుండా తనకు తానే.. స్వయంగా రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన ఆసక్తికర అంశం బయటకు వచ్చింది.
సోమవారం రాత్రి 9.30గంటల ప్రాంతంలో తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తన రాజీనామా అంశాన్ని ధన్ ఖడ్ వెల్లడించారు. అయితే.. దీనికి అరగంట ముందుగా ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకుండా.. నేరుగా రాష్ట్రపతి భవన్ కు వెళ్లిన ధన్ ఖడ్.. రాష్ట్రపతి ముర్ముతో ప్రత్యేకంగా భేటీ అయి.. తన రాజీనామా లేఖను ఆమె చేతికి అందించిన వైనం వెలుగు చూసింది. రాష్ట్రపతి భవన్ నుంచి బయటకు వచ్చి.. తన నివాసానికి చేరుకున్న తర్వాత.. తన రాజీనామా అంశాన్నిఅధికారికంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన వైనాన్ని తాజాగా గుర్తించారు. ముందస్తు షెడ్యూల్ లేకుండానే రాష్ట్రపతి భవన్ కు వెళ్లి.. రాష్ట్రపతితో భేటీ అయిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సాధారణంగా రాష్ట్రపతితో భేటీ అయ్యేందుకు ముందస్తుగా సమయం తీసుకొని వెళ్లటం జరుగుతుంది. అందుకు భిన్నంగా ఎలాంటి అనుమతి తీసుకోకుండా వెళ్లి కలిసిన వైనం చర్చనీయాంశంగా మారింది.
అనూహ్య రీతిలో ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేయటం ద్వారా సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా మారారు ధన్ ఖడ్. ఎంత ఆరోగ్యం బాగోలేకపోతే మాత్రం.. అంత హడావుడిగా రాజీనామా చేయాలసిన అవసరం ఏమిటి? అన్నది ప్రశ్న. నిజంగానే అనారోగ్యం క్షీణించి ఉంటే.. పదవీ బాధ్యతలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ ఇబ్బందేమీ లేదు. పార్లమెంట్ సమావేశాల వేళలోనూ.. రాజ్యసభకు అధ్యక్ష స్థానంలో కూర్చోకున్నా.. డిప్యూటీలు ఆ బాధ్యతను నిర్వర్తించేవారు.
అలాంటప్పుడు అంత త్వరపడి రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా? అంటే లేదనే చెబుతారు. అయినప్పటికీ రాజీనామా విషయంలో అంత హడావుడి ప్రదర్శించటం వెనుక అసలు అర్థమేంటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అదే పలు ఊహాగానాలకు ఆయువుగా నిలిచింది. ఇదిలా ఉండగా.. ధన్ ఖడ్ రాజీనామా నేపథ్యంలో కొత్త ఉప రాష్ట్రపతి నియామకం కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి.
ఇదే సమయంలో కొత్తగా ఎన్నికయ్యే ఉప రాష్ట్రపతి పదవీ కాలం ఎంత? అన్నది మరో ఆసక్తికర ప్రశ్నగా మారింది. ఉప రాష్ట్రపతి పదవీ కాలం ఐదేళ్లు. ధన్ ఖడ్ తన పదవీ కాలం మరో రెండేళ్లు ఉండగానే అర్థాంతరంగా రాజీనామా చేశారు.దీంతో.. కొత్తగా వచ్చే ఉప రాష్ట్రపతి మిగిలిన రెండేళ్లకు కాకుండా.. మొత్తం ఐదేళ్లు ఆ పదవిలో ఉంటారు. ఇక.. కొత్త ఉప రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు తుది షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటిస్తామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక ప్రకటన విడుదలైంది కూడా.
కొత్త ఉప రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే కూటమి స్పష్టమైన మెజార్టీ ఉంది. మొత్తం 543 లోక్ సభా స్థానాలకు గాను.. పశ్చిమ బెంగాల్ లోని బసీర్ ఘాట్ స్థానం ఖాళీగా ఉంటే.. 245 స్థానాలు ఉన్న రాజ్యసభలో పంజాబ్ నుంచి ఒక సీటు.. జమ్ముకశ్మీర్ నుంచి నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ లెక్కన ఇప్పుడున్న మొత్తం సభ్యుల సంఖ్య 786. అయితే.. ఉప రాష్ట్రపతిగా ఎన్నికల్లో విజయం సాధించాలంటే బరిలో ఉన్న అభ్యర్థి 394 ఓట్లు సాధించాలి. లోక్ సభలో ఎన్డీయే కూటమికి 293 మంది సభ్యుల మద్దతు ఉండగా.. రాజ్యసభలో 129 మంది సభ్యుల బలం ఉంది. మొత్తంగా చూస్తే ఎన్డీయే కూటమికి 422 మంది సభ్యుల మద్దతు ఉంది. దీంతో.. గెలిచేందుకు అవసరమైన దానికి మించి 28 ఓట్లు అదనంగా ఉన్నాయి. దీంతో.. పాలక ఎన్డీయే డిసైడ్ చేసిన అభ్యర్థి ఉప రాష్ట్రపతి పదవికి ఇట్టే ఎంపిక అవుతారని చెప్పాలి.