ఏపీలో రాజకీయం ఎలా సాగుతోంది అంటే అందరికీ తెలిసిందే. నాయకులు కంటే ముందు వారసులుగానే జనంలో ముద్ర పడుతున్నారు. అయితే ఈ వారసత్వం కూడా ఎంతో కొంత జవసత్వాలు ఉంటేనే నిలబడుతుంది. ఆ విధంగా చూస్తే వారసులమని చాలా మంది వస్తారు కానీ కొందరే జనం అభిమానం చూరగొంటారు. ఇదిలా ఉంటే ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏమిటి అంటే వైసీపీ అన్నా జగన్ అన్నా గిట్టని ఒక పచ్చ మీడియా ఇటీవల తన విశ్లేషణలో జగన్ కి కొంత సాఫ్ట్ కార్నర్ చూపించింది. బాలయ్య అసెంబ్లీ ఎపిసోడ్ లో ఆయనను విమర్శించే క్రమంలో జగన్ ని అలా అనడం తప్పు కదా అంటూ తనదైన కొత్త రాజకీయ విశ్లేషణ వినిపించింది.
ఏపీలో రాజకీయం గురించి ఏ తీరున ముందుకు సాగుతోంది అన్న దాని గురించి కూడా సదరు మీడియా ఒక విశ్లేషణ చేసింది. ఈ క్రమంలోనే ఏపీలో వైఎస్సార్ రాజకీయ వారసత్వం జగన్ కే దక్కిందని తన కోణంలో ఒక వ్యాఖ్యానం చేసింది. ఆ విషయంలో కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెనకబడి ఉన్నారని కూడా చెప్పకనే చెప్పింది. నిజానికి చూస్తే వైఎస్సార్ వారసత్వం కోసం షర్మిల పోటీ పడుతున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ ది కాంగ్రెస్ పార్టీ అని ఆయన కుమార్తెగా కాకుండా ఆయన ఆశయాలకు కూడా తానే అచ్చమైన వారసురాలిని అని షర్మిల ఎన్నో సార్లు చెప్పుకున్నారు. మరి ఆమెకు ఈ తరహా విశ్లేషణ మింగుడుపడేది కాదనే అంటున్నారు.
అయితే ఇదేమీ కొత్త విషయం కాదని ఇప్పటికే రుజువు అయింది కదా అని వైసీపీ వర్గాలు అంటున్నారు. ఎపుడైతే వైఎస్సార్ మరణించారో నాటి నుంచే జగన్ లోనే ఆయనను ఏపీ జనాలు చూసుకుంటూ వచ్చారని అనేక ఎన్నికల్లో వైసీపీకి దక్కిన భారీ ఓటు బ్యాంక్ అందుకు నిదర్శనం అని కూడా చెబుతున్నారు. అంతే కాదు 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయినా వైసీపీ వెంట 40 శాతం ఓటు బ్యాంక్ నిలిచి ఉంది అంటే వైఎస్సార్ మార్క్ పాలిటిక్స్ జగన్ చేస్తున్నారని నమ్మిన వర్గాలు వేసిన ఓటు గానే దానిని చూడాలని అంటున్నారు.
నిజం చెప్పాలీ అంటే వైఎస్సార్ వారసత్వం అంటూ జగన్ కాంగ్రెస్ నుంచి వేరుపడి సొంత పార్టీ పెట్టుకున్నపుడే ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మొత్తం ఆ వైపుగా వెళ్ళిపోయి హస్తం పార్టీకి అతి పెద్ద చిల్లు పడింది. ఇపుడు చూస్తే దానికి పూడ్చుకునే క్రమంలో కాంగ్రెస్ చేయాల్సినవి అన్నీ చేస్తూ వచ్చింది. చివరాఖరికి అతి పెద్ద ట్రంప్ కార్డుని సైతం ప్రయోగించింది. ఈ క్రమంలో వైఎస్సార్ తనయ అయిన షర్మిలను ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేసింది దీని వల్ల కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆశిస్తోంది చాలానే ఉంది. పోయిన తమ ఓటు బ్యాంక్ ని వైసీపీ నుంచి పొందాలన్నదే ఆ ప్లాన్. కానీ జరుతున్నది కానీ మీడియా విశ్లేషణలు కానీ జనాభిప్రాయం కానీ చూస్తే వైఎస్సార్ కి అసలైన రాజకీయ వారసుడు జగన్ అని తేలుతోంది. మరి ఏణ్ణర్థం పైగా పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిల ఈ విషయంలో సాధించింది ఏమినా ఉందా అన్నది కూడా కాంగ్రెస్ వర్గాలలోనే అతి పెద్ద చర్చగా ఉంది. చూడాలి మరి ముందు ముందు కాంగ్రెస్ ఏ రకమైన స్ట్రాటజీలు వేస్తుందో, షర్మిల ఏ విధంగా దూకుడు చేస్తుందో.