తెలుగులో `గుండె జారి గల్లంతయ్యిందే, రాజా చెయ్యి వేస్తే` లాంటి చిత్రాల్లో నటించింది ఇషా తల్వార్. నితిన్ సరసన నటించిన `గుండె జారి గల్లంతయ్యిందే` బ్లాక్ బస్టర్ విజయం సాధించగా, రెండోది యావరేజ్ గా ఆడింది. అయితే ఇషాను ఆల్మోస్ట్ టాలీవుడ్ లో మర్చిపోయారు. ఈ బ్యూటీ తెలుగు సినిమాల్లో సరైన ఆఫర్లు లేక ఇతర పరిశ్రమల్లోను అదృష్టం పరీక్షించుకుంది. ఒకే భాషలో ఆటాడటం ఇప్పుడున్న పోటీలో చాలా కష్టం. కథానాయికలకు మైలేజ్ కూడా చాలా తక్కువ. అందుకే తమిళం, హిందీ, పంజాబీ, మలయాళంలోను తనవంతు ప్రయత్నాలు చేసింది. కానీ అక్కడా ఇషా తన ప్రతిభతో నిరూపించుకుని ఆశించిన రేంజుకు చేరుకోలేకపోయింది.
రంగుల ప్రపంచంలో స్టార్ హీరోయిన్ హోదా అందుకోవడం అంటే అంత సులువు కాదు. అది అతి కొద్ది మందికి మాత్రమే రాసి పెట్టి ఉంటుంది. ఇషా లాంటి టూటైర్ నటీమణులకు ఆ అవకాశం ఎప్పటికీ ఉండదని కూడా ప్రూవ్ అయింది. అయితే కొంత గ్యాప్ తర్వాత ఇషా తల్వార్ వెబ్ సిరీస్ లలో ది బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. మీర్జాపూర్, సాస్ బహు ఔర్ ఫ్లెమింగో, ఆర్టికల్ 15 లాంటి చిత్రాల్లో అద్బుత నట ప్రతిభతో ఆకర్షించింది. ఈ ఏడాది అంతగా గుర్తుంచుకోతగని ఓ రెండు సినిమాల్లో ఇషా తల్వార్ నటించింది. వీటిలో తమిళంలో ఒకటి, హిందీలో ఒకటి ఇప్పటికే విడుదలై వెళ్లాయి.
ఇషా తల్వార్ కి అటు నార్త్ లో కానీ, ఇటు సౌత్ లో కానీ ఆశించినంత పెద్ద అవకాశాలు ఇచ్చేవాళ్లు ఎవరూ లేరు. అదే క్రమంలో తన పీఆర్ స్కిల్‌ని యాక్టివేట్ చేసినట్టే కనిపిస్తోంది. ఉన్నట్టుండి ఇప్పుడు ఒక అసందర్భపు విషయాన్ని మీడియా ఎదుట గుర్తు చేసి దానిని వివాదాస్పదం చేయాలని ప్రయత్నిస్తోంది. తనను తొలిసారి ఆడిషన్ చేసిన కాస్టింగ్ ఏజెంట్ షానూ శర్మపై ఇషా తల్వార్ ఊహించని ఆరోపణలు చేసింది. షానూ బాలీవుడ్ లో టాప్ క్లాస్ కాస్టింగ్ ఏజెంట్. ఇటీవల బ్లాక్ బస్టర్ విజయం సాధించిన `సయ్యారా` కాస్టింగ్ అనీత్ పద్దా, అహాన్ పాండేలను ఆడిషన్ చేసి పరిశ్రమకు అందించిన ప్రతిభావని. అంతకుముందు పరిణీతి చోప్రా, అనుష్క శర్మ లాంటి ప్రతిభావంతులను, హిడెన్ జెమ్స్ ని కూడా షానూ వెతికి పట్టుకుంది.
అసలింతకీ ఇషా తల్వార్ ఆరోపణ ఏమిటి? అంటే….. తనను ఆడిషన్ కి పిలిచిన షానూ జనం గుమిగూడిన ఒక బిజీ రెస్టారెంట్ లో ఒక ఏడుపు గొట్టు సీన్ లో నటించమని కోరిందని, దానికి తాను నో చెప్పానని ఇషా చెప్పింది. రెస్టారెంట్ లో అంతమంది ముందు ఆ సీన్ చేయాలా? ఒక టేబుల్ వద్ద కూచుని ఎవరికోసమో ఎదురు చూస్తూ ఏడ్వాలి. కానీ ఇషా దానిని చేసేందుకు తటపటాయించింది. అంతమందిలో అలా అడిగేసరికి కోపగించుకుంది. ఇది వింతైన అసౌకర్యమైన ఆడిషన్ అని నిందించింది. కొత్త వారిని ఆడిషన్ చేసేప్పుడు డీసెంట్ గా ఉండే నాలుగు గదుల మధ్య ఆడిషన్ చేయాలని సూచించింది.
అయితే ఇషా తల్వార్ ని ఈ పద్ధతిలో ఆడిషన్ చేయాలని షానూ ఎందుకు భావించింది? ఏ కారణంతో అలా అడిగింది? అంటే.. ఒక నటి లేదా నటుడికి ఎలాంటి సిగ్గు బిడియం లేదా అడ్డంకులు ఉండకూడదని షానూ భావించి అలా కోరిందని ఇషా తల్వార్ అంగీకరించింది. నన్ను అందరూ చూస్తుండగానే ఏడ్చే సీన్ చేయమని అడిగింది.. ఇది గందరగోళంగా వింతగా అనిపించింది. నా యుక్త (చిన్న)వయసులో అలా ఆడిషన్ చేయాలనుకోవడంతో అది నా ఆత్మవిశ్వసాన్ని దెబ్బ తీసిందని ఇషా ఆరోపించింది. ఇషా ఆరోపణలు సరే కానీ.. ఎవరైనా నటి లేదా నటుడు కెమెరా ముందు పదుల సంఖ్యలో వ్యక్తులు లేదా స్టాఫ్ ముందు నటించాల్సి ఉంటుంది. ఆన్ లొకేషన్ కూడా ఇది తప్పదు. ఒక్కోసారి వంద మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్యలో కూడా నటించాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో సిగ్గు బిడియం భేషజం వగైరా ఉండకూడదు. బహుషా షానూ అలాంటి ఒక ఉద్ధేశంతో ఇషా తల్వార్ ఆడిషన్ ని డిఫరెంట్ గా ప్లాన్ చేసారని భావించాలి. ఒక కాస్టింగ్ ఏజెంట్ గా ప్రాక్టికల్ గా ఆలోచించారు షానూ. అయినా ఇషా తల్వార్ ఆరోపణలు అందుకు భిన్నంగా లేవు. చాలా మంది కాస్టింగ్ ఏజెంట్లు సింగిల్ గా రూమ్ కి రమ్మని పిలుస్తున్న ఈ రోజుల్లో ఇషా తల్వార్ కి ఒక అద్భుతమైన అవకాశం కల్పించింది కాస్టింగ్ డైరెక్టర్ షానూ శర్మ. రణ్ వీర్ సింగ్ లాంటి అగ్ర హీరోకి షానూ శర్మ మొదటి అవకాశం కల్పించారు తన ఆడిషన్ తో..! ఇషా తల్వార్ ఇప్పుడు యుక్తవయసులో తన అపరిపక్వత గురించి మాట్లాడిందని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.