ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే విడుదల చేసింది. ప్రతి ఆర్నెల్లకు ఒకసారి ఈ సర్వేను నిర్వహిస్తోంది ఇండియా టుడే. దేశంలో వివిధ అంశాలపై నిర్వహించే సర్వేలో ముఖ్యమంత్రుల పనితీరు ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తోంది. గత ఏడాది ఆగస్టులో నిర్వహించిన సర్వేలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 5వ ర్యాంకు తెచ్చుకోగా, ఆ తర్వాత ఆరు నెలలకు అంటే ఫిబ్రవరిలో చేసిన సర్వేలో ఒక స్థానం మెరుగుపరచుకుని 4వ స్థానం దక్కించుకున్నారు. ఇక తాజాగా నిర్వహించిన సర్వేలో కూడా చంద్రబాబు తన సత్తా చాటుకున్నారు.
ముఖ్యమంత్రుల పనితీరు, వారికి ఉన్న ప్రజాదరణను లెక్కించి ఇండియా టుడే సర్వేలో ర్యాంకులు కేటాయిస్తుంది. ఈ అర్థ సంవత్సరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గతం కంటే ఎక్కువ మెరుగైన పనితీరు కనబరిచి 3వ ర్యాంకు సాధించారు. 15 నెలల క్రితం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు చాలా వేగంగా మూడో ర్యాంకును అందుకోవడం విశేషంగా చెబుతున్నారు. గత ఏడాది జూన్ లో ఎన్నికల ఫలితాలు విడుదల కాగా, చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నుంచి చంద్రబాబు పెట్టుబడులు, పరిశ్రమలు, యువతకు ఉద్యోగాలు, సంక్షేమ కార్యక్రమాలు అంటూ దూసుకుపోతున్నారు. ఈ 15 నెలల్లోనే దాదాపు పది లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి అంతే సంఖ్యలో యువతకు ఉద్యోగాలు వచ్చేలా ప్రయత్నించారు. దీంతో ఆయనకు అన్ని విధాల ఆదరణ పెరిగిందని ఇండియా టుడే సర్వేలో వెల్లడైందని విశ్లేషిస్తున్నారు. తాజాగా ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో దేశంలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తొలిస్థానంలో నిలిచారు. ఆయన తర్వాత రెండో స్థానంలో బెంగాల్ సీఎం మమతాబెనర్జీ నిలిచారు. ఆర్నెల్ల క్రితం నిర్వహించిన సర్వేలో కూడా ఈ ఇద్దరే ఒకటి, రెండు స్థానాల్లో నిలిచారు. అప్పుడు మూడో స్థానంలో నిలిచిన తమిళనాడు సీఎం స్టాలిన్ ను వెనక్కి నెట్టి చంద్రబాబు ఇప్పుడు ఆ స్థానాన్ని ఆక్రమించారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియా టుడే మూడు సర్వేలు చేయగా, ప్రతిసారి చంద్రబాబు తన స్థానం మెరుగుపరచుకుంటేనే వస్తున్నారు. ఈ ఊపులో వచ్చేసారి ఆయన స్థానం మరింత మెరుగుపడుతుందా? లేదా? అనే ఆసక్తి ఏర్పడుతోంది. యోగి ఆదిత్యనాథ్, మమతా బెనర్జీ వరుసగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఎన్నికవుతూ వస్తున్న విషయం తెలిసిందే. వారికంటే బాబు సీనియర్ అయినప్పటికీ మధ్యలో కొన్నిసార్లు ఆయన అధికారం చేజార్జుకోవడం వల్ల ఇప్పుడు ప్రజాదరణలో వారి వెనక నిల్చొవాల్సివచ్చిందనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.