రాజకీయం ఒక హాలాహలం అయితే నిత్యం మేధో మధనం జరగాల్సిందే. ఎంతలా మెదడుని వేడెక్కిస్తే అంతలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ విషయంలో తలపండిన రాజకీయ నాయకులు అంతా ఇలాగే ఉంటారు. చంద్రబాబు దానికి నిలువెత్తు ఉదాహరణ. ఆయన అపర చాణక్యుడు. అలాగని తనతోనే ఆలోచనలు వ్యూహాలు ఆగిపోనీయరు అందరి అభిప్రాయాలను తీసుకుంటారు. అలా గ్రౌండ్ లెవెల్ తో నిరంతరం టచ్ లో ఉంటారు. ఇపుడు జగన్ కూడా అదే బాటలో నడవబోతున్నారు
గెలిచాము అంటే దానికి వేరే చింతన కానీ మధనం కానీ అసలు అవసరం లేదు. కానీ అదే ఓటమి సంభవిస్తేనే సవా లక్ష లెక్కలు చూసుకోవాలి. ఇపుడు జగన్ అదే చేస్తున్నారు. 2019 నుంచి 2024 మధ్యలో పాలన తో పాటు పార్టీని కూడా సమానంగా కో ఆర్డినేషన్ చేయాల్సింది. కానీ అది ఎక్కడో మిస్ అయింది. దాంతో పాలన సంగతి ఎలా ఉన్నా పార్టీ గాడి తప్పింది. దాని ఫలితమే వైసీపీ చవి చూసింది అని అంటున్నారు. దీంతో జగన్ బెంగళూరు వేదికగా చేసుకుని పార్టీని మళ్ళీ ఎలా పెంచి పెద్దగా చేయాలని ఆలోచిస్తున్నారు. ఆ విషయంలో ఆయన చర్చోప చర్చలు చేస్తున్నారు.
ఐ ప్యాక్ టీం తో వైసీపీకి జగన్ కి తీపి చేదూ అనుభవాలు ఉన్నాయనీ అంటారు. 2019 ఎన్నికల ముందు ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే కలసి ముందుకు వెళ్ళిన వైసీపీ మంచి విజయాన్ని నమోదు చేసింది. 151 సీట్లతో బంపర్ విక్టరీని కొట్టింది. దాంతో వైసీపీకి ఇక తిరుగులేదని కూడా వైసీపీ అధినాయకత్వం భావించింది. 2019 ఎన్నికల తరువాత కూడా వైసీపీ ఐ ప్యాక్ టీం తో అనుబంధాన్ని కొనసాగించింది. కానీ ఈసారి రుషి రాజ్ సింగ్ తో కలసి వ్యూహాలను సిద్ధం చేసుకుంది. అయితే అవన్నీ బూమరాంగ్ అయ్యాయి. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇంటింటికీ వైసీపీ అంటే సూపర్ హిట్ అయింది. కానీ పవర్ లోకి వచ్చాక అదే బెడిసికొట్టింది. వై నాట్ 175 అన్నది కూడా దారుణంగా ఫ్లాప్ స్లోగన్ అయింది. ఇక క్యాడర్ ని పక్కన పెట్టి వాలంటీర్లను తీసుకుని రావడం కూడా వైసీపీకి తలనొప్పులే తెచ్చి పెట్టాయన్నది రుజువు అయింది. కర్ణుడి చావుకు ఎన్ని కారణాలు ఉన్నాయో వైసీపీ ఓటమికి అన్నే కారణాలు ఉన్నాయని అంటారు.
ఇక ఈసారి కూడా వైసీపీ ఐ ప్యాక్ టీం లో చేసిన ఒక కొత్త వ్యూహకర్తను ఎంగేజ్ చేస్తోంది అన్నది పార్టీ వర్గాల ద్వారా ప్రచారం అవుతున్న విషయం. రుషి రాజ్ సింగ్ కి బై చెప్పిన తరువాత అన్ని విధాలుగా ఆలోచించి కొత్త వ్యూహకర్తను వైసీపీ తీసుకుందని చెబుతున్నారు. ఆయన ఎవరో ఏమిటో రివీల్ చేయనప్పటికీ ఆయన వ్యూహాలనే 2029 ఎన్నికల్లో అమలు చేయడం ద్వారా వైసీపీకి పూర్వ వైభవంతో పాటు అధికారాన్ని కూడా అందుకోవాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు. ఇక జగన్ 2.0 అన్నది కూడా ఈ వ్యూహంలో భాగమే అంటున్నారు. అలాగే క్యాడర్ కే పెద్ద పీట అని చెప్పడం వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక కార్యకర్తల రాజ్యమే తీసుకుని వస్తామని తెలియచేయడం ఇవన్నీ కూడా నయా వ్యూహాలే అని అంటున్నారు.
దీని ద్వారా ఇపుడు వైసీపీ క్యాడర్ లో జోష్ పెరిగిందని అంటున్నారు. అలాగే వైసీపీ మెడికల్ కాలేజీల మీద్ పోరు బాట పట్టడం వెనక కూడా న్యూ స్ట్రాటజీలు ఉన్నాయని అంటున్నారు. ఇక పార్టీని ముందుగా గ్రౌండ్ లెవెల్ దాకా అభివృద్ధి చేయాలని పటిష్టం చేయాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది. ఈ సలహా కూడా వ్యూహకర్తదే అని చెబుతున్నారు. ఇలా వైసీపీ అన్ని విధాలుగా తన లోపాలను సరిచేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో అధికారం అందుకోవడం కోసం జోరు చేసేందుకు నయా వ్యూహకర్తను రంగంలోకి దించుతున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఆ నయా వ్యూహకర్త ఎవరు ఏమిటి అన్నది తొందరలో వెల్లడిస్తారా ఏమిటి అన్నది.