ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి తాజాగా రెండు కీలక విషయాలు.. సెగ పెంచాయి. అవి రెండు కూడా.. పరువుతో కూడుకున్నవి కావడం.. హైప్రొఫైల్ సమస్యలు కావడం గమనార్హం. దీంతో ఇప్పుడు ఆయన స్పందనపై జాతీయస్థాయిలో రచ్చ సాగుతోంది. కానీ, మిన్ను విరిగి మీద పడ్డా.. తన మౌనాన్ని మోడీ విడిచి పెట్టడం లేదు. గతంలో వ్యవసాయ చట్టాలు తెచ్చినప్పుడు భారీ ఎత్తున ఆందోళనలు సాగాయి. ఈ నేపథ్యంలోనూ మోడీ మౌనం వహించారు. అమెరికా విధించిన సుంకాలపైనా ఇప్పటి వరకు నోరు విప్పలేదు.
ఇలా.. అనేక సమస్యలు మోడీని చుట్టుముట్టిన ప్రతిసారీ ఆయన మౌనంగానే ఉంటున్నారు. అయితే.. తాజాగా మాత్రం.. ఆయన నోరు విప్పక తప్పని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిలో ప్రధానంగా మహిళా జర్నలిస్టుల కేసు.. జాతీయ మీడియాను కుదిపేస్తోంది. ఇక, ఐపీఎస్ ఆత్మహత్య కేసు కూడా ఇదే తరహా ఐపీఎస్, ఐఏఎస్‌ల మధ్య అగాథాన్ని పెంచుతోంది. ఈ రెండు పరిణామాలు కూడా.. ఢిల్లీకి చేరువలోనే చోటు చేసుకున్నాయి. అయితే.. మోడీ మాత్రం మౌనంగానే ఉన్నారు.
విషయంలోకి వెళ్తే.. అఫ్ఘాన్‌ను పాలిస్తున్న తాలిబాన్లతో భారత్ స్నేహం చేస్తోంది. ఈ క్రమంలో తాలిబాన్ల మంత్రి ఒకరు ఇటీవల భారత్ పర్యటనకు వచ్చారు. మంత్రులతో చర్చలు జరిపారు. అనంతరం.. మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే.. మహిళా జర్నలిస్టులను ఈ సమావేశానికి రాకుండా అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు, మానవహక్కులు, మహిళా హక్కుల సంఘాలు.. సహా తటస్థులుకూడా కేంద్రంపై నిప్పులు చెరుగుతున్నారు. సమానత్వం అంటే ఇదేనా?. ఇంత జరిగినా..కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు.. మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నది వారి నిలదీత.
ఇక, హరియాణాలో ఏపీకి చెందిన ఐపీఎస్ (ఐజీ స్థాయి) అధికారి పూరణ్ కుమార్ తన సర్వీస్ రివాల్వర్‌తో ఆత్మహత్యకు ఒడిగట్టాడు. అయితే.. ఈ కేసులో కుల వివక్ష ప్రధానంగా పాత్ర పోషించదని ఆయన సతీమణి.. సీనియర్ ఐఏఎస్ అధికారి ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. తాను ఫిర్యాదు చేస్తే.. పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని చెబుతున్నారు. నిజానికి ఆత్మహత్యలు చేసుకున్న ఐపీఎస్‌లు చాలా మందే ఉన్నా.. ఉద్యోగంలో పై అధికారులు తనపట్ల కుల, వర్ణ వివక్ష చూపించారని ఆధారాలతో సహా మృతి చెందిన ఐపీఎస్ నోట్ రాశారు.
ఈ పరిణామాలు ఐఏఎస్-ఐపీఎస్‌ల మధ్య వివాదాన్ని పెంచాయి. దీనిపై కేంద్రం మౌనంగా ఉండడాన్ని ఐఏఎస్‌ల సంఘం ప్రశ్నించింది. మోడీ జోక్యం చేసుకోవాలని కోరుతున్నా యి. ఒకవైపు బీహార్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోడీ రియాక్షన్ తప్పదు. కానీ, ఆయన మాత్రం మౌనంగానే ఉన్నారు.