భారత ఆటోమొబైల్ చరిత్రలో మారుతి సుజుకీ ఇండియా అపూర్వమైన మైలురాయిని చేరుకుంది. తాజాగా విడుదలైన ప్రపంచ మార్కెట్ గణాంకాల ప్రకారం.. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకీ, ప్రపంచంలో అత్యంత విలువైన ఆటో కంపెనీల జాబితాలో 8వ స్థానాన్ని దక్కించుకుంది. దీని మార్కెట్ విలువ ఏకంగా 5,760 కోట్ల డాలర్లకు (దాదాపు రూ.5.11 లక్షల కోట్లు) చేరుకుంది. ఈ సంచలన ప్రదర్శనతో మారుతి సుజుకీ పలు అంతర్జాతీయ ఆటో దిగ్గజాలను సైతం వెనక్కి నెట్టడం విశేషం.
మారుతి సుజుకీ ఈ తాజా ర్యాంకింగ్‌తో అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజాలైన ఫోర్డ్ మోటార్స్ (4,630 కోట్ల డాలర్లు), జనరల్ మోటార్స్ (5,710 కోట్ల డాలర్లు) , జర్మనీకి చెందిన ప్రముఖ సంస్థ ఫోక్స్‌వేగన్ ఏజీ (5,570 కోట్ల డాలర్లు) వంటి వాటిని సైతం అధిగమించింది.
అంతేకాకుండా మారుతి సుజుకీ తన జపాన్ మాతృసంస్థ అయిన సుజుకీ మోటార్ కార్పొరేషన్‌ను (2,900 కోట్ల డాలర్లు) కూడా మార్కెట్ విలువలో అధిగమించింది. ఈ విజయం ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్‌లో ముఖ్యంగా భారత మార్కెట్‌లో మారుతి సుజుకీ ప్రాధాన్యత, బలం ఎంత పెరిగిందో స్పష్టంగా తెలియజేస్తుంది.
ప్రపంచంలో అత్యధిక మార్కెట్ విలువ కలిగిన టాప్ 8 ఆటో కంపెనీలు (డాలర్లలో)
1.టెస్లా – 147 లక్షల కోట్లు
2.టయోటా – 31,400 కోట్లు
3. బీవైడీ – 13,300 కోట్లు
4.ఫెరారీ ఎన్‌వీ – 9,270 కోట్లు
5. బీఎండబ్ల్యూ – 6,130 కోట్లు
6. మెర్సిడెస్ బెంజ్ – 5,980 కోట్లు
7.హోండా మోటార్ – 5,900 కోట్లు
8. మారుతి సుజుకీ ఇండియా – 5,760 కోట్లు
ఉత్సవ సీజన్‌లో ఆటో రంగ జోష్
మారుతి సుజుకీ ఈ విజయాన్ని అందుకోవడం పండుగల సీజన్‌లో దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. పండుగల నేపథ్యంలో రిటైల్ , ఫైనాన్స్ రంగంలోనూ సానుకూల వాతావరణం కొనసాగుతోంది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మొదటి రెండు రోజుల్లోనే ఏకంగా 38 కోట్లకు పైగా కస్టమర్లు పోర్టల్‌ను సందర్శించి కొనుగోళ్లు జరిపారు.
బజాజ్ ఫిన్‌సర్వ్ ఏఎంసీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ నిర్వహణలో ఉన్న ఆస్తులు (AUM) రూ.5,410 కోట్లకు చేరాయి.
ఎల్ & టీ ఫైనాన్స్ ద్విచక్ర వాహనాల కోసం ‘నో కాస్ట్ ఈఎంఐ’, ‘ప్రాంప్ట్ పేమెంట్ రిబేట్’, ‘ఫెస్టివ్ స్పెషల్ EMI లైట్’ వంటి ఆకర్షణీయమైన పండగ ఆఫర్లను ప్రకటించి వినియోగదారులను ఆకర్షిస్తోంది.
మారుతి సుజుకీ సాధించిన ఈ ప్రపంచస్థాయి విజయం భారత ఆటోమొబైల్ రంగానికి ఒక కొత్త ప్రతిష్టను తెచ్చిపెట్టింది. దేశీయంగా తయారైన కార్ల సంస్థ అంతర్జాతీయంగా దిగ్గజ కంపెనీలకు పోటీ ఇవ్వడం భారత ఆర్థిక, పారిశ్రామిక శక్తికి నిదర్శనం.